లైనింగ్ పనులు వెరీ స్లో..!

by Shyam |
లైనింగ్ పనులు వెరీ స్లో..!
X

నిజాంసాగర్ కెనాల్ లైనింగ్ (సిమెంట్) పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఆరేండ్ల క్రితం పనులు ప్రారంభించారు. మొత్తం 8.7 కి.మీ. పనులకు గాను కేవలం 2 కి.మీ. పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 6.7 కిలో మీటర్ల సిమెంట్ లైనింగ్ పనులు పూర్తి కావాల్సి ఉంది. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. కాలువ వెంబడి వెలిసిన ఆక్రమణలను రాజకీయ కారణాలతో నేటికీ తొలగించ లేదు. ఈ పనులు పూర్తయితే గానీ ఎస్సారెస్పీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు నీళ్లొచ్చే పరిస్థితి లేదు. ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన రివ్యూ సమయంలో చర్చకు వచ్చిన ఈ కాలువ లైనింగ్ పనులు ఇప్పటికైనా గాడిలో పడతాయో లేదో వేచి చూడాల్సిందే.

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాకు నిజాంసాగర్ వర ప్రదాయిని. జిల్లాలో ఎక్కువ భాగం సాగుభూమికి సాగర్ నీరే దిక్కు. ఇక్కడ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఉన్నా దాని కింద కొంత మేరే సాగునీరు అందుతుంది. మంజీరా నదిపై పొరుగు రాష్ట్రాలు ఎక్కువ సంఖ్యలో ప్రాజెక్టులు కట్టడం‌తో నిజాంసాగర్ వట్టిపోయింది. ఒకనాడు రెండు పంటలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించిన ప్రాజెక్ట్‌లో నేడు జల కళ కనుమరుగైంది. జిల్లాలోని మాసాని చెరువు, రఘునాథ చెరువుల్లో నీటిని నింపేందుకు ఉద్దేశించిన ప్రధాన కాలువ నిజాంసాగర్ కెనాల్. ఆయా ప్రాంతాలకు సాగు నీరందించేందుకు దశాబ్దాల క్రితం 1931లో ఈ కెనాల్‌ను నిర్మించారు. దీనికి నిజాంసాగర్ ప్రాజెక్ట్ పునరుధ్ధరణ కింద 2009 సంవత్సరానికి ముందే ఉమ్మడి రాష్ట్రంలో సిమెంట్ లైనింగ్ పనులు జరగాల్సి ఉంది. కానీ అప్పటి ప్రభుత్వం పనులు చేపట్టలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీనికి కార్యాచరణ రూపొందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజి 20, 21 పనులకు నీటిని సారంగపూర్ వద్ద పంప్ హౌజ్ నిర్మించి నిజాంసాగర్ ప్రధాన కాలువ లైనింగ్ పనులను చేయాలని నిర్ణయించారు. మొత్తం 8.7 కిలోమీటర్ల సిమెంట్ లైన్ పనులను ఆరేండ్ల క్రితం ప్రారంభించారు. ఇప్పటి వరకు సారంగపూర్ నుంచి నాగారం వరకు కేవలం 2 కిలో మీటర్ల పనులు మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన భాగంలో కాలువ వెంబడి పేదలు గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. ఈ విషయంలో నిజామాబాద్ దక్షిణ, ఉత్తర మండలాల తహశీల్దార్లు, నీటిపారుదల శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. అక్కడ ఆక్రమణలు ఉన్న మాట వాస్తవమేనని, వారికి వేరొక చోట ప్రత్యామ్నాయం చూపించి ఆక్రమణలు తొలగించాల్సి ఉందని ఉన్నతాధికారులకు నివేదికలిచ్చారు. 2019లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పనులు జరిగినప్పటికీ ఆక్రమణలు తొలిగించే వ్యవహారం ఓటు బ్యాంకు రాజకీయాలతో ముడిపడి ఉండడంతో 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల వరకు అవి పనులు పెండింగ్‌లో పడిపోయాయి. దీంతో 6.7 కి.మీ. లైనింగ్ పనులు నిలిచిపోయాయి.

ప్యాకేజీ 20, 21 పూర్తయితే లక్షల ఎకరాలకు సాగునీరు

ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కింద ఏటా కాళేశ్వరం నీళ్లతో ఎస్సారెస్పీని నింపాల్సి ఉంటుంది. ప్యాకేజ్ 20, ప్యాకేజ్ 21 పనుల కింద జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజక వర్గాలకు గోదావరి నీళ్లను లిఫ్ట్ చేయనున్నారు. బినోలా వద్ద గోదావరి నుంచి టన్నెల్ ద్వారా సారంగపూర్ పంప్ హౌస్‌లోకి నీటిని తీసుకు రావాల్సి ఉంటుంది. అక్కడి నుంచి నిజాంసాగర్ పాత కెనాల్‌ (డి 53)కు నీటిని మళ్లిస్తారు. అయితే ప్యాకేజ్ 20లో భాగమైన సారంగపూర్ పంప్ హౌస్ పనులు, సర్జ్ పూల్ పనులు 85 శాతం మేర పూర్తయ్యాయి. ఈ పనులను సీఎంవో కార్యదర్శి స్మితాసభర్వాల్, జిల్లాకు చెందిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గత ఏడాది డిసెంబరులో పరిశీలించారు. మరో రెండు నెలల్లో మొత్తం పనులు పూర్తి చేసి నిజాంసాగర్ పాత కెనాల్‌లోకి నీటిని లిఫ్ట్ చేయాలని అధికారులకు ఆదేశాలు ఉన్నా అవి ఇప్పట్లో సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. ప్యాకేజి 20, 21 పనులు పూర్తయితే ఆర్మూర్ నియోజకవర్గంలో 7 వేలు, బాల్కొండ నియోజకవర్గంలో 80 వేల ఎకరాలు, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 1లక్ష 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో 17 వేల ఎకరాలకు నీరందుతుంది.

Advertisement

Next Story