భూములు కొనలేదు, కొనే ఆలోచన లేదు : రిలయన్స్

by Harish |
భూములు కొనలేదు, కొనే ఆలోచన లేదు : రిలయన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) అనుబంధ సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్(ఆర్‌జేఐఎల్) సోమవారం ఓ ప్రకటనలో మూడు వ్యవసాయ చట్టాలతో సంబంధం లేదని, వాటి నుంచి ఎలాంటి ప్రయోజనాలు తమకు లేవని తెలిపింది. రిలయన్స్ రిటైల్, జియో ఇన్ఫోకామ్ సహా ఇతర అనుబంధ సంస్థలేవీ గతంలో ‘కార్పొరేట్’ లేదా ‘కాంట్రాక్ట్’ వ్యవసాయం చేయలేదని, భవిష్యత్తులో చేసేందుకైనా ప్రణాళికలు లేవని కంపెనీ పేర్కొంది. రిలయన్స్ సహా అనుబంధ సంస్థలేవీ కార్పొరేట్, కాంట్రాక్ట్ వ్యవసాయం కోసం దేశంలో మరెక్కడా కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏ వ్యవసాయ భూమిని కొనలేదు. మరెప్పుడైనా చేయాలనే ప్రణాళిక కూడా లేదని కంపెనీ స్పష్టం చేసింది. ఇటీవల వ్యవసాయ చట్టాల కోసం జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో హర్యానా, పంజాబ్‌లలో రిలయన్స్ జియోకు చెందిన 1,500 వరకు మొబైల్ టవర్లను కొందరు ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే ఆర్ఐఎల్ హర్యానా, పంజాబ్ హైకోర్టుల్లో పిటిషన్ వేసింది. కొత్త చట్టాలను వ్యతిరేకించే రైతుల నిరసనల పేరుతో కొందరు తమ సంస్థకు నష్టం కలిగిస్తున్నారని, దీనివల్ల సంస్థతో పాటు సంస్థ ఆస్తులకు, ఉద్యోగులకు నష్టం ఉంటోందని, అవసరమైన రక్షణ కల్పించాలని పిటిషన్‌లో కోర్టును ఆర్ఐఎల్ సంస్థ కోరింది.

Advertisement

Next Story

Most Viewed