నగరశివారులో రూ. వెయ్యి కోట్ల పార్కులు ఏమయ్యాయి..?

by Anukaran |   ( Updated:2021-01-04 20:33:35.0  )
నగరశివారులో రూ. వెయ్యి కోట్ల పార్కులు ఏమయ్యాయి..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగర శివారల్లో వెలిసిన వెంచర్లలో ఓపెన్ స్పేస్‌లు కనుమరుగవుతున్నాయి. ఫలితంగా ప్లాట్ల యజమానులపై భారం పడుతోంది. ఇప్పటికే రూ.1000 కోట్ల పార్కులు మాయమైనట్లు తెలుస్తోంది. బై నెంబర్లతో ప్లాట్ల విక్రయాలు చేపట్టిన ఘనులు వాటికున్న అడ్డంకులను ఇప్పుడు ఎల్ఆర్ఎస్‌తో క్లియర్ చేసుకుంటున్నారు. కాగితాల్లో మాత్రమే కనిపిస్తూ.. వాస్తవంలో ప్లాట్లుగా మారుతున్న పార్కుల తతంగంపై ప్లాట్ల యజమానులు పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ వాటిని పట్టించుకునే నాథుడే లేడని వారు వాపోతున్నారు.

ఎల్ఆర్ఎస్ స్కీం సామాన్యులకు భారం కావడానికి కారణం ఓపెన్ స్పేస్‌లు కనిపించకపోవడమే. ప్రతి ప్లాట్ యజమాని ఆ భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ పాపం రియల్టర్లదే. వెంచర్లు వేసినప్పుడేమో పక్కాగా ఓపెన్ స్పేస్‌లు, పార్కులు, స్కూళ్లు, ప్లే గ్రౌండ్స్ అంటూ స్థలాలను చూపించారు. దశాబ్దాలుగా పంచాయతీ అనుమతి తీసుకున్నామని చూపిస్తూ వినియోగదారులను ఆకట్టుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్తు సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు. దాంతో తక్కువ ధరకే వస్తుందని ఎగబడి ప్లాట్లు కొనుగోలు చేశారు. 90 శాతం మంది రేటు బాగా వచ్చినప్పుడో, అవసరాలకో అమ్ముకోవడానికో పెట్టుబడి నేపథ్యంలోనే ప్లాట్లను కొన్నారు. అయితే ఊరికి దూరంగా ఉండడం, నివాసానికి అప్పటికప్పుడు పనికి రాకపోవడంతో వృథాగా ఉంచారు.

ఈ క్రమంలో ప్లాట్ల యజమానులెవరూ వారి ప్రాపర్టీస్‌ను ఏండ్ల తరబడి చూసుకోకుండా ఉన్నారు. దాంతో లేఅవుట్లలో చూపిన ఖాళీ స్థలాలకు బై నెంబర్లు వేసి ఇతరులకు కట్టబెట్టిన ఉదంతాలు వెలుగులోకొచ్చాయి. ఇక అంగబలం, అర్ధ బలం, రాజకీయ అండదండలు కలిగిన రియల్టర్లయితే ఇండ్లు కట్టి మరీ అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. పంచాయతీలు మున్సిపాలిటీలుగా, కార్పొరేషన్లుగా మారిన తర్వాత స్థలాల ధరలకు రెక్కలొచ్చాయి. లేఅవుట్లలో ఖాళీ ఉన్న కొన్ని ప్లాట్లతో పాటు వీటిని అమ్మారన్న ఆరోపణలున్నాయి. ఇదేమి దందా అని కాలనీవాసులు, ప్లాట్ల యజమానులు మొత్తుకున్నా రిజిస్ట్రేషన్లు మాత్రం ఆగలేదు. లిఖితపూర్వకంగా రాసిచ్చినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. హైదరాబాద్ నగర శివార్లలో సుమారు రూ.1000 కోట్ల విలువైన ప్లాట్లు అదృశ్యమైనట్లు అంచనా. 90 శాతం కాలనీలు, లేఅవుట్లల్లో వెంచర్లలో పేర్కొన్న ఖాళీ స్థలాలు యథాతథంగా లేవు. అక్రమ లేఅవుట్లపై అధికారులకు కూడా అధికారం లేకుండాపోయింది. దాంతో ఫిర్యాదులకు విలువ లేకుండాపోయింది. యథేచ్ఛగా ఓపెన్ స్పేస్‌లను మింగేశారు. అందుకే ఎల్ఆర్ఎస్ భారంగా మారింది.

శివార్లలో వేల సంఖ్యలో లే అవుట్లు..

హైదరాబాద్ నగర శివార్లలో కొన్ని వేల సంఖ్యలో లేఅవుట్లు ఉన్నాయి. మరో 40 ఏండ్లకు సరిపడా లేఅవుట్లు దర్శనమిస్తున్నాయని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా అనే కంటే పంచాయతీ సర్పంచులు, కార్యదర్శుల సంతకాలతోనే ఏర్పడ్డాయి. ఇక అనుమతులు జారీ చేయడం అనవసరమన్న చర్చ నడుస్తోంది. కేవలం అవసరాల కోసం పెట్టుబడులు అంటూ సాగుభూమి వ్యవసాయేతరంగా మారుతోంది. చాలా లేఅవుట్లల్లో 20 అడుగుల రోడ్లే అధికం. వెంచర్లలో మాత్రం పార్కులు ఉన్నాయి.

అయితే లేఅవుట్లు వేసిన రియల్టర్లకు అన్ని రకాల బలాలు ఉన్నాయి. దాంతో ప్లాట్ల యజమానులు ప్రశ్నించలేకపోయారని తెలుస్తోంది. ఇటీవల బడంగ్‌పేట మున్సిపాలిటీలో రికార్డుల ప్రకారం 147 ఓపెన్ స్పేస్‌లు, పార్కులు, ప్లే గ్రౌండ్లు మాయమైనట్లు తెలిసింది. కేవలం లేఅవుట్లలో చూపించారు. కొన్నేండ్ల తర్వాత వాటికి ఎలాంటి బౌండరీస్ లేకపోవడంతో అమ్మేశారు. వీటిపై న్యాయ పోరాటం చేసిన ప్లాట్ల యజమానులు ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో కాలనీ అసోసియేషన్ల పెద్దలు కూడా సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి.

మీర్‌పేట, తుక్కుగూడ, తుర్కయంజాల్, పహడీషరీఫ్, శంషాబాద్, నార్సింగి, పెద్ద అంబర్‌పేట, ఇబ్రహింపట్నం, శంకర్‌పల్లి, షాద్‌నగర్, నిజాంపేట, మేడ్చల్, శామీర్‌పేట, తూంకుంట, ఘట్‌కేసర్, జవహర్‌నగర్, బోడుప్పల్, బండ్లగూడ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని కాలనీలను సందర్శిస్తే ఎన్ని పార్కులు మాయమయ్యాయో తెలుస్తోంది. ఆ కాలనీలోని ప్లాట్ల అమ్మకాల డాక్యుమెంట్లను పరిశీలిస్తే బౌండరీస్ ప్రకారం ఓపెన్ స్పేస్‌లు ఎక్కడ ఉన్నాయో, ఎవరు.. ఎవరికి విక్రయించారో, ఎంతకు అమ్మేశారో, ఎంత మూట గట్టుకున్నారో.. ఆ తతంగమంతా స్పష్టమవుతుందని కాలనీవాసులు చెబుతున్నారు. లేఅవుట్లలో ప్లాట్ల బౌండరీస్‌ను బట్టి ఎక్కడ ఓపెన్ స్పేస్‌ను ఎంత విస్తీర్ణం వదిలారో వెల్లడవుతుందంటున్నారు.

క్రమబద్దీకరించొద్దని లేఖలు.. కానీ!

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పడిన మొదట్లో కొందరు నిజాయితీ కలిగిన కమిషనర్లు ఓపెన్ స్పేస్‌లను గుర్తించారు. వాటిని ప్లాట్లుగా చేసి అమ్మేశారని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణకు పెట్టుకున్న దరఖాస్తులను, బీఆర్ఎస్ దరఖాస్తులను తిరస్కరించాలంటూ హెచ్ఎండీఏ కమిషనర్, కలెక్టర్లకు లేఖలు కూడా రాశారు. కొందరు ఎల్ఆర్ఎస్ ప్రొసిడింగ్స్ పొందారు. బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు కూడా పొందారు. వీటిని రద్దు చేయాలని కూడా ఒకరిద్దరు కమిషనర్లు ఉన్నతాధికారులకు లేఖలు రాసినట్లు తెలిసింది. అయితే ఆ దందాకు పాల్పడిన వాళ్లు పెద్దోళ్లు కావడంతో యథేచ్ఛగా అనుమతుల పరంపర కొనసాగిందన్న ఆరోపణలున్నాయి. బోడుప్పల్ నగర పంచాయతీగా ఏర్పడిన మొదట్లోనే అక్కడి అవినీతి దందాను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇంకొందరు కమిషనర్లు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. మరికొందరు అధికారులేమో కళ్ల ముందు దందా నడుస్తున్నా ఆ లేఅవుట్లు అక్రమమని, వాటిపై తమకేం అధికారం ఉండదని జనం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది.

కాగితాల్లో మాత్రమే..

బడంగ్‌పేట మున్సిపాలిటీలో ఉద్యోగ్‌నగర్‌లో 3095 చ.మీ., లిబ్రా ఎన్‌క్లేవ్‌లో 1738 చ.మీ, అదే కాలనీలో మరొకటి 1091 చ.మీ, విజన్ వ్యాలీలో 3715 చ.మీ, ఎస్ఎస్పీడీఎల్ కాలనీలో 1904 చ.మీ, 2656 చ.మీ., గుర్రంగూడలోని హరితపురికాలనీలో 1248 చ.మీ., గుర్రంగూడలో స్వామినారాయణ కాలనీలో 145 చ.మీ, నాదర్‌గుల్‌లో సర్వే నెంబర్లవారీగా చేసిన లేఅవుట్లల్లో 1583, 1105, 1969, 1820, 1560, 924, 1532, 1189 చ.మీ. వంతున పార్కులు ఉన్నాయి. కాగితాల్లోనైతే కనిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో దర్యాప్తు చేస్తే ఏ మేరకు పార్కులు ఉన్నాయో తెలుస్తుంది. ఇంకా పలు కాలనీల్లో ఎలాంటి పార్కులు లేవని వెల్లడైంది. ఇలా నగర శివార్లలోని చాలా ప్రాంతాల్లోనూ దర్యాప్తు చేస్తే రికార్డులకు, క్షేత్ర స్థాయికి మధ్య చాలా తేడా ఉంటుంది.

ఫిర్యాదు చేసినా.. పట్టించుకోరేం..?

తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో మన్నెగూడ సర్వే నెంబర్ 536, 537, 657, 658లలో సుప్రితానగర్(ఫాంల్యాండ్స్) వెంచర్ ఉంది. లేఅవుట్‌లోని ఓపెన్ స్పేస్‌ను 2018 లోనే రాగన్నగూడ పంచాయతీకి గిఫ్ట్ సెటిల్‌మెంట్ డీడ్ నెం.8182 ప్రకారం అప్పగించారు. ఇందులో ప్లాట్లుగా 1,14,584 చ.అ., రోడ్లకు 63,567 చ.అ., ఓపెన్ స్పేస్ కింద 12,823 చదరపు అడుగులుగా ఉంది. ఈ ఓపెన్ స్పేస్‌ను పంచాయతీకి రాసిచ్చారు. లే అవుట్ల రూల్స్ ప్రకారం శ్రీమిత్రా ఎస్టేట్స్‌లో 10 శాతం వదిలారు. ఇందులో ఒక పార్కు 4709 చదరపు అడుగల విస్తీర్ణాన్ని కొందరు పెద్దలు కబ్జా చేశారని, వారి నుంచి కాపాడాలని కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు తుర్కయంజాల్ మున్సిపాలిటీ కమిషనర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆదిబట్ల పోలీసులకు, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా కలెక్టర్, పురపాలక శాఖ ప్రన్సిపల్ సెక్రటరీలకు కూడా ఫిర్యాదు చేశారు. ఏ ఒక్కరూ పార్కు స్థలాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టడం లేదని ప్లాట్ల యజమానులు వాపోతున్నారు. అలాగే పార్కు స్థలాల రక్షణకు చేపట్టిన చర్యలేమిటని సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగితే కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కాపాడలేకపోయినా, కాపాడకలిగిన వద్దైనా అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడంలేదనే విమర్శలు భారీగా వినిపిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed