మిషన్ భగీరథపై మంత్రి సీతక్క సమీక్ష

by M.Rajitha |
మిషన్ భగీరథపై మంత్రి సీతక్క సమీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: వారంలో నాలుగు రోజులు మిషన్ భగీరథ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలోనే ఉండాలని, మండలంను యూనిటీగా తీసుకుని ఎంపీడీవో, ఇంట్రా ఏఈ, గ్రిడ్ ఏఈ, మండల స్పెషల్ ఆఫీసర్ లతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని గ్రామీణాభివ్రుద్ది, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం ఎర్ర మంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో సీఈ, ఎస్ఈ, ఈఈ, డీఈ లతో జిల్లాల వారీగా తాగు నీటి సరఫరా పై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ కమిటీలు సమన్వయంతో పని చేసి ఎక్కడ తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని, వరుసగా పండుగలు వస్తున్న నేపథ్యంలో ప్రజలంతా ఊర్లలోనే ఉంటున్నందున, మూడు రోజుల పాటు తాగు నీటి సరఫరాకు ఇబ్బందులు రావద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునే విధంగా ప్రత్యేక బడ్జెట్ ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్ అండ్ బి రోడ్లు, ఎలక్ట్రిసిటీ పనుల వల్ల ఎక్కడెక్కడ మిషన్ భగీరథ పైపులు దెబ్బతింటున్నాయో, దీనివల్ల అక్కడక్కడ తాత్కాలికంగా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయన్నారు.

జిల్లా కలెక్టర్లతో, వర్క్ ఇన్స్పెక్టర్లతో సమన్వయం చేసుకొని అభివృద్ధి పనుల సందర్భంగా మిషన్ భగీరథ పైపులు డ్యామేజ్ కాకుండా చూసుకోవాలన్నారు. . స్థానికంగా నీటి వనరులు అందుబాటులో ఉన్నచోట బోర్ వెల్స్ ను హైర్ చేసుకోవాలన్నారు. గత పదేళ్లలో వేల సంఖ్యలో బోర్లను పట్టించుకోలేదని, వాటన్నిటిని మరమత్తులు చేసి సిద్ధంగా ఉంచామని తెలిపారు. మిషన్ భగీరథ వ్యవస్థ ఏర్పాటు గాని గ్రామాలను ప్రత్యేకంగా పరిగణించాలన్నారు. కొందరు తమ వీధుల్లో బోర్లు వేయించుకునేందుకు తాగునీటి సమస్యలు ఉన్నట్టుగా చెబుతున్నారని, తాగునీటి సరఫరాకు అవసరమైనంత నీటి నిల్వలు ఉన్నాయన్నారు. కొత్త బోర్ల వైపు వెళ్లకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎమ్మెల్యేలతో మిషన్ భగీరథ అధికారులు సమావేశం కావాలని, వారి అభిప్రాయాలకు అనుగుణంగా నీటి సరఫరాపై చర్యలు తీసుకోవాలన్నారు.

చలివేంద్రాల ఏర్పాటు:


వేసవి లో పనుల కోసం వీధుల్లోకి వచ్చే ప్రజలకి తాగునీటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు సీఎం, మంత్రి సీతక్క ఆదేశాలతో పల్లెల్లో, మండల కేంద్రాల్లో 4818 చలివేంద్రాలను రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఏర్పాటు చేసింది. వేసవి కాలంలో పనుల నిమిత్తం ప్రజలు బయటకు వెళ్తుంటారని, గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ ద్వారా ఇంటింటికి మంచినీరు సరఫరా చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. తాగునీటిని ఉచితంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలన్న సంకల్పంతో గ్రామాల్లో మండలాల్లో విరివిగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో, వాణిజ్య కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా డిపిఓలు చర్యలు తీసుకోవాలని, చలివేంద్రాల నిర్వహణ బాధ్యతను పంచాయతీరాజ్ శాఖ తీసుకోవాలని సూచించారు. చలివేంద్రాలకు తగినంత నీటిని, మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేయాలని, మిషన్ భగీరథ నీటి కొరత లేదన్నారు. అన్ని చలివేంద్రాలకు మిషన్ భగీరథ నీళ్లు అందేలా డీపీఓ, ఎంపీఓ లు చూడాలన్నారు. అవసరం ఉన్న ప్రతి చోట విధిగా పంచాయతీరాజ్ శాఖ చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని, తద్వారా చలివేంద్రాలు ప్రజలకు ఉపయోగపడటంతో పాటు, మిషన్ భగీరథ నీటిపై విశ్వాసం కలుగుతోందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

మిషన్ భగీరథ బోర్డు చైర్మన్‌గా మంత్రి సీతక్క

దిశ, తెలంగాణ బ్యూరో: మిషన్ భగీరథ డైరెక్టర్ల బోర్డును రీ కానిస్టిట్యూషన్ చేశారు. బోర్డు చైర్మన్, డైరెక్టర్‌గా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క నియామకం అయ్యారు. శుక్రవారం మంత్రి సీతక్క అధ్యక్షతన ఎర్ర మంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మిషన్ భగీరథ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 23 అంశాలకు ఆమోదం తెలిపారు. గత బోర్డు మీటింగులో తీసుకున్న నిర్ణయాలను అమల్లోకి తీసుకొచ్చారు. అందులో ప్రధానంగా డిజైన్, డెవలప్మెంట్, మెయింటెనెన్స్ ఆఫ్ బిల్స్ మానిటరింగ్ సిస్టం కోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సేవలను 2024-25 కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటర్నల్ ఆడిట్ నివేదికలు, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌కు ఆమోదం తెలిపారు. ప్రస్తుతం వినియోగిస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ల సేవలను 2025-26 ఏడాదికి సైతం కొనసాగించాలని తీర్మానం చేశారు. అలాగే.. ఇంటర్నల్ ఆడిటింగ్ కోసం ప్రస్తుతం ఉన్న సెక్రెటేరియల్ ఆడిటర్స్ సేవలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.

పైప్‌లైన్ మరమ్మతులు, నిర్వహణపై అకౌంటింగ్ పాలసీ ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో జరిగిన జల్‌ జీవన్ మిషన్ సమావేశానికి హాజరైన అధికారుల ప్రయాణ ఖర్చుల చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మిషన్ భగీరథ కనెక్షన్లను తొలగించిన కంపెనీల బకాయిలను రద్దు చేయాలని నిర్ణయించారు. కాగా.. కొత్త బోర్డు ఆఫ్ డైరెక్టర్లను నియమిస్తూ సమావేశంలో ప్రకటించారు. బోర్డు చైర్మన్, డైరెక్టర్‌గా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, డైరెక్టర్లుగా పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి రామక్రుష్ణారావు, మున్సిపల్ అర్బన్ డెవలప్ మెంట్ కమిషనర్ టీ.కె. శ్రేదేవి, రూరల్ డెవలప్ మెంట్ కమిషనర్ జి.శ్రీజన, మిషన్ భగీరథ చీఫ్ ఇంజనీర్ జి.కృపాకర్ రెడ్డి, ఈఎన్సీ ఐ అండ్ కాడ్ జి.అనిల్‌కుమార్, హడ్కో రీజినల్ డైరెక్టర్ పి.వెంకటేశ్వరరెడ్డి, మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్లు పి.శ్రీనివాస్‌రెడ్డి, జె.మధుబాబును నియమించారు.

Next Story