- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. కల్వకుంట్ల కవిత పోటీపై ఉత్కంఠ?
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత పదవీకాలం జనవరి 4తో ముగియనుంది. రాష్ట్రంలో 6 ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలతో పాటు జనవరిలో పదవి కాలం ముగిసే ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం చట్టాలను అనుసరించి ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు పదవీకాలం ముగియకముందే జరుగుతాయి. జనవరి 4వ తేదీ నాటికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు రిటైర్ కానున్న సందర్భంగా వాటికి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 16న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, డిసెంబర్ 10న ఎన్నికలు, 14వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. ఫలితాలు వచ్చినా.. విజేతలు మాత్రం జనవరి 5వ తేదీ నుంచి బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది.
ఎన్నికల షెడ్యూలు నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు, ప్రవర్తనా నియమావళి వెంటనే అమలులోకి వచ్చిందని, అధికారులు ఈ దిశగా తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. ఎటువంటి కొత్త కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు కానీ చేపట్టవద్దని, రాజకీయ పార్టీల సమావేశాలకు హాజరు కాకూడదని, కొత్తగా మంజూరు చేపట్టొద్దని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు, కార్యాలయాలు, సంస్థల్లో రాజకీయపరమైన రాతలు కానీ, ఫ్లెక్సీలు కానీ, ఫోటోలు కానీ ఉంటే వెంటనే తొలగించాలని మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారి, ఇతర సంబంధిత అధికారులను ఆదేశించారు. రోజువారీ కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. సంబంధిత అధికారుల అనుమతి లేకుండా రాజకీయపరమైన ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేయొద్దని ఈ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత 14 నెలలు పని చేసినట్లుగా చెప్పొచ్చు. 2020 అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో సమీప ప్రత్యర్థులపై తిరుగులేని మెజార్టీతో కవిత గెలుపొందింది. అయితే ఆరేండ్ల ఎమ్మెల్సీ పదవిని నాటి ఎమ్మెల్సీ డా.భూపతిరెడ్డి సస్పెన్షన్‌కు గురి కావడంతో ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. 2014 నుంచి 2018 వరకు ఎంపీగా ఉన్న కవిత తర్వాత జరిగిన సాధారణ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల సహకారం కరువవడంతో ఓడిపోయిందని రాజకీయ వర్గాలతో పాటు సీఎం కేసీఆర్‌కు తెలుసు. కవిత ఓటమి పాలైన తర్వాత కవిత జిల్లాలో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌ను వీడి నిజామాబాద్ రావడమే మానేశారు. అలాంటి సమయంలో భూపతిరెడ్డి సస్పెన్షన్ వ్యవహరం కవితకు కలిసి వచ్చి మరోసారి చట్టసభకు ఎన్నికైంది. ఎమ్మెల్సీగా ఆరేండ్ల పదవీ కాలం ఉండగా ఉప ఎన్నిక కారణంతో 14 నెలలు మాత్రమే పని చేశారు.
నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీగా మూడు నెలల క్రితం రిటైర్ అయిన ఆకుల లలితతో పాటు ఆశావహులు ఎమ్మెల్సీ స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఆరు ఎమ్మెల్యే కోటాలో జరిగే వాటిలో తమకు స్థానం కల్పించాలని కేసీఆర్ చుట్టు జిల్లానేతలు ప్రదిక్షిణలు చేస్తున్న సమయంలో నిజామాబాద్ లోకల్ బాడి ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ రావడం రాజకీయంగా వేడిని పుట్టించింది. ప్రస్తుతం నిజామాబాద్ ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవితకే ఆ స్థానం ఉంటుందా లేక గవర్నర్ కోటాకు మారుతారా అనే చర్చ ఇది వరకే జరిగింది. ఎందుకంటే గవర్నర్ కోటా వ్యవహరమంతా సీఎం చేతిలోనే ఉంటుంది. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో ఎమ్మెల్సీ కావడం సులువు. కానీ, లోకల్ బాడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలువడం ఆశామాషి కాదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అధికార పార్టీ అభ్యర్థి వెంకట్ రాంరెడ్డిని ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి అరికెల నర్సారెడ్డిని ఓడించడం కొత్త రికార్డులను నెలకొల్పింది. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వ్యయం లక్షల నుంచి కోట్లకు మారింది. గడిచిన ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చయ్యాయనేది అందరికీ తెలుసు. అందుకే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తారా, గవర్నర్ కోటాలో సీటును దక్కించుకుంటారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం జరిగే 12 ఎమ్మెల్సీల పదవి కాలం ఆరేండ్ల కాలం ఉండడంతో కచ్చితంగా ఎమ్మెల్సీ అయితే భవిష్యత్తులో ఏ ప్రభుత్వం ఉన్నా ఎమ్మెల్సీగా అధికార పదవి మాత్రం ఢోకా లేదని అందుకోసం జిల్లాకు చెందిన నేతలు గవర్నర్ కోటాకు పోటీపడుతూ కవితకే స్థానిక సంస్థల ఎమ్మెల్సీని వదిలి వేస్తారా లేదా పోటీ చేస్తారా అనేది నామినేషన్ల స్వీకరణ వరకు తేలిపోనుంది.