ఓరి నీ దుంపతెగ..పైకి MBBS డాక్టర్‌నని బిల్డప్ కానీ..డిగ్రీ పెయిల్

by Naveena |
ఓరి నీ దుంపతెగ..పైకి MBBS డాక్టర్‌నని బిల్డప్ కానీ..డిగ్రీ పెయిల్
X

దిశ, కామారెడ్డి : డాక్టర్ నని నమ్మించి పలు ఆస్పత్రుల్లో చేరి వైద్యం చేసిన ఓ నకిలీ డాక్టర్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. తనకు తెలిసిన ఆర్ఎంపీల వద్ద చికిత్స ఎలా చేయాలో వివరాలు తెలుసుకుని కామారెడ్డితో పాటు పలు ప్రాంతాల్లో వైద్యునిగా చేరి చికిత్సలు అందిస్తున్న నకిలీ వైద్యుడిని కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఫిర్యాదు మేరకు నకిలీ వైద్యుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఏఎస్పి చైతన్య రెడ్డి తెలిపారు. గురువారం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపుర్ గ్రామానికి చెందిన ముల్కల రవీందర్ డిగ్రీ ఫెయిల్ అయ్యాడు. డబ్బు సంపాదనే లక్ష్యంగా స్థానికంగా ఉండే ఆర్ఎంపీ వైద్యుల వద్ద చికిత్స ఎలా చేస్తారో తెలుసుకుని తాను గాంధీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివానని కుటుంబ సభ్యులతో పాటు అందరినీ నమ్మించాడు.

తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఇచ్చే సర్టిఫికెట్లను ఆన్లైన్ లో పరిశీలించి తన పేరుకు దగ్గరగా ఉన్న రవీందర్ రెడ్డి అనే పేరుతో ఉన్న సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేసుకున్నాడు. తన పేరును రవీందర్ రెడ్డిగా ఫోటో షాప్ లో ఆధార్ కార్డు, నకిలీ సర్టిఫికెట్ తయారు చేసి ఫోటో మార్పు చేసుకున్నాడు. ఫేక్ సర్టిఫికెట్ తో కామారెడ్డి స్టార్ హాస్పిటల్ లో మార్చ్ 2023 నుంచి జులై 2023 వరకు, ఆరోగ్య ఆస్పత్రిలో ఆగస్ట్ 2023 నుంచి జనవరి 2024 వరకు, ఫిబ్రవరి 2024 నుంచి జూలై 2024 వరకు లింగంపేట భీమరాజు ఆస్పత్రిలో ఆగస్ట్ 2024 నుంచి డిసెంబర్ 2024 వరకు, తిరిగి మళ్ళీ కామారెడ్డిలో స్టార్ హాస్పిటల్ లో ఎంబీబీఎస్, ఎండి, జనరల్ మెడిసిన్, పిల్లల వైద్యునిగా కొనసాగాడు. ఖానాపూర్ లోని షణ్ముఖ ఆస్పత్రిలో పిల్లల వైద్యునిగా పని చేయడానికి ఈ నెల 6న అడ్వాన్సుగా 2 లక్షలు తీసుకున్నాడు. రవీందర్ రెడ్డి అనే వ్యక్తి అసలు వైద్యుడే కాదని, వైద్యునిగా చలామణి అవుతున్నాడని తెలంగాణ మెడికల్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కాగా ఇతని వద్ద నుంచి ఫేక్ ఆధార్ కార్డు, సర్టిఫికెట్లు, మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకుని కోర్టులో హజరు పర్చనున్నట్లు ఎఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో కామారెడ్డి పట్టణ, రూరల్ సీఐలు చంద్రశేఖర్ రెడ్డి, రామన్, సీసీఎస్ సిఐ శ్రీనివాస్, కామారెడ్డి, దేవునిపల్లి ఎస్సైలు శ్రీరామ్, రాజు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story