నాకెలాంటి ఆరోగ్య సమస్యలు లేవు : అమిత్ షా

by Shamantha N |
నాకెలాంటి ఆరోగ్య సమస్యలు లేవు : అమిత్ షా
X

న్యూఢిల్లీ : తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తొలిసారిగా స్పందించారు. తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. కరోనా సంక్షోభ సమయంలో కేంద్ర మంత్రిగా తన విధులను సంపూర్ణ అంకిత భావంతో నిర్వర్తిస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా, అమిత్ షా ఆరోగ్యంపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేశారు. అమిత్ షా ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదని ఆయన క్షేమంగా ఉన్నారని తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి అమిత్‌షా బోన్‌మారో క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, అందుకే ఆయన బయట ఎక్కువగా కనపడట్లేదని కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. అయితే కరోనా వైరస్‌తో దేశం తల్లడిల్లుతున్న వేళ తాను విధి నిర్వహణలో బిజీగా ఉన్నట్లు అమిత్ షా స్పష్టం చేశారు.

‘తనకు ఎలాంటి జబ్బు లేదని.. ఇలాంటి పుకార్లను తాను పట్టించుకోనని’ అమిత్ షా తెలిపారు. ఈ రూమర్లను పుట్టించిన వారెవరో తనకు తెలుసని.. అయినా సదరు వ్యక్తుల వికృత మనస్తత్వానికే ఆ విషయం వదిలేశానని ఆయన చెప్పారు. ‘అసలు ఈ విషయంపై స్పందించకూడదనే అనుకున్నాను.. కానీ లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు బాధపడుతుండటం చూసి స్పందించక తప్పలేదని’ షా వివరణ ఇచ్చారు.

Advertisement

Next Story