శునకంతో మైత్రి బంధం.. ఏనాటిదో!

by Shyam |
శునకంతో మైత్రి బంధం.. ఏనాటిదో!
X

దిశ, వెబ్‌డెస్క్ :
జంతువులతో మనిషికున్న అనుబంధం ఈ నాటిది కాదు, ఆదిమ కాలం నుంచే ఉంది. అయితే, కాలక్రమేణా మెల్లమెల్లగా జ్ఞానాన్ని సంపాదించిన మానవుడు.. అడవులను వదిలి నవీన నాగరికతలోకి అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే మనుషులకు, జంతువులకు మధ్య గ్యాప్ పెరిగింది. అయినా ఇప్పటికీ కొన్ని జంతువులను తమకు తోడుగా పెంచుకుంటున్న విషయం తెలిసిందే. అలా ప్రాణప్రదంగా పెంచుకుంటున్న జంతువుల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శునకాల గురించే. ఎందుకంటే ‘డాగ్ ఈజ్ మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్’ అనేది నానుడి వినే ఉంటారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ, యూకేకు చెందిన కొందరు శాస్త్రవేత్తల పరిశోధనలు మాత్రం.. నిజంగా మనిషికి ఓల్డెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ కుక్కనే అని తేల్చేశాయి. ‘జంతు ప్రపంచంలో మనిషికి అత్యంత ఆప్త మిత్రులైన శునకాలే.. అత్యంత పురాతన మిత్రులు కూడా’ అని శునకాలపై జరిపిన ఓ డీఎన్ఏ అధ్యయనం చెప్తోంది.

సాధారణంగా ఎవరైనా నమ్మక ద్రోహం చేసినా లేదా వెన్నంటే ఉండి మనకు కీడు చేసినా.. ‘కుక్కకు ఉన్న విశ్వాసం కూడా నీకు లేదు’ అని తిడుతుంటారు. ఈ మాటల్లోనే ‘కుక్క’ స్వభావమేంటో స్పష్టంగా తెలిసిపోతుంది. జానెడు పొట్టకు పిడికెడు అన్నం పెడితే చాలు.. శునకాలు జీవితాంతం ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకుంటాయి. అనుక్షణం వెన్నంటే నిలిచి, చచ్చే వరకు తోడుంటాయి. ఆపదను పసిగట్టి హెచ్చరిస్తాయి. తమ యజమాని కనిపించకపోతే తల్లడిల్లిపోతాయి. రెండు, మూడు రోజులు ఎటైనా వెళ్లి ఇంటికి తిరిగొస్తే.. కన్న కొడుకులా మన వద్దకు పరుగెత్తుకొచ్చి హత్తుకుంటాయి. కన్నీళ్లు పెడుతుంటాయి. ఒళ్లంతా తడిమి తమ ప్రేమను తెలియజేస్తాయి. అందుకే మనుషులకు, కుక్కలకు మధ్య అనుబంధం అన్ని జంతువుల కన్నా చాలా భిన్నమైంది. అయితే, శునకాలను పెంచుకోవడం అనేది కొత్తగా పుట్టుకొచ్చిన సంస్కృతేం కాదు. మంచుయుగం అంతమైనప్పటి నుంచి.. అంటే గత 11,000 సంవత్సరాల నుంచి ఉందని యూనివర్సిటీ ఆక్స్‌ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలకు చెందిన శాస్త్రవేత్తల బృందంతో పాటు 10 దేశాలకు చెందిన ఆర్కియాలాజిస్ట్‌లు చేసిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీనిని బట్టి మనిషి మరే ఇతర జంతువులను పెంచుకోకముందు నుంచే కుక్కలను పెంచుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

‘మనిషి జంతువులను వేటాడి చంపి తిన్న ఆదిమ యుగం నుంచి ఒక మాంసాహార జంతువును పెంపుడు జంతువుగా చేసుకోవడం కొంత విలక్షణంగానే ఉంటుంది. అయితే, అలాంటి జంతువులను మనుషులు ఎందుకు పెంచుకోవడం మొదలుపెట్టారనే ఆసక్తికరమైన విషయం గురించి తమ బృందం పరిశీలించింది’ అని లండన్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏన్షియెంట్ జెనోమిక్స్ లాబొరేటరీ బృంద నాయకుడు డాక్టర్ పోన్టస్ స్కోగ్లండ్ చెప్పారు. మానవులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లినప్పుడు తమతో పాటుగా పెంపుడు జంతువులను తీసుకెళ్లడాన్ని పరిశీలిస్తే.. కొంత వరకు కుక్కల జన్యు తీరు కూడా మనుషులను పోలి ఉంటుందని ఆ బృందం వివరించింది. ఉదాహరణకు యూరోపియన్ జాతికి చెందిన కుక్కలు.. మొదట్లో తూర్పు జాతి, సైబీరియా జాతి లక్షణాలు కలిగి, కొంత విభిన్నంగా ఉండేవి. కానీ, కాంస్య యుగం వచ్చేసరికి ఒకే ఒక్క జాతికి చెందిన కుక్కలు ప్రపంచమంతా విస్తరించి మిగిలిన జాతులన్నిటి స్థానాన్ని ఆక్రమించేశాయి.

4 – 5 వేల సంవత్సరాల క్రితం యూరోప్‌లో కుక్కలు రకరకాల రూపాలు, ఆకారాల్లో ఉన్నప్పటికీ జన్యుపరంగా వాటి మూలాలు మాత్రం పరిమితమైన జాతుల నుంచే వచ్చాయి. 27 రకాల పురాతనమైన శునక జాతులకు సంబంధించిన వివిధ రకాల పురాతత్వ అవశేషాల నుంచి సేకరించిన జన్యువులను, ఆధునిక శునకాల జన్యువులతో పోల్చి చూడటంతో ఈ విషయాలు వెలుగు చూశాయి. ‘కుక్కలు తోడేళ్ళ జాతి నుంచి పుట్టి, క్రమంగా ఆహారం కోసం వెతుక్కుంటూ మనుషుల్లోకి వచ్చి చేరి ఉండవచ్చు. మనుషులు వాటిని పెంచడం మొదలుపెట్టడంతో.. వారు వేటకు వెళ్ళేటప్పుడు లేదా కాపలాగా ఉంటూ మనిషితో పాటు సావాసం మొదలై ఉండవచ్చని శాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడింది. అయితే, తోడేళ్లు మాత్రం చాలా భయంకరమైనవి. అవి మనుషులను భయపెట్టేవి. చాలా వరకు శునకాలన్నీ అంతమైపోయిన తోడేలు జాతి నుంచే పుట్టి ఉంటాయని ఈ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. ప్రపంచంలో తరువాత పుట్టిన జాతుల డీఎన్ఏలో అంతగా వీటి వారసత్వం ఉండకపోవచ్చు.

కుక్కలను పెంచుకోవడం ఎక్కడ మొదలయింది అనే విషయం పై మాత్రం స్పష్టత లేదు. మరింత లోతైన పరిశోధనలు అవసరమవుతాయని పరిశోధకులు వెల్లడించారు.

Advertisement

Next Story