తేలిన అధికారుల తప్పులు.. చర్యలు మాత్రం నిల్!

by Sridhar Babu |   ( Updated:2021-12-12 03:41:18.0  )
Dharna-1
X

దిశ, తుంగతుర్తి: విధినిర్వహణలో తప్పులు చేశారు ..! దీనిపై బాధితుల నుండి పెద్ద ఎత్తున నిరసనలు ఎదురయ్యాయి….!! చివరికి జాప్యం చేస్తే పరిస్థితులు విషమించి పోతాయనే ఉద్దేశంతో సంబంధిత శాఖల స్థానిక పై అధికారులు జోక్యం చేసుకొని న్యాయం చేస్తామని చెబుతూ అప్పటికప్పుడే విచారణలు చేశారు. ఫలితం బాధితులు చేసిన ఆందోళనలు నిజమేనని తేలింది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తున్నట్లు విచారణ చేపట్టిన అధికారులు ఎవరికి వారే చెప్పుకొచ్చారు. ఈ ముచ్చట్లన్నీ దాదాపు వారం రోజుల క్రితంవి. ఇంతవరకు బాగానే ఉంది. ఇక అసలు విషయాలకొస్తే…. తప్పు చేసిన వారిపై చర్యలు లేవు, మందలింపులు లేవు.. అంతా యథా రాజా… తథా ప్రజా అన్నట్లుగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని పోలీస్, సంఘ బంధాల శాఖల్లో నెలకొంది. ఈ పరిణామాలతో ఆయా శాఖలపై ఇంతవరకు ప్రజల్లో ఉన్న నమ్మకాలు పూర్తిగా సన్నగిల్లి పోతున్నాయి.

గత నెలలో కర్నూలు జిల్లా కె మార్కాపురం ప్రాంతానికి చెందిన సంచార జాతుల కుటుంబాలు జీవనోపాధి నిమిత్తం తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి వచ్చాయి. అయితే రేకేంద్ర ప్రియాంక(14) అనే మైనర్ బాలిక వివిధ పనుల నిమిత్తం గత నెల 27న తుంగతుర్తి మండల కేంద్రానికి వచ్చి ట్రాక్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ లో చికిత్స పొందుతూ దాదాపు వారం రోజుల అనంతరం మృతి చెందింది. కాగా దీనిపై తుంగతుర్తి ఎస్ఐ ఆంజనేయులు రెండు బైకులు ఢీ కొనడం వల్లే మృతి చెందినట్లుగా విషయాన్ని పక్కదోవ పట్టించారని ఆరోపిస్తూ సంచారజాతుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ట్రాక్టర్ ప్రమాదం వల్లనే ప్రియాంక మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు. ఎస్ఐ అసలు విషయాన్ని పక్కదోవ పట్టించారని పేర్కొంటూ ఏకంగా స్థానిక పోలీస్ స్టేషన్ ముందే ధర్నా, చౌరస్తాలో రాస్తారోకోలు పెద్దఎత్తున చేపట్టి ఎస్ఐపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విషయం సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు చేరడంతో అప్పటికప్పుడు తుంగతుర్తి సీఐ రవికుమార్ విచారణ చేపట్టారు. విచారణలో ట్రాక్టర్ ప్రమాదంలో ప్రియాంక మృతి చెందినట్లు చెప్పడమే కాకుండా ఆందోళనకారులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి శాంతింపజేశారు.

CC-1

ఇక మరో సంఘటన….

తుంగతుర్తి మండల కేంద్రంలోని సమభావన సంఘాల సీసీ సుధాకర్ గత ఐదు రోజుల క్రితం ముందు నుండే రైతులతో రహస్యంగా ఒప్పందాలు చేసుకొని ఎలాంటి నియమ నిబంధనలు లేకుండానే ధాన్యాన్ని నేరుగా లారీల ద్వారా మిల్లులకు పంపుతున్న విషయాన్ని రైతులు గ్రహించారు. ఈ మేరకు ధాన్యం లోడుతో వెళ్తున్న లారీని కాపు కాచి పట్టుకున్నారు. ఇది అన్నారం గ్రామ పరిసరాల్లో జరిగిన సంఘటన. ముఖ్యంగా నియమ నిబంధనల ప్రకారం పండించిన ధాన్యాన్ని రైతాంగం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి. అక్కడ ధాన్యంలో తాలు లేకుండా తేమశాతం నిర్ణీతంగా ఉంటేనే సీరియల్ నెంబర్ల ప్రకారం తూకాలు వేస్తారు. అయితే కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులు గడుస్తున్నా తూకానికి రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ సీసీ సుధాకర్ కొంతమంది రైతులతో కుమ్మక్కై పొలాల వద్ద ఉన్న ధాన్యాన్ని నేరుగా తరలిస్తున్నారు. దీనిపై మిగితా రైతాంగం చేసిన ఆందోళనలు గ్రహించిన తుంగతుర్తి ఎమ్మార్వో రాంప్రసాద్ అన్నారం గ్రామ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చి విచారణ చేశారు. ఈ మేరకు సీసీ అక్రమాలపై అక్కడి రైతాంగం దుమ్మెత్తిపోసింది. ఈ పరిణామాలతో సీసీ సుధాకర్ అక్కడున్న వారి ముందే తాను తప్పు చేసినట్లు ఒప్పుకుంటూ క్షమించాలని కోరారు. అయినా దీనిపై ఎమ్మార్వో రాంప్రసాద్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపుతున్నట్లు ఆనాడే స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితి

రోజులు గడుస్తున్నా అక్రమాలకు పాల్పడ్డ సంబంధిత శాఖల ఉద్యోగులపై చర్యల పరంగా ఉన్నతాధికారుల నుండి ఉలుకు లేదు… పలుకు లేదు. అసలు నివేదికలు అధికారుల పరిశీలనలో ఉన్నాయా..? లేక మరుగున పడ్డాయా…?? అనే సందేహాలు ప్రజానీకంలో వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed