తొమ్మిదేండ్లుగా కార్డుల్లేవ్​

by Anukaran |
No cards for nine years
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పేద వర్గాలు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. ప్రభుత్వం తెల్ల రేషన్​ కార్డులు జారీ చేయకపోవడంతో వైద్యానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. రేషన్​ కార్డు ఉంటేనే ఆరోగ్య శ్రీ కార్డు జారీ చేయాల్సి వస్తుండటంతో దాదాపు 9 ఏండ్ల నుంచి ఒక్క కొత్త ఆరోగ్య శ్రీ కార్డు జారీ చేయలేదు. దీంతో అర్హులైన పేదలు ఆరోగ్య శ్రీ కింద వైద్యం చేయించుకోలేకపోతున్నారు. ఖరీదైన వైద్యం చేయించుకుని సీఎం రిలీఫ్​ ఫండ్​కోసం దరఖాస్తు పెట్టుకుంటే చేసిన ఖర్చులో కనీసం 40 శాతం కూడా రావడం లేదు.

పేదలకు ఖరీదైన వైద్యం కోసం..!

పేద వర్గాలకు కార్పొరేట్​ వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఉమ్మడి ఏపీలో 2007, ఏప్రిల్​ 1న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్​రాజశేఖరరెడ్డి రాజీవ్​ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించారు. దీన్ని తొలుతగా ప్రయోగాత్మకంగా మహబూబ్​నగర్, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో మొదలుపెట్టారు. దీన్ని అప్పుడు ఓ ‘కీలక’ పథకంగా ప్రారంభించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రభుత్వం అదే పేరుతో ఆరోగ్యశ్రీని కొనసాగిస్తోంది. వివిధ వైద్య విభాగాల కింద 1044 రకాల చికిత్సలకు అదనంగా మరికొన్ని చేర్చి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు వైద్యం అందిస్తున్నారు. ఆధార్‌తో అనుసంధానమై తెలుపు రేషన్ కార్డు ఉన్నప్రతి ఒక్కరూ ఆరోగ్య శ్రీ పథకానికి అర్హులు. దీని ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాది రూ. 2.5 లక్షల వరకు వైద్య బీమా లభిస్తుంది.

ఈ పథకాన్ని ‘ఆరోగ్యభాగ్య’ పేరుతో కర్ణాటకలో, గుజరాత్‌లో ‘ముఖ్యమంత్రి అమృతం, తమిళనాడులో ‘ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా’ పేర్లతో అమలు చేస్తున్నారు. తాజాగా ఆ రాష్ట్రాల్లో కొత్త కార్డులు కూడా మంజూరు చేస్తూనే ఉన్నారు.

కొత్త కార్డులు లేవు

రాష్ట్రంలో తెల్ల రేషన్​ కార్డుల మంజూరుకి బ్రేక్​ వేశారు. దాదాపుగా ఆరేండ్ల నుంచి ఒక్క కార్డు ఇవ్వడం లేదు. ఆరేండ్ల కిందట తెలంగాణ ప్రభుత్వం రేషన్​ కార్డుల్లో మార్పులు తీసుకువచ్చింది. అప్పుడు పాత వాటినే పునరుద్ధరించారు. అయితే కొత్తగా కార్డులు జారీ చేయలేదు. దీనికితోడుగా ఫుడ్​ సెక్యూరిటీ కార్డులంటూ తాత్కాలికంగా కొన్ని మంజూరు చేశారు. అంతే మినహా… తెల్ల రేషన్​ కార్డులు జారీ చేయలేదు. అంతకు ముందు బోగస్​ రేషన్​ కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టి లక్షల కార్డులను తొలగించారు. వీటిలో కొన్ని అర్హులైన పేదలవి కూడా తొలిగిపోయాయి. అలాంటి వారితో పాటుగా కొత్త వారికి కూడా జారీ చేస్తామని ప్రభుత్వం ప్రతి ఏడాది చెప్పుతూనే వస్తోంది. బోగస్​ కార్డుల ఏరివేత తర్వాత కొత్త రేషన్‌ కార్డుల కోసం 5,63,139 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇవన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనికి తోడుగా 2019 అక్టోబర్​ నుంచి దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ పని చేయడం లేదు. దీంతో కొత్త దరఖాస్తులకు అవకాశం లేకుండా పోయింది.

మరోవైపు పౌరసరఫరాలశాఖ అధికారిక లెక్కల ప్రకారం కొత్త రేషన్‌ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు ఐదు లక్షలకు పైగా పెండింగ్‌లో ఉండగా, తల్లిదండ్రుల నుంచి వేరైనా వివాహిత జంటలు పెట్టుకున్న మ్యుటేషన్‌ కార్డుల విషయం కూడా చాలా వరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా దరఖాస్తు చేసుకోలేని వారి సంఖ్య కూడా లక్షల్లోనే ఉంటుందంటున్నారు.

ఆరోగ్య శ్రీకి ఆటంకం

తెల్ల రేషన్​ కార్డులు ఉంటేనే ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేస్తారు. అయితే దీనికి ప్రభుత్వం ఇచ్చిన ఫుడ్​ సెక్యూరిటీ కార్డును పరిగణలోకి తీసుకోవడం లేదు. ఫలితంగా కొత్త కార్డులు ఇవ్వడం మొత్తం ఆగిపోయింది. ఆరోగ్య శ్రీ కార్డులను 9 ఏండ్ల నుంచి ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కొంతమంది డయాలసిస్​ పేషెంట్లు వైద్యం కోసం వెళ్తుంటే ఆరోగ్య శ్రీ కార్డు తప్పనిసరి కావడంతో ఖరీదైన వైద్యానికి నోచుకోలేకపోతున్నారు. కొంతమంది వైద్యం చేయించుకుని సీఎంఆర్ఎఫ్​ కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. కానీ లక్షల్లో వైద్యానికి ఖర్చు అయినా… ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్​ కింద ఇచ్చే సొమ్ము చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటికైనా ఫుడ్​ సెక్యూరిటీ కార్డులను పరిగణలోకి తీసుకుని కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేయాలని వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed