62వ పుట్టినరోజుకి 62 కిలోమీటర్లు!

by Shyam |
62వ పుట్టినరోజుకి 62 కిలోమీటర్లు!
X

దిశ, వెబ్‌డెస్క్: వయస్సు పెరిగేకొద్దీ కండరాల్లో శక్తి తగ్గుతుందంటారు. కానీ, కొందరు మాత్రం వయసు పెరుగుతున్నా బలంగా ఉండి, యువకులతో సమానంగా ఫిట్‌గా ఉంటారు. ఎంత ఫిట్‌గా ఉన్నా పరిగెత్తే విషయంలో ఎంతో కొంత వయస్సు పెరిగిన ప్రభావాలు కనిపిస్తాయి. అవును..ఇంట్లో కూర్చొని బరువులు ఎత్తడంలో, కండలు పెంచడంలో పెరిగిన వయస్సు పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. కానీ, పరిగెత్తాలంటే మాత్రం కాస్త ఇబ్బందిపడతారు. అయితే, హర్యానాలోని పానిపట్‌కు చెందిన జస్మెర్ సింగ్ సాంధూ మాత్రం పరిగెత్తడంలో యువకులకు గట్టిపోటీని ఇస్తున్నారు. ఇటీవల 62వ పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసిన ఓ ఫీట్‌ను నెటిజనాలు తెగ కొనియాడుతున్నారు. ఇంతకీ ఆయనేం చేశారు? తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

ఫ్లైయింగ్ సాంధూ అని అందరూ పిలుచుకునే 62 ఏండ్ల జస్మెర్ సింగ్ తన పుట్టినరోజున 62.4 కిలోమీటర్లు పరిగెత్తాడు. తన వయస్సు కంటే ఒక అర కిలోమీటరు ఎక్కువనే పరిగెత్తిన వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ మొత్తం దూరాన్ని 7 గంటల 32 నిమిషాల్లో పరిగెత్తడం విశేషం. సాంధూ పెట్టిన వీడియోను చూసిన ట్విట్టర్ జనాలు ఆయనను తెగ పొగిడేస్తున్నారు. ఆ వీడియోను ఎగబడి షేర్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ వీడియోకు 5.17 లక్షల వ్యూస్ రాగా, 38,700 లైకులు వచ్చాయి. వయస్సు ఎంత పెరిగినా ఫిట్‌గా ఉండాలనే సూత్రాన్ని నమ్మే సాంధూ గతంలో కూడా ఎన్నో పరుగు పందేలలో పాల్గొని విజయాలు సాధించాడు. ఈ పుట్టినరోజుకు ఇలా చేయడం ద్వారా సాంధూ అటు వృద్ధ తరానికి, ఇటు యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారని నెటిజన్లు అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed