అప్రమత్తమైన పోలీసులు.. మన్యంలో మావోయిస్టుల బంద్ ప్రభావం శూన్యం

by Sridhar Babu |
CRFF Police
X

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌‌ఘఢ్‌కి సరిహద్దుగా ఉన్న వాజేడు మండల పరిధిలోని టేకులగూడెం అటవీప్రాంతంలో ఈనెల 25న జరిగిన ఎన్‌కౌంటర్‌కి నిరసనగా బుధవారం(నేడు) మావోయిస్టులు ఏజెన్సీ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ పిలుపు దృష్ట్యా పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టడంతో బంద్ విఫలమైంది. మావోయిస్టుల బంద్ ఈసారి ప్రభావం చూపలేదు.

రోజు మాదిరిగానే సాధారణ జనసంచారం సాగింది. వర్తక, వ్యాపారులు దుకాణాలు తెరిచి వ్యాపార లావాదేవీలు నిర్వహించారు. మన్యంలో ఎక్కడా బంద్ ప్రభావం కనిపించలేదు. ఎన్‌కౌంటర్ జరిగినరోజు నుంచి పోలీసులు ప్రధాన రహదారులపై కాపుగాచి వాహన తనిఖీలు నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తుల వివరాలు ఆరా తీస్తున్నారు. మరోవైపు CRPF, స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ బలగాలు మావోయిస్టు ప్రభావిత పల్లెల్లో రేయింబవళ్ళు గస్తీ కాస్తున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేయడంతో బంద్ విఫలమైనట్లు నిఘావర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఎన్‌కౌంటర్‌లో ముగ్గురిని కోల్పోయిన మావోయిస్టులు ప్రతీకారంతో ఏమైనా సంఘటనలకు పాల్పడవచ్చనే నిఘావర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

Advertisement

Next Story

Most Viewed