కారు ప్రమాదంలో ట్విస్ట్ : అన్న మృతదేహమని తెలియక.. పొద్దంతా శ్రమించిన తమ్ముడు

by Sridhar Babu |   ( Updated:2021-07-29 22:18:12.0  )
Retired SI killed
X

దిశ, హుజురాబాద్: కారు అదుపు తప్పి బావిలో పడిన ఘటన విషాధంగా మారింది. అందులో ప్రయాణిస్తున్న ఓ రిటైర్డ్ ఎస్ఐ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది 9 గంటలపాటు శ్రమించి కారును వెలికి తీశారు. కారును వెలికి తీసేందుకు పొద్దంతా శ్రమించిన ఓ ఫైర్ ఆఫీసర్ సోదరుడే మృతుడు కావడం అందరినీ కన్నీరు పెట్టించింది. తన అన్న ప్రమాదానికి గురైండని తెలియని తమ్ముడు విధి నిర్వహణలో భాగంగా బావిలో పడ్డ కారును బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాడు. శవాన్ని పరిశీలించగా.. తన సోదరుడే అని గుర్తించి భోరున విలపించాడు.

ఉదయం 11 గంటల నుంచి..

గురువారం ఉదయం 11 గంటల సమయంలో కరీంనగర్, హుప్నాబాద్ రహదారిలోని ఓ వ్యవసాయ బావిలో కారు పడిపోయిందని చిగురుమామిడి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులు కారును బయటకు తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. క్రేన్ల సాయంతో కారును బయటకు తీస్తున్న క్రమంలో జారి నీటిలోనే పడిపోతోంది. దీంతో మూడు భారీ మోటార్లు, జనరేటర్ తెప్పించి బావిలోని నీటిని తోడించారు. రాత్రి 8 గంటల తరువాత కారును వెలికి తీశారు.

ఒక్కడే కారు నడుపుకుంటూ..

car accident

బావి నుంచి కారును వెలికితీసిన పోలీసులు లోపల ఒక్కడే ఉన్నట్లు గుర్తించారు. మృతుడు రిటైర్డ్ ఎస్సై పాపయ్య నాయక్‌గా గుర్తించారు. ఆయనది వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ట నర్సింగాపూర్ శివార్లలోని ఓ తండా. పాపయ్య నాయక్ గురువారం ఉదయం కరీంనగర్ నుండి తన స్వగ్రామానికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్‌ సమీపంలో కారు అదుపుతప్పడంతో వ్యవసాయ బావిలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఉదయం నుండి రాత్రి వరకు కారును బయటకు తీసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసి చివరకు సఫలం అయ్యారు. ఘటనా స్థలానికి కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయసారథి, సీఐ శశిధర్రెడ్డి, చిగురుమామిడి ఎస్సై చల్లా మధుకర్‌రెడ్డి, తహసీల్దార్ ముబీన్ అహ్మద్, ఫైర్ సిబ్బంది చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అన్న మృతదేహం కోసం…

Budaiah

వ్యవసాయ బావిలో కారు పడిపోయిందన్న సమాచారం అందుకున్న వెంటనే వివిధ శాఖలకు చెందిన అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఫైర్ డిపార్ట్ మెంట్‌లో పని చేస్తున్న మానుకొండూరు ఫైర్ ఆఫీసర్ బుదయ్య కూడా విధి నిర్వహణ కోసం అక్కడకు చేరుకున్నారు. ఉదయం నుండి రాత్రి వరకూ బావి నుండి కారును బయటకు తీసేందుకు అందరితో పాటు శ్రమించాడు. గుర్తు తెలియని వ్యక్తి కారు అన్న ఆలోచనతోనే విధుల్లో మునిగిపోయారు. చివరకు కారు బయటకు తీసిన తరువాత మృతదేహాన్ని చూసి ఆయన షాక్ కు గురయ్యారు. తనకు తెలియని వారి గురించి అప్పటి వరకు శ్రమిస్తున్న బుదయ్య ఈ శవాన్ని చూడగానే తన అన్న పాపయ్యే అని నిర్దారించుకుని కన్నీటి పర్యంతం అయ్యాడు. ఇప్పటి వరకు తన అన్న మృతదేహాన్ని చూడడానికి ఇంతలా శ్రమించానా.. అని రోధించడం అక్కడి వారి హృదయాలను ధ్రవింపజేసింది.

Advertisement

Next Story