ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీకి సిద్ధం: ఓలా!

by Harish |
ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీకి సిద్ధం: ఓలా!
X

దిశ, వెబ్‌డెస్క్: దాదాపు 10 వేల ఉద్యోగాలను సృష్టించే విధంగా ‘ప్రపంచంలోనే అతిపెద్ద స్కూటర్ తయారీ ప్లాంట్‌’ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా సోమవారం వెల్లడించింది. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు ఓలా తెలిపింది. సాఫ్ట్‌ బ్యాంక్ ఆధారిత సంస్థ ఈ కర్మాగారాన్ని స్థాపించేందుకు సుమారు రూ. 2,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుందని పేర్కొంది. ఈ కర్మాగారంలో ఏడాదికి 20 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఓలా పేర్కొంది.

అలాగే చిన్న నగరాలు, పట్టణాలకు సేవలను అందించే విధంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీని నిర్వహించనుంది. రాబోయే నెలల్లో తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్‌ను విడుదల చేయడానికి సన్నద్ధమవుతున్నామని ఓలా వెల్లడించింది. భవిష్యత్తులో భారత్‌తో పాటు యూరప్, ఆసియా, లాటిన్ అమెరికా వంటి అంతర్జాతీయ మార్కెట్‌లలో వినియోగదారులకు సేవలందించనున్నట్టు ఓలా ఓ ప్రకటనలో తెలిపింది. 2016లో టూ-వీలర్ విభాగంలోకి ప్రవేశించిన ఓలా భారత్‌లో మొత్తం 3 లక్షల మందికి జీవనోపాధిని కల్పించింది.

Advertisement

Next Story