అధికారుల నిర్లక్ష్యం.. సూసైడ్ అటెంప్ట్ చేసిన రైతులు (వీడియో)

by Anukaran |   ( Updated:2021-08-17 05:52:42.0  )
అధికారుల నిర్లక్ష్యం.. సూసైడ్ అటెంప్ట్ చేసిన రైతులు (వీడియో)
X

దిశ, వెల్గటూర్ : జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం, వెల్గటూర్ గ్రామ శివారులో గల పెద్ద వాగులో ప్రభుత్వం కాళేశ్వరం లింక్ 2 ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టింది. దీని కోసం రెవెన్యూ అధికారులు మండలంలోని రాజక్కపల్లి, వెల్గటూర్ గ్రామ శివారులలో సర్వే చేసి ప్రభుత్వ, ప్రైవేటు భూములు, బావులు, పైప్ లైన్లకు సంబంధించిన లెక్క తేల్చారు. ఈ మేరకు ప్రభుత్వం 385.23 ఎకరాల భూమి పోతున్నట్లు, అర్హుల వివరాలను ప్రకటిస్తూ లేఖను విడుదల చేసింది.

ఇక్కడ వరకు బాగానే ఉన్నా నిర్వాసితులకు అందిస్తున్న నష్ట పరిహారంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో భారీగా అవకతవకలు జరిగాయి. ఒకరికి సంబంధించిన భూమి ఇంకొకరి పేరుమీద నమోదు చేయడంతో నష్టపరిహారం డబ్బులు వారి ఖాతాల్లోకి వెళ్లగా గ్రామాల్లో పంచాయితీ మొదలైంది. కొందరికి సంబంధించిన వ్యవసాయ బావులు, పైపులైన్‌లను నమోదు చేయకపోవడంతో వారికి నష్ట పరిహారం రాకుండా పోయింది.

కొందరి వద్ద చేతివాటం ప్రదర్శించి ప్రభుత్వ భూములకు కూడా నష్టపరిహారం ఇప్పించినట్లు మండలంలో జోరుగా చర్చ జరుగుతోంది. రహదారి పక్కన లక్షల్లో విలువ పలుకుతున్న కమర్షియల్ భూములకు కూడా వ్యవసాయ భూములకు ఇచ్చినంతనే నష్ట పరిహారం అందించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నష్ట పరిహారం విషయంలో తనకు అన్యాయం జరిగిందని కొద్ది రోజుల క్రితం రెవెన్యూ కార్యాలయం ఎదుట మండలంలోని రాజక్కపల్లి గ్రామానికి చెందిన దొరిశెట్టి శ్రీనివాస్ అనే రైతు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు.

అయినా అతని సమస్యను పరిష్కరించడంలో అధికారులు ఏమాత్రం చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. పరిహారం లిస్టులో పేరు రాలేదని, నష్టపరిహారం ఇవ్వడం కుదరదని తేల్చి చెబుతూ ఆందోళనకు గురి చేస్తున్నారు. కాగా హైదరాబాద్ నుంచి ప్రత్యేక అధికారులు వచ్చి కమర్షియల్ భూములను సర్వే చేసి, దాని ధర నిర్ణయిస్తారని తెలిపిన రెవెన్యూ అధికారులు, ఇప్పుడు మాట మార్చారు. వాటికి సరైన నష్టపరిహారం రావాలంటే కోర్టుకు వెళ్లాలని సూచిస్తున్నారు.

కోర్టుకు వెళితే పరిహారంలో 20 నుంచి 30 శాతం వరకు కోర్టు ఫీజును వకీలుకు చెల్లించాల్సి వస్తుందని, ఆ డబ్బులను ఎవరు చెల్లిస్తారని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పంపు హౌస్‌లో కోల్పోయిన భూములకు నష్టపరిహారం అందించాలని, కమర్షియల్ భూములకు వేరే ధర చెల్లించి న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.

పూర్తిస్థాయి నష్ట పరిహారం అందిచాలి..
దొరిశెట్టి సత్తన్న : రాజక్కపల్లి

– 38 గుంటల భూమికి నష్టపరిహారం రావాల్సి ఉండగా, 17 గుంటలకు మాత్రమే ఇచ్చారు. 21 గుంటలకు సంబంధించిన భూమిని వేరొకరి పేరున నమోదు చేయడంతో దాని పరిహారం అతడికే వెళ్ళింది. రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నష్ట పరిహారం ఇప్పించాలి.

కమర్షియల్ అవార్డు కింద ప్రకటించాలి
పత్తిపాక వెంకటేష్ : రాజక్కపల్లి(మాజీ ఎంపీటీసీ)

– లక్షలలో ధర పలుకుతున్న కమర్షియల్ భూములకు, వ్యవసాయ భూములకు ఇచ్చిన విధంగానే ధరకట్టి పరిహారం అందించారు. 51 గుంటల కమర్షియల్ భూమి పోవడంతో చాలా నష్టపోయాను. కమర్షియల్ అవార్డు కింద ప్రకటించి పరిహారం అందించాలి.

పైప్‌లైన్‌కు పరిహారం రాలేదు..
దొరిశెట్టి శ్రీనివాస్ : రాజక్కపల్లి

పంప్ హౌస్ నిర్మాణంలో పైప్‌లైన్ పోయింది. పరిహారం లిస్టులో పేరు రాలేదు. ఇప్పుడు నష్టపరిహారం రాదంటూ అధికారులు ఆందోళనకు గురి చేస్తున్నారు. నష్టపరిహారం ఇప్పించి న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.

Advertisement

Next Story

Most Viewed