నిధులూ ఇవ్వలే.. పనీ చేయలే.!

by Anukaran |   ( Updated:2021-01-15 20:37:12.0  )
నిధులూ ఇవ్వలే.. పనీ చేయలే.!
X

‘‘రైతు సమితులలో టీఆర్ఎస్ కార్యకర్తలే ఉంటారు. మేం చేసేది తప్పయితే ప్రజా కోర్టులో మాకు శిక్ష తప్పదు. ఒప్పయితే మళ్లా మేమే గెలుస్తాం.. అటుకులు బుక్కో.. అన్నం తినో.. ఉపవాసం ఉండో.. నీళ్లు తాగో.. ఈ బక్కపేద టీఆర్ఎస్ కార్యకర్తలే తెలంగాణ తెచ్చిన్రు 14 సంవత్సరాలు కొట్లాడి. ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణానికి కూడా గా కార్యకర్తలే పనిచేస్తరు. వాళ్లే రైతుబంధు సమన్వయ సమితులలో ఉంటరు. నేను అధికారికంగా చెబుతున్నా. విశ్వాసం ఉన్నోళ్లను, నమ్మకం ఉన్నోళ్లను, ప్రభుత్వ లక్ష్యాలను అర్థం చేసుకుని దానిని కొనసాగించే వాళ్లనే పెడతం. ఇదీ మా కమిట్‌మెంట్. మా ప్రభుత్వం.. మేం అనుకున్నట్టుగానే చేస్తాం.. మీరనుకున్నట్టు చేయం. విత్తనం నాటిన నుంచి దిగుబడి వచ్చే వరకూ సమన్వయ సమితులు ముందుండి నడిపిస్తయి. రైతు వేదికలలో కూర్చుండి సమన్వయ సమితి సభ్యులు చర్చ పెడుతరు” –2018లో రైతుబంధు సమన్వయ సమితుల ఏర్పాటు సందర్భంగా అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన

1.60 లక్షల మందితో నియమించిన రైతుబంధు సమన్వయ సమితులు ఉనికిలో లేకుండా మారాయి. పని లేని పదవులు వెలగబెడుతున్నారు. కనీసం తాము వ్యవసాయానికి సంబంధించిన సంస్థలో సభ్యులమనే మర్చిపోయారు. 2017లో ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌కు రూపాయి నిధులు లేవు. విధులూ లేకుండా పోయాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: రైతు సమన్వయ సమితిగా ఏర్పాటై రైతుబంధు సమన్వయ సమితిగా రూపాంతరం చెందిన ఈ సమితులపై మొదట్లో పెద్ద బాధ్యతలను ప్రకటించారు. రైతులకు చెల్లించాల్సిన పెట్టుబడిసాయం, భూసార పరీక్షలతో ప్రయోజనాలు, పంటల మార్పిడితో వచ్చే దిగుబడులు, క్రాప్‌ కాలనీల ఏర్పాటు, ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ పనులు చేపట్టడం, రైతులకు బ్యాంకుల ద్వారా రుణాల మంజూరు, ఖరీఫ్‌, రబీ సీజన్‌లో దిగుబడి అయిన పంటలకు మద్దతు ధర, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయ పనిముట్ల వినియోగం, రైతులకు సబ్సిడీపై అందుతున్న విత్తనాలు, ఎరువులు, యంత్రాలు, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పలు సంక్షేమ పథకాలను రైతులకు చేరవేయాల్సిన బాధ్యత మొత్తం రైతుబంధు సమన్వయ సమితులకు అప్పగించారు. వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, ఉపాధిహామీ పథకం, పశుసంవర్థక శాఖ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయడంతో పాటు గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఏయే పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటుందో రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి సీజన్.. ప్రతి ఏడాది రైతు వేదికలను సమావేశ పరిచి ప్రణాళిక రూపొందించాలి. రైతులకు ఇబ్బంది రాకుండా అధికారులు – రైతులకు మధ్య వారధిగా పనిచేస్తారని, విత్తనం నాటే నుంచి దిగుబడి అమ్మే వరకు రైతు సమన్వయ సమితులు ముందుండి పైలట్ చేస్తారని సీఎం కేసీఆర్ ప్రకటించి మార్గదర్శకాలు కూడా జారీ చేశారు.

రాష్ట్రంలో చైర్మన్.. లక్షన్నరకుపైగా సభ్యులు

2017 ఆగస్టు 27న రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. ఇందులో, రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీలతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా 1,60,995 మంది సభ్యులు ఉన్నారు. కానీ, రాష్ట్రంలో అసలు రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌ అనేది ఒకటి ఉందని, రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు కమిటీలు ఉన్నాయనే విషయాన్ని అటు సభ్యులు, ఇటు రైతులు కూడా మరిచిపోయారు. సభ్యులకు ప్రభుత్వం గౌరవ వేతనం ప్రకటించినా ఇచ్చేందుకు కార్పొరేషన్‌లో చిల్లిగవ్వ లేదు. కమిటీలు ఏర్పాటు చేసిన తొలినాళ్లలో పట్టాదారు పాస్‌ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు, రైతు బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమాల్లో వీరు హడావుడి చేశారు. ఆ తర్వాత ఊసే లేదు.

కార్పస్‌, ఎమ్మెస్పీ ఫండ్‌ ఉత్తిదే

రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌కు రూ.200 కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. రైతుల నుంచి వివిధ పంటల కొనుగోలుకు రూ.500 కోట్ల ఎమ్మెస్పీ ఫండ్‌ కేటాయిస్తామని, రైతు వేదికల నిర్మాణాలకు మరో రూ.300 కోట్లు మంజూరు చేస్తామని వాగ్దానం చేశారు. దీని ప్రకారం రూ.1,000 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. కానీ నయా పైసా ఇవ్వలేదు. రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌కు నల్లగొండ జిల్లాకు చెందిన అప్పటి ఎంపీ గుత్తా సుఖేందర్‌‌రెడ్డి చైర్మన్‌గా నియమితులయ్యారు. 2018 ఫిబ్రవరి 22న బాధ్యతలు స్వీకరించారు. 17 నెలల 11 రోజులపాటు ఆయన పదవిలో ఉన్నారు. అనంతరం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడంతో చైర్మన్‌ పదవికి గుత్తా రాజీనామా చేశారు. ఆ తర్వాత 2019 నవంబర్ 17న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని నియమించారు.

కమిటీ సభ్యుల్లో నైరాశ్యం

ప్రతి రెవెన్యూ గ్రామానికి 15 మంది, మండల, జిల్లా స్థాయిలో 24 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.61 లక్షల మంది రైతు సమన్వయ సమితి సభ్యులు ఉన్నారు. వీరితోపాటు గ్రామ, మండల, జిల్లా కో ఆర్డినేటర్లలో తీవ్ర నైరాశ్యం నెలకొంది. తొలినాళ్లలో శిక్షణ తరగతులు నిర్వహించి వదిలేశారు. ఈ తరగతులకు సీఎం కేసీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై సమితుల అధికారాలు, బాధ్యతల గురించి వివరించారు. పలు హామీలు కూడా ఇచ్చారు. కానీ, ఎలాంటి ప్రణాళిక రూపొందించలేదు. క్లస్టర్‌, మండల, జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడ దళారీ వ్యవస్థకు చెక్‌ పడుతుందని భావించినా ప్రయోజనం లేకుండాపోయింది. కనీసం గుర్తింపు కార్డులు కూడా లేవని, అసలు కమిటీలు ఉన్నాయా? రద్దయ్యాయా? అన్న విషయాన్ని తేల్చుకోలేకపోతున్నామని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2018 మే నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయ సమితి కమిటీలు వేశారు. కేవలం అధికారపార్టీ నేతలకు అవకాశం కల్పించే ఉద్దేశంతోనే రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేశారనేది స్పష్టమైంది.

నియంత్రిత సాగు, కొనుగోలు కేంద్రాల ఎత్తివేతతో ప్రశ్నార్థకం

తాజాగా సీఎం కేసీఆర్ వ్యవసాయంలో కేంద్రం దారిలో వెళ్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియంత్రిత సాగును ఎత్తివేశారు. ప్రతి గింజను కొంటామంటూ చెప్పి కొనుగోలు కేంద్రాలను మధ్యలోనే ఎత్తివేశారు. వచ్చే ఏడాది నుంచి ఏదైనా రైతుల ఇష్టమే అంటూ వదిలేశారు. దీంతో ఇప్పుడు రైతుబంధు సమన్వయ సమితులు ఏం చేయాలనేది ప్రశ్నగా మారింది. ప్రభుత్వం చాలా కీలకంగా తీసుకున్న అంశాలపైనే చేతులెత్తేస్తే.. ఇప్పుడు మేమేం చేయాలని రైతు సమన్వయ సమితి సభ్యులు ప్రశ్నించుకుంటున్నారు.

చైర్మన్‌కు మాత్రమే స్పెషల్​

మరోవైపు రైతుబంధు సమన్వయ సమితులకు ఏం లేకున్నా.. కేవలం చైర్మన్‌గా ఉన్న పల్లా రాజేశ్వర్​రెడ్డి మాత్రమే రాజభోగాలు అనుభవిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. రైతుబంధు గివ్ ఇట్ అప్ నిధుల నుంచి రూ.25 లక్షలతో కొత్త వాహనాన్ని కొనుగోలు చేశారు. దాని నిర్వహణ మొత్తం రైతుబంధు సొమ్ము నుంచే. ఇక కార్యాలయం, సిబ్బంది ఖర్చు కూడా అక్కడి నుంచే. రాష్ట్ర సభ్యులు, జిల్లా కో-ఆర్డినేటర్లు, సభ్యులు మాత్రం తమకు ఏమైనా అవకాశం కల్పిస్తారా.. అనే ధోరణితో ఎదురుచూస్తున్నారు.

“నేను రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీలో డైరెక్టర్‌ను. ఈ పోస్టు కోసం ఎంతో రాజకీయం చేయాల్సి వచ్చింది. పైరవీ కూడా చేశా. పేరుకు ఓ పదవైతే ప్రకటించారు. అధికారాలు, బాధ్యతలు ఏమీ లేవు. ఆ పదవి ఒకటి ఉన్నట్లు గుర్తు కూడా లేదు. గౌరవ వేతనం ప్రకటించినా.. ఒక్క నెల కూడా ఇవ్వలేదు. కార్యాలయం, కేరాఫ్‌ అడ్రస్‌ కూడా లేవు. పాస్‌‌పుస్తకాలు, ఎరువులు, విత్తనాలు ఇప్పించుడు దేవుడెరుగు.. అసలు మీరెందుకు ఉన్నారని మా ఇంట్లో కూడా అడుగుతుంటే ఏమని చెప్పాలో తెలుస్తలేదు. మొదట్లో నమస్తే పెట్టిన వ్యవసాయ శాఖ సిబ్బంది ఇప్పుడు కనీసం పలకరించే పరిస్థితులలో కూడా లేరు.

– రైతుబంధు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్​ ఆవేదన ఇది

Advertisement

Next Story

Most Viewed