మెట్రో.. పక్కా హైదరాబాదీ

by Shyam |
మెట్రో.. పక్కా హైదరాబాదీ
X

దిశ, హైదరాబాద్: హైదరాబాద్ భాషా, సంస్కృతి, ఆచార వ్యవహారాలను నగరానికి కొత్తగా వచ్చే వారందరికీ తెలియజేసేలా “పక్కా హైదరాబాదీ” కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నట్టు హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరక్టర్ ఎన్‌వీఎస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నగరంలో వున్న అనేక దర్శనీయ స్థలాలు, పర్యాటక ఆకర్షణలు, పలు రంగాలలో విశిష్ఠ సేవలందించిన ప్రముఖుల తైలవర్ణ చిత్రాల ప్రదర్శనను మెట్రో స్టేషన్ పరిసరాలలో చేపట్టాలని ప్రతిపాదించినట్లు ఎన్.వి.యస్. రెడ్డి తెలిపారు.జంట నగరాలలో స్థానిక ప్రజల వాడుక భాషలో అధికంగా వినియోగించే “కైకూ, నక్కో, హౌలే, ఐసాయిచ్, ఖైరియత్, పోరి, పరేషాన్” వంటి పదాల వినియోగం, వాటి అర్థాలను సందర్భాలను ఆసక్తి గల వారందరికీ తెలియజేసేలా మెట్రో స్టేషన్ గోడలపై రాయించాలని ప్రతిపాదించారు.
అనేక వారసత్వ కట్టడాలతో, 400ఏండ్లు పైబడిన గొప్ప చరిత్ర గల హైదరాబాద్ నగర సాంస్కృతిక కళా వైభవాన్ని పలువురికి తెలియజెయ్యాలనే ఉద్దేశ్యంతో హెచ్‌ఎంఆర్ఎల్ సంస్థ పలు చర్యలు తీసుకుంటోందని, ఈ విషయమై నగర పౌరుల్లో ఆసక్తిగల వారు తమ సలహాలను, సూచనలను “ప్రధాన పౌరసంబంధాల అధికారి, హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ”కు ఈ-మెయిల్ ద్వారా [email protected] తెలియజేయాలని ప్రకటనలో కోరారు.

Advertisement

Next Story