సమస్యంతా బడ్జెట్ బయటే

by  |
సమస్యంతా బడ్జెట్ బయటే
X

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ద్రవ్యలోటు అప్పులు పెంచుకునేందుకు షరతులతో అనుమతిచ్చిన కేంద్ర ప్రభుత్వం వాటిని తీర్చేందుకు సైతం పలు దారులు చూపిస్తోంది. ప్రభుత్వ గ్యారంటీతో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కార్పొరేషన్‌లు చేసిన అప్పుల రీపేమెంట్లు, వడ్డీ చెల్లింపులకు మాత్రం ఎలాంటి ఉపశమనం లభించడం లేదు. ఇదే విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కార్పొరేషన్లు కట్టాల్సిన వడ్డీలపై మారటోరియం విధించాలని సీఎం కేసీఆర్ పదేపదే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇటీవల రాష్ట్రాలకు ఎఫ్ఆర్‌బీఎమ్ పరిధిలో 2 శాతం అదనంగా అప్పులు చేసుకోవడానికి ఓ పక్క కేంద్రం షరతులతో కూడిన అనుమతి ఇవ్వగా గతంలో తీసుకున్న ఎఫ్‌ఆర్‌బీ‌ఎమ్ అప్పులకు తిరిగి చేయాల్సిన చెల్లింపులేమైనా ఉంటే ఆయా రాష్ట్రాల కన్సాలిడేటెడ్ సింకింగ్ ఫండ్‌(సీఎస్‌ఎఫ్‌)‌లో నుంచి అదనంగా డ్రా చేసుకునే వెసులుబాటును మరో పక్క ఆర్బీఐ కల్పించింది. రాష్ట్రాలు తమ వద్ద ఉన్న అదనపు నగదును ఆర్బీఐ వద్ద కన్సాలిడేటెడ్ సింకింగ్ ఫండ్(సీఎస్ఎఫ్) పేరిట నిల్వ ఉంచుకుంటాయి. సాధారణ పరిస్థితుల్లో ఈ నిల్వలో కొంత మేర మాత్రమే వాడుకునే వీలుంటుంది. ప్రస్తుత లాక్‌‌డౌన్‌తో ఆర్ధిక వ్యవస్థ ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొంటుండడంతో సీఎస్ఎఫ్ డ్రాయింగ్ పరిమితిని సాధారణ స్థాయి కన్నా 45 శాతం పెంచుతున్నట్టు ఇటీవల ఆర్బీఐ ప్రకటించింది. ఈ నిధులను వాడుకొని ఎఫ్‌ఆర్‌బీఎమ్ అప్పులను చెల్లించుకోవచ్చని సూచించింది.

ఎఫ్‌ఆర్‌బీ‌ఎమ్ అప్పుల్లో ఈ ఏడాది రూ.‌6500 కోట్లు అసలు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ మార్చి నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. ఒక రకంగా చూస్తే ఇది చిన్నమొత్తమే అని చెప్పొచ్చు. తెలంగాణ బడ్జెట్, ఆర్థిక పరిస్థితిని బట్టి చూస్తే రూ.6500 కోట్లు అసలు చెల్లించడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఏ పరిస్థితుల్లోనైనా ఎటువంటి వెసులుబాటు అవసరం ఉండదు. రాష్ట్రంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంటు నిర్మాణానికి, 24 గంటల కరెంటు కోసం పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలలో పెట్టుబడుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీ‌ఎమ్ బయట భారీగా అప్పులు చేసింది. పీఎఫ్‌సీ, ఆర్‌ఈ‌సీ లాంటి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, పలు జాతీయ బ్యాంకుల నుంచి అధిక వడ్డీకి ఈ అప్పులు తీసుకుంది. బడ్జెట్ ప్రవేశపెట్టే నాటికి ఈ అప్పులన్నీ కలిపి రూ. 40 వేల కోట్ల వరకు ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది. టీఎస్ జెన్‌కో, తెలంగాణ వాటర్ రీసోర్సెస్ కార్పొరేషన్‌లు కలిపి ఒక్క ఆర్ఈసీ సంస్థ నుంచి తీసుకున్న అప్పులే రూ.30 వేల కోట్లకు పైగా ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ అప్పులకు అసలు, వడ్డీలు చెల్లించడానికి, అప్పులు చేసినా సరిపోక ప్రభుత్వ సహాయం అవసరమయ్యే ఆర్టీసీ లాంటి సంస్థలకు ఇవ్వడానికి ఈ ఆర్థిక సంవత్సరం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ అంచనా కింద ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.15 వేల కోట్ల వరకు కేటాయించింది. ఈ నిధులను లోన్స్ అండ్ అడ్వాన్సెస్‌గా ప్రభుత్వం పేర్కొంది.

సాధారణంగా అయితే రాష్ట్రానికి ఉన్న మొత్తం రూ.3 లక్షల కోట్ల అప్పునకు అసలు, వడ్డీలు చెల్లించడం తెలంగాణ లాంటి రెవెన్యూ మిగులు ఉన్న రాష్ట్రానికి పెద్ద విషయం కాదు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమయ్యే పన్నుల పరంగా చూస్తే ఏప్రిల్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక మే నెలలో లాక్‌డౌన్ సడలింపులతో పన్ను వసూళ్లకు కొంత ఊరట కలిగినప్పటికీ మొత్తంగా చూస్తే రెండు నెలల లాక్‌డౌన్‌తో తెలంగాణ ప్రభుత్వానికి రూ.20 వేల కోట్ల వరకు ఆదాయానికి గండి పడొచ్చని తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది బడ్జెట్‌లో పేర్కొన్న పెట్టుబడి వ్యయం అంచనా మొత్తం తలకిందులయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లోనూ ఎఫ్‌ఆర్‌బీఎమ్ అప్పులు రూ.6500 కోట్లకు అసలు, వడ్డీ తిరిగి చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమస్య లేకపోయినప్పటికీ ఆ అప్పులకే కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ పలు ఊరటలిస్తుండడడం, బడ్జెట్ బయట అధిక వడ్డీకి ఒప్పుకొని చేసిన తక్కువ వ్యవధి అప్పుల అసలు, వడ్డీ చెల్లింపులకు ఇప్పటి వరకు మారటోరియం ప్రకటించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నట్టు పలువురు విశ్లేషిస్తున్నారు.


Next Story

Most Viewed