ఆకట్టుకున్న ఓలా మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్

by Harish |
ఆకట్టుకున్న ఓలా మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలో అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు సంబంధించి టీజర్‌ను కంపెనీ సహ-వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జులైలో లాంచ్ చేయనున్న ఓలా మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ని భవిష్ అగర్వాల్ స్వయంగా రోడ్లపై నడిపి చూపించారు. అంతేకాకుండా స్కూటర్‌కు సంబంధించి పలు ఫీచర్లను ఆయన వివరించారు. ఈ సరికొత్త ఈ-బైక్ 0-60 కిలోమీటర్ల వేగాన్ని అత్యంత తక్కువ సమయంలో అందుకుంటుందని, మార్చుకోవడానికి వీలుగా లిథియం అయాన్ బ్యాటరీతో ఈ స్కూటర్ వస్తోందని ఆయన వివరించారు.

అలాగే, స్కూటర్ సీట్ కింది భాగంలో రెండు హాఫ్-హెల్మెంట్లు పట్టేంత ఖాళీ స్థలం ఉంటుందని ఆయన తెలిపారు. అలాగే, మోటార్, బ్యాటరీ, వెహికల్ కంప్యూటర్ సహా పూర్తిగా అధునాతన ఫీచర్లను ఈ బైక్‌లో అమర్చినట్టు భవిష్ అగర్వాల్ చెప్పారు. దీని వేగం, రైడింగ్ అనుభవం సహా అన్ని రకాలుగా కొత్త టెక్నాలజీ పరిజ్ఞానం ఇందులో లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, స్కూటర్‌కు ఇన్‌స్టాలేషన్ అవసరంలేని హోమ్ ఛార్జర్ వస్తుందనే అంచనాలు పరిశ్రమ వర్గాల్లో ఉన్నాయి. దీనివల్ల వినియోగదారులు తమ ఈ-స్కూటర్‌ను ఇంట్లోనే రెగ్యులర్ వాల్-సాకెట్‌తో ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాగా, తమిళనాడులో 500 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తి ప్లాంట్‌లో ఓలా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నిర్మిస్తోంది. దీనికోసం కంపెనీ మొత్తం రూ. 2,400 కోట్ల పెట్టుబడులు పెట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story