- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మనిషి నుంచి పులికి సోకిన కరోనా
దిశ వెబ్ డెస్క్: కరోనా మహమ్మారి అగ్రరాజ్యాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు వ్యాప్తి చెందుతూ.. వేలాది మందిని బలి తీసుకుంటోంది. ఇప్పటివరకు మనుషులకే పెను ప్రమాదంగా నిలిచిన కరోనా.. ఇప్పుడు జంతువులకు సోకింది. న్యూయార్క్‌లోని బ్రాంగ్జ్ జూపార్క్ లోని ఓ పెద్దపులికి కరోనా వచ్చింది. పరీక్షల్లో పాజిటివ్‌గా నమోదయ్యింది. దీంతో.. ఇప్పటికే కరోనా విలయతాండవం చేస్తున్న అమెరికాలో భయం రెట్టింపయ్యింది. జంతువుల ద్వారా ఈ వైరస్ మరింత విస్తరించే ప్రమాదం ఉందని ‘జూ’లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అసలు పులికి కరోనా ఎలా సోకింది?
ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా మహమ్మారి బెడద.. ఇప్పుడు జంతువులనూ తాకింది. మనుషులనే కాదు జంతువులను కూడా కరోనా వదలట్లేదు. న్యూయార్క్‌లోని బ్రాంగ్జ్ జూలో మలయన్ జాతికి చెందిన నాలుగేళ్ల నదియా అనే ఆడ పులికి కరోనా వైరస్ సోకింది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నేషనల్ వెటర్నరీ లాబరేటరీస్ సర్వీసెస్ బృందం పులికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందన్న విషయాన్ని నిర్దారించింది. పులిని చూసుకునే వ్యక్తి నుంచి దానికి కరోనా వైరస్ వ్యాపించి ఉంటుందని జూ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది. అయితే.. నదియాతో పాటు మరో మూడు పులులు, మూడు ఆఫ్రికన్ సింహాలకు కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నట్లు గుర్తించినట్లు జూ సిబ్బంది చెబుతున్నారు. దీంతో.. జూ అధికారులు ఆందోళన చెందుతున్నారు. వైరస్ సోకినట్లు అనుమానిస్తున్న పులులు, సింహాలు ఆహారం తీసుకోవడం బాగా తగ్గించాయని జూలో పనిచేసే సిబ్బంది తెలిపారు.
జూలో బోన్లలో, అవి తిరిగే ఎన్‌క్లోజర్‌లో మాత్రమే ఉండే జంతువులకు కరోనా ఎలా సోకిందనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జంతువుల్లో వైరస్ ఎలా వృద్ది చెందుతుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఒక మనిషి నుంచి కోవిడ్-19 వైరస్ జంతువుకు సోకడం ఇదే తొలిసారి అని అక్కడి జంతువులను తరుచుగా పరీక్షించే వైద్యుడు తెలిపారు. వైరస్ బారిన పడిన పులులను జూలోని టైగర్ మౌంటెయిన్ ఎగ్జిబిట్‌లో ఉంచినట్లు జూ అధికారులు ప్రకటించారు. మార్చి 16వ తేదీ నుంచి బ్రోంక్స్ జూకు సందర్శకులను అనుమతించడం లేదు.
వాటికి కూడా పరీక్షలు:
నదియాతో పాటు మరో మలయాన్ పులి, రెండు సైబీరియన్ పులులు, ఇంకో మూడు ఆఫ్రికన్ సింహాలకు కూడా ఇవే లక్షణాలు కనిపిస్తున్నాయని.. అయితే.. వాటికి ఇంకా పరీక్షలు నిర్వహించలేదని తెలిపారు. అయితే.. ఈ ఏడింటిని ప్రస్తుతం జూలోని వెటర్నరీ వైద్యవిభాగం పర్యవేక్షిస్తోంది. అంతేకాదు జూ లోని జంతువులన్నింటికీ కూడా పరీక్షలు చేస్తామని జూ అధికారులు తెలిపారు.
ఏ పెంపుడు జంతువుకు రాలేదు:
జంతువుల నుంచి మనుషులకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని జూ నిర్వహకులు పేర్కొన్నారు. అమెరికాలోనూ ఎక్కడా పెంపుడు జంతువులతో వైరస్ వ్యాపించిందనే కేసులు నమోదు కాలేదని స్పష్టం చేశారు. అక్కడా ఈ పులి దే తొలి కేసు. అయితే .. న్యూయార్క్ లో కాదు గానీ బెల్జియంలో ఓ పెంపుడు పిల్లి వైరస్ బారిన పడిందని సమాచారం. అలాగే హాంకాంగ్ లోనూ రెండు శునకాలకు కరోనా వచ్చింది. ఈ రెండు సందర్భాల్లోనూ మనుషుల నుంచే జంతువులకు కరోనా వచ్చింది. జంతువులు కూడా కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది కానీ, వాటి నుంచి మానవులకు వైరస్ సోకడం చాలా అరుదు అని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిపుణులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెంపుడు జంతువులు గానీ, బందీలుగా ఉన్న అడవి జంతువుల నుంచి గానీ కరోనా వైరస్ మనుషులకు వ్యాపిస్తుందని ఇప్పటివరకైతే ఆధారాలు లేవని చెబుతున్నారు. ప్రజలు ఎవరైనా కరోనాతో బాధపడుతుంటే పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఇప్పటిదాకా మనుషుల ద్వారా వ్యాపిస్తున్న కరోనా వైరస్.. ఇక జంతువుల ద్వారా కూడా విస్తరిస్తే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని అమెరికా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Tags: coronavirus, covid-19, positive, tiger, test, zoo, america, new york