జిల్లాలో నో మాస్క్ నో సేల్ పాటించాలి: కలెక్టర్ ఫారూఖీ

by Aamani |
జిల్లాలో నో మాస్క్ నో సేల్ పాటించాలి: కలెక్టర్ ఫారూఖీ
X

దిశ, ఆదిలాబాద్: కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం నో మాస్క్ నో సేల్ పాటించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్లు, పోలీసు, వైద్య, రెవెన్యూ శాఖ అధికారులతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వైద్య, పోలీస్, మున్సిపాలిటీ, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 29 వరకు పొడిగిస్తూ కొన్ని సడలింపులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసిందన్నారు. మున్సిపల్ పరిధిలో ఉన్న షాపులకు నెంబర్లను కేటాయించాలన్నారు. 50 శాతం షాపులు మాత్రమే తేరిచేలా చూడాలని మున్సిపల్ కమిషనర్‌లను ఆదేశించారు. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేసేలా చూడాలని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్‌ను ఆదేశించారు. అవసరమైన వస్తువులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇతర అన్ని సేవలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయన్నారు. నిర్మాణానికి సంబంధించిన పనులు చేసుకోవచ్చని, మెటీరియల్, సిమెంటు స్టీల్, హార్డ్ వేర్, ప్లంబర్, ఎలక్ట్రికల్ పరికరాల దుకాణాలు తెరిచి ఉంటాయని, వ్యవసాయ సంబంధమైన యంత్రాలు, విడి భాగాల దుకాణాలు, ఎరువులు, విత్తనాల దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు. ప్రతిరోజు వైన్‌షాపులు తెరిచి ఉంటాయని తెలిపారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనా నియంత్రణ జిల్లా నోడల్ అధికారి డాక్టర్ కార్తీక్ మాట్లాడుతూ వైరస్ నియంత్రణకు అధికారులు, సిబ్బంది కార్యాలయాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జలుబు జ్వరం దగ్గు ఉన్నవారిని గుర్తించాలన్నారు. కార్యాలయాల ప్రవేశ మార్గం ద్వారా వద్ద శానిటైజర్లను ఉంచాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ శశిధర్‌రాజు, అదనపు కలెక్టర్ కే భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Tags: Nirmal, collector Musharraf Farooqi, meeting, corona, No Mask No sale

Advertisement

Next Story

Most Viewed