దందా బంద్.. లాక్‌డౌన్‌తో డీల్స్ నిల్ !

by Shyam |
దందా బంద్.. లాక్‌డౌన్‌తో డీల్స్ నిల్ !
X

దిశ, న్యూస్‌బ్యూరో: ప్రభుత్వ, ప్రైవేటు, అసంఘటిత రంగ ఉద్యోగులను ఎవరినీ వదలకుండా అందరిపై లాక్‌డౌన్ ప్రభావం పడింది. ఒక్క నిత్యావసరాలు అమ్ముకునే వాళ్లు తప్ప స్వయం ఉపాధిదారులందరి ఆర్థిక పరిస్థితిని కరోనా దారుణంగా దెబ్బ తీసింది. దీని ప్రభావంతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ సెకండ్ సేల్స్ పై ఆధారపడ్డ వేల మంది ఏజెంట్ల పరిస్థితి అద్వాన్నంగా మారింది. రాజధాని నగరంలో ఓపెన్ ప్లాట్లు, సెకండ్ హ్యాండ్ ఇళ్ల కొనుగోలు అవసరాలున్న వారు ప్రస్తుత పరిస్థితుల వల్ల ఆ పనిని వాయిదా వేసుకుంటున్నారు. దీంతో ఓపెన్ ప్లాట్లు పాత ఇళ్ల అమ్మకాలు, కొనుగోళ్లపైనే ఆధారపడ్డ రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు ఉపాధి కరువైంది. సాధారణంగా కొత్త ఇళ్లు కొనుక్కోలేని వాళ్లకు, ఉన్న ఇళ్లు ఏదో ఒక ఆర్థిక అవసరమొచ్చి లేదా ఇతర కారణాల వల్ల అమ్ముకునే వాళ్లకు ఈ ఏజెంట్లే దిక్కు. రోజువారి కార్యకలాపాల్లో బిజీగా ఉండే నగర ప్రజలకు ఇళ్లు అమ్మాలన్నా, కొనాలన్నా అన్ని పనులు దగ్గరుండి చేసిపెట్టి రిజిస్ట్రేషన్ అయ్యేదాకా వెన్నంటే ఉంటారు. ఇందుకుగాను మొత్తం ప్రాపర్టీ విలువలో ఒకటి లేదా 2 శాతం కమీషన్‌గా తీసుకుంటుంటారు. మార్చి రెండోవారం దాకా జోరుగా సాగిన వీరి కార్యకలాపాలు జనతా కర్ఫ్యూ ప్రారంభమైన రోజు నుంచి నిలిచిపోయాయి. ఇళ్లు, ప్లాట్లు కొనేవారి దగ్గర నుంచి కొత్త ఎంక్వైరీలు లేకపోవడంతో పాటు ఆల్రెడీ ఓకే అయిపోయిన డీల్స్ సైతం రిజిస్ట్రేషన్‌లు పూర్తికాక వీరి కమీషన్ చేతికిరాక మధ్యలో ఆగిపోయాయి.

పాత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోకి వచ్చే మొత్తం 39సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు కేంద్రంగా నగరంలో రియల్ ఏజెంట్ల కార్యకలాపాలు కొనసాగుతుంటాయి. వీటిలో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండే 10 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు జోరుగా జరుగుతుంటాయి. నగరంలో 30వేల మందికిపైన యాక్టివ్ ఏజెంట్లు ఉంటారు. ఏ రిజిస్ట్రార్ ఆఫీసు పరిధిలో ఉండే ఏజెంట్లు ఆ ప్రాంతంలో అమ్మకానికి ఉన్న ప్లాట్లు, ఇళ్ల సమాచారాన్ని సేకరించి పెట్టుకుంటారు. ఈ సమాచారాన్ని సులేఖ.కామ్, జస్ట్ డయల్, నైన్టీనైన్ ఎకర్స్. కామ్, క్వికర్. కామ్ లాంటి ఆన్‌లైన్ క్లాసిఫైడ్లలో ఆర్థిక పరిస్థితిని బట్టి అడ్వర్టైజ్ చేస్తుంటారు. ఈ ప్రకటనలు చూసి ఫోన్లు చేసే వాళ్లకు ప్లాట్లు, ఇళ్ల గురించి పూర్తిగా తెలియజేయడమే కాకుండా కస్టమర్ ఆసక్తిగా ఉంటే ప్రాపర్టీ దగ్గరుండి చూపిస్తారు. ప్రాపర్టీ నచ్చితే ఓనర్‌తో బేరం మాట్లాడించి రేటు ఫైనల్ చేయించి ఒప్పందం కుదురుస్తారు. ఫైనల్‌గా రిజిస్ట్రేషన్ చేయించి వారిచ్చే కమీషన్ తీసుకుంటారు. ఇలా నెలలో ఒకటి కంటే ఎక్కువ డీల్స్ జరిగిన సందర్భాలు, ఒకటి కూడా లేని రోజులూ ఉంటాయి. సంబంధిత ఏరియాలో ఉన్న ప్లాట్లు, ఇళ్ల గురించి ఎప్పుడు ఏ కస్టమర్ సెర్చ్ చేసినా వీరి ఫోన్ నెంబర్లు వచ్చేందుకుగాను ఆన్‌లైన్ క్లాసిఫైడ్ సైట్‌లకు నెలకు వెయ్యి నుంచి రూ.3వేల వరకు చెల్లిస్తుంటారు. ఇలా చెల్లించకపోతే కస్టమర్ సెర్చ్ చేసినపుడు వీరి నెంబర్ కనిపించక డీల్స్ ఎక్కడపోతాయో అని భయంతో వాటిలో అప్డేట్‌గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుత కరోనా టైంలో డీల్స్ ఏవీ లేకపోయినప్పటికీ యాడ్స్ పేమెంట్ భారం మాత్రం తప్పడం లేదని వీరు వాపోతున్నారు. ఈ టైంలో కూడా ఎవరైనా కస్టమర్ ఫోన్ చేస్తే డీల్ కుదరకపోయినా కనీసం అవసరం ఉన్న కస్టమర్ నెంబర్ అయినా దొరుకుతుందని ఆశతో రోజులు వెల్లదీస్తున్నామని చెబుతున్నారు.

కొత్తగా నిర్మించిన అపార్ట్ మెంట్లలో ఫ్లాట్స్, ఇళ్లు ప్రతి ఏడాడి ఎలాగూ అమ్ముడవుతుంటాయి. వీటి సేల్స్, రిజిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అయితే పాత ఇళ్ల అమ్మకాలు, కొనుగోళ్ల లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయమూ గణనీయంగానే ఉంటుంది. ఒకసారి రిజిస్టర్ అయిన ప్రాపర్టీని రకరకాల కారణాల వల్ల ఓనర్లు అమ్ముకోవాలనుకొంటే దాన్ని కార్యరూపంలో పెట్టేది ఈ రియల్ ఏజెంట్లే. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ప్రతి ఏడాది రియల్ ఎస్టేట్ మార్కెట్ కొత్త, పాత లావాదేవీల విలువ కలిపి రూ.20వేల కోట్ల దాకా ఉంటుందని ఒక అంచనా. వీటి రిజిస్ట్రేషన్‌ల ద్వారా ప్రభుత్వానికి కొన్ని వేల కోట్లలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం వస్తోంది. ఈ ఏజెంట్ల ప్రొఫెషన్, ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుందని చెప్పకతప్పదు. అయితే ప్రస్తుతం రియల్ ఎస్టేట్ లావాదేవీల గురించి ఆలోచించే పరిస్థితుల్లో ఎవరూ లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు దాదాపు ఆగిపోయి ఈ ఏజెంట్లకు పనిలేకుండా పోయింది. అప్పులు చేసి జీవితం వెల్లదీయాల్సిన పరిస్థితిలో పడ్డారు.

సెకండ్ హ్యాండ్ మార్కెట్ నిల్ అయింది..
– నవీన్ యాదవ్, మారేడుపల్లి రియల్‌ఎస్టేట్ ఏజెంట్

‘రిజిస్ట్రేషన్లు చేయడానికి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు తెరిచే ఉన్నేప్పటికీ రియల్ ఎస్టేట్ అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ మధ్య కాలంలో కొత్త ఇళ్లు ఫ్లాట్లు కొనుక్కొని రిజిస్ట్రేషన్ దాకా వచ్చి ఆగిపోయిన కొద్ది మంది మాత్రం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వస్తున్నారు. ఇక సెకండ్ హ్యాండ్ మార్కెట్ అయితే పూర్తిగా నిల్ అనే చెప్పాలి. కస్టమర్‌కు ఫోన్ చేసి పలానా చోట ఫ్లాటు, ఇళ్లు ఉందని చెప్పాలంటే ఇప్పుడున్న పొజిషన్ లో మాకే మనసు రావడం లేదు. లాక్‌డౌన్‌లో ఎవరు ఇళ్లనుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఇక రియల్ ఎస్టేట్ గురించి ఆలోచించే వాళ్లెవరు. నెల, రెండు నెలల నుంచి డీల్స్ లేవు. ముందు ముందు పరిస్థితులెలా ఉంటాయో తెలియడం లేదు. రేషన్ కార్డు మీద వచ్చిన బియ్యం, రూ.1500 తీసుకున్నాం. వచ్చే నెల కూడా ఇస్తారంటున్నారు.

నోట్లరద్దు, రెరా, ఇప్పుడు కరోనా
– నాగేశ్వర్ రావు, మియాపూర్‌లో రియల్ ఏజెంట్

ఒక మూమెంట్ లో నెలకు రూ.50వేలు సంపాదించిన రోజులున్నాయి. ఆ మధ్య నోట్ల రద్దు, రెరా చట్టం వచ్చిన తర్వాత వ్యాపారం డల్ అయింది. మళ్లీ పిక్అప్ అవుతుందనే టైంలో ఈ కరోనా వచ్చిపడింది. రెరా వచ్చిన తర్వాత మాలాంటి బ్రోకర్లకు కూడా లైసెన్సు, రిజిస్ట్రేషన్ ఉండాలంటున్నారు. కస్టమర్లు కూడా ఈ మధ్య కట్టిన ఫ్లాట్లకైతే రెరా రిజిస్ట్రేషన్ ఉందా అని అడగడం మొదలుపెట్టారు. ఎలాగోలా కస్టమర్లను పట్టుకొని కన్విన్స్ చేసుకొని దందా చేసుకుంటుంటే పూర్తిగా ఒక్క మనిషి కనిపించకుండా చేసింది ఈ కరోనా. కస్టమర్లే వారికి అవసరముండి చేసిన ఎంక్వైరీలే అమ్మకాల దాకా వెళతాయి. మనకు మనంగా ఫోన్ చేస్తే పనవదు. ఇలాంటి సమయాల్లో ఎవరినీ కదిలించే పరిస్థితి లేదు. ఇదంతా ముగిసిన తర్వాత రేట్లు ఏమైనా తగ్గితే కాస్త డబ్బున్న కస్టమర్లు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. ఆ టైం కోసం వేచి చూడడం తప్ప చేసేది ఏమీ లేదు. ఇల్లు గడవడం ఇబ్బందిగానే ఉంది. తెలిసిన వాళ్ల దగ్గర అప్పు తీసుకొని బతుకు బండి ఈడ్చుకొస్తున్నాం.

Tags: telangana, lockdown, real estate, hyderabad, registrations, real estate agents, employment

Advertisement

Next Story