ఆమె నాకు అమ్మలేని లోటు తీర్చారు.. ఎన్‌వీ రమణ

by srinivas |
NV Ramana
X

దిశ, ఏపీ బ్యూరో : రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థ ప్రముఖ పాత్ర పోషిస్తోందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. విజయవాడలోని కానూరు సిద్ధార్థ కళాశాలలో ఆదివారం ఉద‌యం జ‌రిగిన దివంగత జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు స్మారక ఉపన్యాస సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నాణ్యమైన విద్యతోనే యువతకు మంచి భవిష్యత్తు అని జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు బలంగా నమ్మేవారని చెప్పుకొచ్చారు. విద్యతోపాటు క్రీడల పట్ల ఆసక్తి చూపాలని పదేపదే చెప్పేవారని గుర్తు చేశారు. సొంతూరిలో గ్రంథాలయాన్ని స్థాపించడం గొప్ప విషమని కొనియాడారు. జస్టిస్‌ లావు వెంకటేశ్వర్లు ఆద‌ర్శాలు ఆయన తనయుడు జస్టిస్‌ లావు నాగేశ్వరరావుకు స్ఫూర్తి అయ్యాయని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా ‘భారత న్యాయ వ్యవస్థ భవిష్యత్తు సవాళ్లు’అనే అంశంపై సీజేఐ ప్రసంగించారు. స్వాతంత్య్రం తర్వాత అభివృద్ధి, ఆధునీకరణ, పారిశ్రామికీకరణ వైపు మళ్లడంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని, మరెన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉందని ఆయన అన్నారు. 1990లో భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడగా సరైన సమయంలో సరైన నిర్ణయంతో దాన్ని అధిగమించినట్లు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కొత్త పారిశ్రామిక విధానం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందేనన్నారు.

అలాగే విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ఆర్థిక సంస్కరణలు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు తల్లి తనకు అమ్మలేని లోటును తీర్చారని సీజేఐ అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తిగా బాగా పనిచేస్తున్నానని ఆమె ప్రశంసించడం జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జస్టిస్‌ లావు నాగేశ్వరరావు తల్లికి సీజేఐ పాదాభివందనం చేశారు.

Advertisement

Next Story

Most Viewed