స్థానిక ఎన్నికల నిర్వహణ తప్పనిసరి : నిమ్మగడ్డ

by srinivas |
స్థానిక ఎన్నికల నిర్వహణ తప్పనిసరి : నిమ్మగడ్డ
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణ తప్పనిసరి అని ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC) నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, ఒకప్పుడు 10 వేల వరకు నమోదైన కేసులు ప్రస్తుతం 750లోపే పరిమితం అయ్యాయన్నారు.ఈ నేపథ్యంలోనే వచ్చే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు నిమ్మగడ్డ తెలిపారు.కేంద్ర ఆర్థిక సంఘం నిధులు తీసుకోవాలంటే తప్పకుండా ఈ ఎన్నికలు అనివార్యమన్నారు. ఈసారి స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ విషయంపై ఏపీ ప్రభుత్వంతో ఇంకా చర్చలు జరపలేదని, మీటింగ్ అయ్యాక ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేస్తామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో జీఎచ్ఎంసీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయని గుర్తుచేశారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అనేది అమల్లో లేదని, పోలింగ్ కు నాలుగు వారాల ముందు కోడ్ అమల్లోకి వస్తుందన్నారు. కరోనా సెకండ్ వేవ్ అంశంపై ఎప్పటికప్పుడు ఆరోగ్యశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని ఎన్నికల కమిషనర్ వివరించారు. పార్టీలకు అతీతంగా ఈ ఎన్నికలు ఉంటాయన్నారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన చిక్కులు కూడా ఏమీ లేవని నిమ్మగడ్డ ప్రజానీకానికి స్ఫష్టంచేశారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ అనేది రాజ్యాంగపరమైన అంశమని నిమ్మగడ్డ తేల్చిచెప్పారు.

ఇదిలాఉండగా, గతంలో ఏపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలని భావించగా, కరోనా కేసుల దృష్ట్యా వాటిని SEC నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాయిదా వేశారు. అప్పట్లో ఈ అంశం పలు వివాదాలకు దారితీయడం.. జగన్ సర్కార్ నిమ్మగడ్డను పదవి నుంచి తొలగించేలా జీవో తేవడం.. దానిని ఏపీ హైకోర్టు కొట్టివేయడం, గవర్నర్ ఆదేశాలతో తిరిగి మరల ఆయనే ఏపీ ఎన్నికల కమిషనర్ గా నియామకం అవ్వడం నాటకీయ పరిణామంగా చోటుచేసుకుంది. నాటి నుంచి ఎన్నికల కమిషనర్ కు, జగన్ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగింది.ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలపై వైసీపీ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.

Advertisement

Next Story

Most Viewed