కోఠి ENTలో ఖాళీ లేని మంచాలు- పొంతన లేని లెక్కలు

by Shyam |
కోఠి ENTలో ఖాళీ లేని మంచాలు- పొంతన లేని లెక్కలు
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: బ్లాక్ ఫంగస్ రోగులకు వైద్య చికిత్సలు అందించేందుకు గాను అధికారులు చర్యలు చేపడుతున్నారు. కోఠి ఈఎన్‌టీ హాస్పిటల్‌లో ఉన్న 200 పడకలు ఇప్పటికే నిండుకున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్‌ఫంగస్ వ్యాధి బారినపడిన రోగులు వందల సంఖ్యలో హాస్పిటల్‌కు వస్తున్నారు. వీరికి వైద్యం అందించడం హాస్పిటల్ అధికారులకు తలకు మించిన భారంగా మారింది. పాత అడ్మీషన్లలో డిశ్చార్జ్ లు లేకపోవడం, కొత్త అడ్మీషన్లు వందల సంఖ్యలో వస్తుండడంతో వారికి ఏమి చేయాలో పాలు పోవడం లేదు. దీంతో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి అదనపు పడకల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఖాళీ లేని మంచాలు – పొంతన లేని లెక్కలు

కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో ప్రస్తుతం 200 పడకలు పూర్తి స్థాయిలో బ్లాక్‌ఫంగస్ రోగులతో నిండిపోయాయి. దీంతో కొత్తగా వచ్చే రోగులకు పడకలు సర్దుబాటు చేయడంలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం ఆసుపత్రిలో ఇప్పుడున్న పడకలకు అదనంగా మరో 30 పడకలను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే తప్పా ఆసుపత్రిలో రోగులకు మంచాలు అందుబాటులో ఉండవు. వైద్యం కోసం వచ్చిన రోగులకు పడకలు లేకపోవడంతో వారిని హాస్పిటల్ బయటనే నిలిపివేస్తుండగా, రోగులు వైద్యం కోసం పడరాని పాట్లు పడుతున్నారు.

అయితే ఆసుపత్రి అధికారులు మాత్రం రోగుల లెక్కలను తక్కువ చేసి చూపుతున్నారు. శనివారం మొత్తం 252 మంది రోగులు ఓపీ విభాగానికి రాగా వీరిలో కేవలం 15 మందిని అడ్మిట్ చేసుకున్నామని, వీరితో కలిపి హాస్పిటల్ లో 127 మంది రోగులు మాత్రమే ఉన్నారని, వీరిలో 9 మందికి సర్జరీలు చేయగా ఒక్కరిని డిశ్చార్జ్ చేసినట్లు, ఇంకా 73 పడకలు ఖాళీగా ఉన్నాయని అధికారులు పొంతన లేని లెక్కలు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చిన రోగులను చేర్చుకోవాలని వైద్యులు, సిబ్బందిని కోరితే మంచాలు ఖాళీ లేవని చెబుతున్నారు. ఇలా తప్పుడు లెక్కలు చూపి రోగులను ఇబ్బందులు పెట్టడంలో మతలబు ఏమిటో అని రోగులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు .

Advertisement

Next Story

Most Viewed