ఎమ్మెల్సీ ఓటర్లపై ‘ఒమిక్రాన్’ ఎఫెక్ట్.. టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్.. టెన్షన్

by Anukaran |
trs 1
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకే మెజారిటీ ఓటర్లు ఉన్నా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందని అధిష్టానం భావించి మంత్రులు, ఎమ్మెల్యేలతో క్యాంపులకు పంపింది. దీంతో హైదరాబాద్ రిసార్టుల్లో కొన్ని రోజులు ఉంచి.. ఆ వెంటనే కొందరిని బెంగళూరు, గోవా ఇతర ప్రదేశాలకు పంపించింది. ఎంచక్కా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేందుకు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఇతర ఓటర్లు ఏసీ బస్సెక్కి బయల్దేరారు. ఇన్ని రోజులు ఎలాంటి టెన్షన్ లేకుండా గడిపిన ఓటర్లను నిన్నటి నుంచి ఓ విషయం నిద్రలేకుండా చేస్తున్నట్లు తెలిసింది.

ముఖ్యంగా గత రెండు, మూడు రోజులుగా కరీంనగర్ ఓటర్లు బెంగళూరులో మకాం వేశారని, ఆ సిటీలోనే గురువారం ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో ఓటర్లలో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ప్రపంచ దేశాలే వణుకుతుండటంతో ఎక్కడ దాని వ్యాప్తి పెరిగి మాకు సోకుతుందోనని తెగ జాగ్రత్తలు పడుతున్నారట. పార్టీ కోట్లు ఖర్చు చేసి ఎంజాయ్ చేయండయ్యా అని చెప్పినా కూడా మూతికున్న మాస్క్ తీసేందుకు జంకుతున్నారు. అయితే, బెంగళూరులో ఉన్న వారిని గోవాకు షిప్ట్ చేయడంతో ఊపిరిపీల్చుకోగా.. కొత్త బ్యాచ్ గోవా నుంచి బెంగళూరు రావడం గమనార్హం.

ఇది ఇలా ఉండగా.. ఒమిక్రాన్ గురించి గ్రామాల్లోనూ ప్రచారం కావడంతో.. క్యాంపుకెళ్లిన ప్రజాప్రతినిధులు టెస్టులు చేసుకున్నాకే గ్రామాల్లోకి రానివ్వాలని ప్రజల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే మెదక్ జిల్లా పరిధిలో క్యాంపునకు వెళ్లిన టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఓటింగ్ కు వచ్చే ముందు టెస్టు చేసుకొని రావాలంటూ కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టారు.

Advertisement

Next Story