- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అసలే నర్సుల కొరత.. వారు చేతులెత్తేస్తే..
దిశ, న్యూస్ బ్యూరో: ”కరోనా ఒక మహమ్మారి. ఒక భయంకర్ వైరస్. మహా రాక్షసి. మొత్తం ప్రపంచాన్నే వణికిస్తోంది. దీనికి మందే లేదు. మనం జాగ్రత్తల్లో ఉండటమే అసలైన మందు” అని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.
”మొత్తం దేశమంతా లాక్‌డౌన్‌లో ఉన్నా వైద్యులు, నర్సులు మాత్రం ఎనలేని సేవ చేస్తున్నారు. వారి కృషి అభినందనీయం” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఒక ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సుకు ఫోన్ చేసి అభినందించారు.
”డాక్టర్లు, నర్సులు సహా వైద్య సిబ్బంది కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తూ ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నారు. అంతటి రిస్కులోనూ వారు విధులకు హాజరవుతున్నారు. అందుకే వారి జీవితాలకు ప్రభుత్వమే రూ. 50 లక్షల మేర బీమా సౌకర్యం కల్పిస్తోంది” అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
ఇదంతా కరోనా కట్టడి కోసం మన ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకున్నా వైద్య సిబ్బంది మాత్రం వారి విధి నిర్వహణలో చాలా అంకిత భావంతో పనిచేస్తున్నారని చెప్పడానికే. కరోనా భయంకరమైన వైరస్ కాబట్టి దానికి ప్రజలు భయపడుతున్నారు. సహజంగానే నర్సుల్లోనూ ఈ భయం ఉంది. అందుకే చాలా చోట్ల వారు విధుల్లోకి రావాలనుకుంటున్నా కుటుంబ సభ్యుల నుంచి మాత్రం వద్దంటూ ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు కరోనా పేషెంట్లకు చికిత్స చేసిన నర్సుల కుటుంబాలను ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా అద్దెకు ఇచ్చిన యజమానులు హుకుం జారీ చేస్తున్నారు. ఈ విషయం ప్రధాని వరకూ వెళ్లింది. అన్ని రాష్ట్రాల్లోనూ స్వంత ఇళ్లు లేని నర్సులకు, డాక్టర్లకు ఈ ఇబ్బంది ఉంది. కానీ, ఢిల్లీ, కేరళ, కర్నాటక ప్రభుత్వాలు మినహా మరెక్కడా అద్దె ఇళ్లను ఖాళీ చేయకుండా ఆపాల్సిందిగా ఉత్తర్వులు జారీ కాలేదు.
కరోనా పేషెంట్లకు చికిత్స అందించడంతో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, పారిశుధ్య సిబ్బంది పాత్ర అద్భుతమైనది. వైరస్ భయంకరమైనదని తెలిసి కూడా చికిత్సకు ముందుకొస్తున్నారు. అయితే, ప్రభుత్వాల నుంచి మాత్రం వారికి తగిన భరోసా, హామీ లేకపోవడంతో చాలామంది డ్యూటీ మానేసి ఇంటికే పరిమితమవుతున్నారు. కేరళలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో పనిచేస్తున్న 21 మంది నర్సులు స్వంతంగా ఒక వాహనాన్ని మాట్లాడుకుని స్వంత రాష్ట్రంలో సేవలందించడానికి వెళ్లారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి చాలా ఉన్నాయి. తెలంగాణలో అసలే నర్సులు కొరత తీవ్రంగా ఉండటం, ఇప్పటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా డ్యూటీ మానేసి ఇంటి దగ్గరే ఉండిపోతుండటం, కొద్దిమంది కేరళకు వెళ్లిపోవడం.. ఇలాంటి కారణాలతో ఈ కొరత ఇంకా తీవ్రమైంది.
ప్రభుత్వ ఆస్పత్రి నర్సులకు సెలవుల రద్దు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే నర్సులకు సెలవులు రద్దు చేయడంతో విధిగా డ్యూటీకి హాజరుకాక తప్పడంలేదు. కానీ, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ పరిధిలోని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఐసొలేషన్ వార్డుల్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఉత్తర్వులు రావడంతో అటువైపు వెళ్లడానికి కూడా కొద్దిమంది నర్సులకు ధైర్యం చాలడం లేదు. సామాన్యులతో పోలిస్తే ఒక మేరకు అవగాహన ఉన్నప్పటికీ వారికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలు (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్) లేకపోవడం, మొత్తం కుటుంబానికి అంటుకుంటుందేమోననే ఆందోళనతో చాలా మంది నర్సులు డ్యూటీకి వెళ్లడం మానేశారు. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే నర్సులకు సెలవులు పెట్టకూడదంటూ ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి ఆబ్సెంట్ కావడంలేదు. కానీ, ప్రైవేటు ఆస్పత్రులకు అలాంటి నిబంధన లేకపోవడంతో డ్యూటీలకు గైర్హాజరు పెరిగింది. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం.
‘ఐసోలేషన్’ ప్రొటోకాల్
అత్యవసర సమయాల్లో సేవలు అందించాల్సిన నర్సులు, కొద్దిమంది డాక్టర్లే చేతులెత్తేస్తే.. పరిస్థితిని అదుపులోకి తేవడం ప్రభుత్వాలకు సవాలుగా మారుతుంది. నిజానికి కరోనా ఐసొలేషన్ వార్డుల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పష్టమైన ప్రోటోకాల్‌ను నిర్దేశించింది. వారికి ప్రత్యేకమైన క్యాప్, మాస్కు, ఆపరాన్, గ్లవుజులు, సాక్స్, స్లిప్పర్స్… ఇలా మొత్తం కిట్ ఉంటుంది. దీన్ని ప్రైవేటు ఆస్పత్రులు సమకూర్చుకోవడం ఆర్థికంగా భారమే అవుతుంది. పైగా ఇప్పటి అవసరాలకు అంతటి భారీ సంఖ్యలో సమకూర్చుకోవడం కూడా ఇబ్బందికరం. అవసరమైనంత సంఖ్యలో వాటి ఉత్పత్తి లేకపోవడమే కారణం. ప్రభుత్వమే ఇలాంటి కిట్‌లను సమకూర్చడం ద్వారా నర్సుల భయాందోళనలను పారదోలడంతోపాటు వారు విధులకు గైర్హాజరు కాకుండా చూసుకోవడం వీలవుతుంది.
బీమా ఓకే.. కానీ, రక్షణేది?
నర్సులకు కేంద్ర ప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించడం సంతోషమే. కానీ, నర్సులు వార్డుల్లోకి వెళ్లడానికి అవసరమైన కనీస రక్షణ పరికరాలు, దుస్తులు లేకపోతే ఎలా అనే నర్సుల ప్రశ్నలకు సమాధానం కరువవుతోంది. మధ్యప్రదేశ్‌లోని రేవా ప్రభుత్వ కస్తూర్బా గాంధీ ఆస్పత్రిలో నర్సులకు కనీసం గ్లౌజులు కూడా లేకపోవడంతో వారు రోడ్డెక్కాల్సి వచ్చింది. గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్లకు, ఐసొలేషన్ వార్డుల్లో ఉన్న అనుమానితులకు చికిత్స చేసే ప్రభుత్వ నర్సులు సైతం తమకు సౌకర్యాలు లేవనీ, బయో వేస్టు పారవేయడానికి డస్ట్ బిన్‌లు, చేతులు కడుక్కోడానికి సబ్బులు, హ్యాండ్ వాష్ లేవని సూపరింటెండెంట్‌కు మొరపెట్టుకున్నారు. కరోనా కోసమే తయారైన గాంధీ ఆస్పత్రిలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక చెస్ట్ ఆస్పత్రి, కింగ్ కోఠి ఆస్పత్రి గురించి చెప్పాల్సిన పనే లేదు.
ఆరేళ్లుగా నర్సు పోస్టుల భర్తీ లేదు..
విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రభుత్వాలు వాటి గురించి పెద్దగా పట్టించుకోవు. ఓట్లు రాల్చే ‘ఉచిత పథకాల’పై ఉన్న శ్రద్ధ వీటిపై ఉండదు. అందుకే సంక్షేమానికి వేలాది కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయిస్తున్నా విద్య, వైద్య రంగాలకు మాత్రం అంతంతే ఉంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరేళ్ళయినా ఐదారుగురు మినహా నర్సుల రిక్రూట్‌మెంట్ జరగలేదు. ప్రైవేటు ఆసుపత్రుల సంఖ్య, రోగుల సంఖ్య పెరుగుతుండడంతో దానికి తగినట్లుగా నర్సుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. కానీ, ప్రభుత్వం ఎప్పుడూ దీనిపై శ్రద్ధ పెట్టలేదు. 2017లో 3311 నర్సుల పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చినా అందులోని నిబంధనలపై గందరగోళం చోటుచేసుకోవడంతో కోర్టులో రిక్రూట్‌మెంట్ ఆగిపోయింది. కోర్టులో దీన్ని పరిష్కరించుకోడానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ఫలితంగా 21 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాసినా రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మాత్రం నిలిచిపోయింది.
ప్రతీ ఏటా ప్రైవేటు నర్సింగ్ కాలేజీల నుంచి సుమారు నాలుగు వేల మంది కొత్త నర్సులు పుట్టుకొస్తున్నా రాష్ట్రంలో నర్సుల కొరత మాత్రం తీరలేదు. కొత్తగా నర్సింగ్ కాలేజీలను పెట్టడానికి దరఖాస్తులు ప్రభుత్వానికి అందుతున్నా వాటికి అనుమతులు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం కంటిన్యూ అవుతోంది. పైరవీలతో కొద్దిమంది రాజకీయ ప్రముఖులు అనుమతి తెచ్చుకుంటున్నారుగానీ నిబంధనలు మాత్రం పక్కగా అమలుకావడంలేదు. అన్ని అర్హతలూ ఉండి హై లెవల్ కమిటీ తనిఖీలు పూర్తయినా ప్రభుత్వం నుంచి అనుమతి పొందలేకపోయిన కళాశాలల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇప్పుడు కరోనా వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నర్సులు, డాక్టర్ల, పారామెడికల్ సిబ్బంది కొరత అంశాన్ని గుర్తించి పదవీ విరమణ చేసిన, వృత్తిని మధ్యలో మానేసి ఇంట్లో ఉంటున్న, పీజీ కోర్సు చేస్తూ ఉన్నవారి సేవలను వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి వివరించారు. తాత్కాలిక సేవలే తప్ప శాశ్వత పరిష్కారం ఉండదా అని నర్సులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు మాత్రం ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం కరువు.