19లక్షలు దాటిన కరోనా కేసులు

by  |
19లక్షలు దాటిన కరోనా కేసులు
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా రికవరీ రేటు రోజురోజుకూ పెరుగుతోందని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ సంతృప్తి వ్యక్తం చేస్తున్నా ప్రతీరోజు సగటున 50వేల కంటే ఎక్కువగా కొత్త కేసులు ఉనికిలోకి వస్తుండడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో భారత్ మూడవ స్థానంలో ఉంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య విషయంలోనూ అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడవ స్థానంలో ఉంది. రికార్డు స్థాయిలో ఒకే రోజున ఆరు లక్షల టెస్టులు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నా అంతే రికార్డు స్థాయిలో ఒకేరోజు వ్యవధిలో 52,509 కొత్త కేసులు పుట్టుకొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 19.08 లక్షలు దాటింది. కరోనా మృతుల సంఖ్య సైతం 40వేలకు చేరువవుతోంది. రికార్డు స్థాయిలో ఒకేరోజున 857 మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 39,795కు చేరుకుంది.

ఇప్పటివరకు మొత్తంగా దేశవ్యాప్తంగా 2.14కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని కేంద్ర వైద్యారోగ్య శాఖ పేర్కొంది. మొత్తం పాజిటివ్ కేసుల్లో దాదాపు 82% మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తదితర పది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కోలుకున్న పేషెంట్లు గడచిన రెండు వారాల్లో 63% నుంచి 67శాతానికి పెరిగినట్లు పేర్కొన్న ప్రభుత్వం సుమారు 12.82 లక్షల మంది క్షేమంగా ఇళ్ళకు చేరుకున్నట్లు తెలిపింది. కర్నాటకలో పాజిటివ్ కేసుల సంఖ్య లక్షన్నర దాటగా ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రెండు లక్షలకు చేరువగా ఉంది. ఏపీలో ప్రతీరోజు సగటున పది వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి.


Next Story

Most Viewed