దక్షిణాఫ్రికా పర్యటన నీలినీడలు.. ఎటూ తేల్చని BCCI

by Shyam |
దక్షిణాఫ్రికా పర్యటన నీలినీడలు.. ఎటూ తేల్చని BCCI
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా ప్రస్తుతం న్యూజీలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే దక్షిణాఫ్రికాలో సుదీర్ఘ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నది. డిసెంబర్ 17 నుంచి జనవరి 26 వరకు అక్కడ మూడు టెస్టులు, మూడు వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడవలసి ఉన్నది. ఇందుకోసం భారత జట్టు ఈ నెల 8న దక్షిణాఫ్రికాకు బయలుదేరాలి. అయితే, ప్రస్తుతం ఈ పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి. సౌత్ ఆఫ్రికాలో కరోనా కేసులు విజృంభిస్తుండటమే కాకుండా.. కొత్త వేరియంట్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది. టీమ్ ఇండియా మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్న జొహెన్నెస్‌బర్గ్, సెంచూరియన్ సమీపంలో ఉన్న ప్రిటోరియా నగరంలోనే కరోనా తీవ్రంగా ఉన్నది.

దీంతో బీసీసీఐ క్రికెటర్ల రక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ప్రస్తుతం ఈ విషయంలో క్రికెట్ సౌతాఫ్రికా చర్చలు జరపిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నది. అక్కడ మ్యాచ్‌ల నిర్వహణపై పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే టీమ్ ఇండియా పర్యటనపై నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ముంబై నుంచి ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో జొహెన్నస్‌బర్గ్ చేరుకొని అక్కడ నాలుగు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. అక్కడకు వెళ్లక ముందే సిరీస్‌పై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు ప్రస్తుతం ఇండియా-ఏ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నది. భారత ఆటగాళ్ల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని బీసీసీఐ సూచించినట్లు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed