న్యాయవాదులకు నో డ్రెస్‌కోడ్..

by Shyam |
న్యాయవాదులకు నో డ్రెస్‌కోడ్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : హైకోర్టు మినహా మిగిలిన కోర్టుల్లో విచారణకు హాజరయ్యే న్యాయవాదులు నల్లకోటు ధరించాల్సిన అవసరం లేదు. కేవలం హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో జరిగే విచారణలకు హాజరయ్యే న్యాయవాదులు మాత్రమే నల్లకోటు నిబంధనను పాటించాల్సి ఉంటుంది. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ బార్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. జూలై 15వ తేదీ వరకు ఈ మినహాయింపు ఉంటుందని తెలంగాణ బార్ కౌన్సిల్ కార్యదర్శి రేణుక రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్లకు గురువారం రాసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

మార్చి నెల నుంచి జూన్ వరకు వేసవి కారణంగా తీవ్రమైన వేడి ఉంటుందని, నల్లకోటు ధరించడం ద్వారా ఏర్పడే ప్రతికూల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గతంలో భారత బార్ కౌన్సిల్, తెలంగాణ బార్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ సంవత్సరం కూడా తీసుకున్నట్లు వివరించారు. నల్లకోటు ధరించకపోయినప్పటికీ విచారణకు హాజరయ్యే న్యాయవాదులు తెల్ల షర్టు, తెల్ల ప్యాంటు లేదా సిమెంటు రంగులో ఉండే ప్యాంటు, నల్ల ప్యాంటు మీద తెల్లని చారలు ఉన్నదైనా ధరించవచ్చని పేర్కొన్నారు. మహిళా న్యాయవాదులు కూడా ఇదే రంగులోని దుస్తులను ధరించవచ్చు. రాష్ట్ర హైకోర్టు సైతం వేసవి కాలంలో న్యాయవాదుల డ్రెస్ కోడ్ మీద ఒక సర్క్యులర్ జారీ చేసిందని రేణుక తన సర్క్యులర్‌లో ప్రస్తావించారు.

Advertisement

Next Story