కరెంట్​ తీగలా కాదు… హైటెన్షన్​ వైరులా కొట్లాడుతాం

by Ramesh Goud |
Congress party spokesperson Bharat
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో స్థానిక ప్రజాప్రతినిధులంటే లెక్క లేకుండా పోయిందని, ఇజ్జత్ లేని బతుకు ఎన్నిరోజులు బతుకుతారని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవం ఉంటుందని, ఇక నుంచి కరెంట్ తీగలా కాదు.. హై టెన్షన్ వైరులా కొట్లాడుతామన్నారు. టీపీసీసీ‌ చీఫ్​ రేవంత్‌రెడ్డిని కలిసేందుకు ములుగు ఎమ్మెల్యే సీతక్క భారీ ర్యాలీగా హైదరాబాద్​కు తరలివచ్చారు. ఈ సందర్భంగా మేడారం సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం రేవంత్​ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా సమ్మక్క గద్దెల దగ్గర నుంచి తీసుకువచ్చిన బొట్టు పెట్టి రక్ష కట్టారు.

ఈ సందర్భంగా రేవంత్​రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అమరులకు, రైతులకు, నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే సీఎం కేసీఆర్​ను బొందపెట్టాలన్నారు. తెలంగాణ తల్లి సోనియా గాంధే అని పేర్కొన్నారు. తనకు పీసీసీ చీఫ్​ పదవి వస్తుందని నిఘా వర్గాల రిపోర్టు అందగానే ప్రగతిభవన్​ తలుపులు తెరిచి కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను ఆహ్వానించారన్నారు. రాష్ట్రంలో ఇక ప్రజల కొట్లాట మొదలైందని, ఖబర్దార్ కేసీఆర్.. నీ సంగతి చూస్తా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ హయాంలో స్థానిక ప్రజా ప్రతినిధులకు గౌరవం ఉండేదని, టీడీపీ, కాంగ్రెస్ హయాంలో గ్రామాల్లో గొడవలైతే పోలీస్ స్టేషన్​లో స్థానిక ప్రజా ప్రతినిధుల మాటల చెల్లుబాటు అయ్యేదని, ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల మాటలు అధికారులు వినేవారని కానీ ఇప్పుడు టీఆర్​ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోయిందన్నారు. గ్రామాలకు ఖర్చు చేయాల్సిన నిధులు కూడా రావడం లేదని, టీఆర్​స్ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా నిధులు లేక సొంత డబ్బులను ఖర్చు పనులు చేస్తున్నారన్నారు.

రాష్ట్రంలో లోకల్ లీడర్లు రోడ్లపై పడ్డారని, వారెవరూ సంతోషంగా లేరని, సర్పంచ్, ఎంపీటీసీలమని చెప్పుకోలేకపోతున్నారని, దిక్కులేక స్థానిక ప్రజా ప్రతినిధులు బ్రోకర్లుగా, పైరవీకారులుగా మారుతున్నారని రేవంత్​రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో సంక్షేమ పథకాలు టీడీపీ, కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని, టీఆర్ఎస్ జెండా మోసిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సంతోషంగా ఉన్నారా.. గుండె మీద చేయి వేసుకొని చెప్పాలంటూ ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్​లో ఎస్ఐ, సీఐలకు పోస్టింగ్ ఇవ్వాలంటే లక్షల్లో వసూల్ చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఆత్మగౌరవంగా బతకాలంటే టీఆర్​ఎస్​ పోవాలన్నారు.

బందీ నుంచి విముక్తి కోసమే..!

తెలంగాణ తల్లి టీఆర్​ఎస్​ చేతిలో బందీ అయిందని, ఈ బందీ నుండి విడదీయడానికి సోనియా గాంధీ తనకు పీసీసీ పదవీ ఇచ్చిందని రేవంత్​రెడ్డి అన్నారు. తనకు ఎలాంటి పదవులపై ఆశ లేదన్నారు. సీతక్క అండగా ఉందని, రాబోయే రోజుల్లో రాష్ట్ర నలుమూలల తిరగాల్సి ఉందన్నారు. సీతక్క క్యాడర్ నియోజకవర్గంలో గట్టిగా ఉండాలని, సీతక్క నాతో సరిసమానం అన్నారు. ఒకటే కుర్చీ ఉంటే.. ఆ కుర్చీలో సీతక్కనే కూర్చో బెడ్తా అని రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు.

అధికారంలోకి తేవడమే లక్ష్యం : ఎమ్మెల్యే సీతక్క

రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీని అధికారంలోకి తేవడానికే తాము కాంగ్రెస్‌ పార్టీలో చేరామని ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. రేవంత్​కు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం సన్మానించి మాట్లాడారు. తాము అధికారాన్ని అనుభవించడానికి కాంగ్రెస్‌లోకి రాలేదని, పార్టీ పలుచన అయ్యేలా ఎవరూ మాట్లాడొద్దని పేర్కొన్నారు. మెజారిటీ అభిప్రాయం మేరకే రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందని, పార్టీని అధికారంలోకి తెచ్చినప్పుడే తమకు నిజమైన సంతోషమని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.

ఓట్ల కోసమే సీఎం కేసీఆర్‌ హడావుడి మీటింగ్‌లు పెడుతున్నారని, రాజయ్యకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి తిరిగి గుంజుకున్నారని సీతక్క విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కూడా పక్క దారి పట్టించారని, గిరిజనులకు సీఎం అన్యాయం చేస్తున్నారని, మోసం చేయడంలో కేసీఆర్‌ దిట్ట అని సీతక్క ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed