అనుమతి లేకుండా కట్టొద్దు.. ఏపీ సర్కార్‌కు ఎన్జీటీ హెచ్చరిక

by Anukaran |   ( Updated:2021-12-17 04:34:25.0  )
అనుమతి లేకుండా కట్టొద్దు..  ఏపీ సర్కార్‌కు ఎన్జీటీ హెచ్చరిక
X

దిశ, తెలంగాణ బ్యూరో: పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి స్పష్టమైన అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్జీటీ స్పష్టం చేసింది. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘించి ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడితే రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను అధ్యయనం చేయడానికి నలుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి ఒక రీజినల్ అధికారిని, కేంద్ర జల సంఘం తరపున మరో అధికారిని, సెంట్రల్ డిజైన్ కమిటీ తరపున ఒక సభ్యుడిని, జియాలజీ శాఖ నుంచి మరో అధికారిని ఈ కమిటీలో నియమిస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఈ కమిటీ నాలుగు నెలల్లో ఈ ప్రాజెక్టు మీద అన్ని రకాల సాంకేతిక, మెకానికల్, పర్యావరణ అంశాలపై అధ్యయనం చేసి నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని గతంలో హెచ్చరించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వ విధానానికి సంబంధించిన అంశం కాబట్టి వ్యక్తిగా ఒక అధికారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఎన్జీటీ అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed