ఎన్నికల వేళ హాట్ టాపిక్.. ఈటలకు ఓటు ఎందుకు లేదు..?

by Anukaran |
ఎన్నికల వేళ హాట్ టాపిక్.. ఈటలకు ఓటు ఎందుకు లేదు..?
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోలేకపోయారు..? ఆయనకు కావాలనే ఓటు లేకుండా చేశారా.. లేక మరేదైనా కారణం ఉందా..? సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ అంశంపై ఓ లుక్కెద్దాం. అక్టోబర్ 30న హుజురాబాద్ ఉప ఎన్నికలు జరుగగా నవంబర్ 2న వెలువడిన ఫలితాల్లో ఈటల విజయం సాధించారు. అయితే, నెల రోజులు తిరగక ముందే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.

ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తన ఓటును నియోజకవర్గంలోని ఏదైనా మండల పరిషత్‌లో కానీ, మున్సిపాలిటీలో కానీ ఎక్స్‌అఫిషియో సభ్యునిగా నమోదు చేయించుకోవాల్సి ఉంది. అయితే, నిబంధనల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకు నెల రోజుల ముందే ఎక్స్‌అఫిషియో సభ్యునిగా నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ, నిబంధనల మేరకు కావల్సినంత సమయం లేకపోవడం వల్లే ఎక్స్‌అఫిషియో సభ్యునిగా నమోదు చేయించుకోలేకపోయారు. ఈ కారణంగానే ఈటల తన ఓటును స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది.

Advertisement

Next Story