స్ట్రెయిన్‌గా మారిన కరోనా..లాక్‌డౌన్ తప్పదా..!

by Anukaran |
స్ట్రెయిన్‌గా మారిన కరోనా..లాక్‌డౌన్ తప్పదా..!
X

న్యూఢిల్లీ: నూతన సంవత్సరంలో కరోనా కలవరానికి టీకాతో చెక్ పెడదామన్న ఆశలను యూకేలోని కొత్త స్ట్రెయిన్ ఒక్కసారిగా చెదరగొట్టింది. కరోనా కొత్త రూపాంతరం వీయూఐ-202012/01 స్ట్రెయిన్ 70 శాతం వేగంతో పయనిస్తోందని, దేశంలో పరిస్థితులు చేజారిపోతున్నాయని బ్రిటన్ మంత్రి మ్యాట్ హాంకాక్ వెల్లడించడం యావత్ ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టేసింది. ఈ క్రమంలోనే బ్రిటన్ ప్రభుత్వం క్రిస్మస్ సంబరాలపై ఆంక్షలు విధించింది. లండన్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో కఠిన లాక్‌డౌన్ ప్రకటించింది. వైరస్ కొత్త మార్గాలలో దాడి చేస్తే, అందుకు అనుగుణంగా రక్షణ చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ అధికారులను ఆదేశించారు. కొత్త రకం వైరస్ తొలిసారిగా ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో సెప్టెంబర్‌లోనే రిపోర్ట్ అయినట్టు తెలిసింది. అక్కడ స్ట్రెయిన్ కేసులే అధికంగా కనిపించాయి. డిసెంబర్ 18న తొలిసారిగా స్ట్రెయిన్‌ను గుర్తించిన అధికారులు దాని తీవ్రతను ప్రభుత్వానికి తెలియజేశారు. అదే రోజున ఇంగ్లాండ్ దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించింది. ఈ కొత్త రకం వైరస్‌ తమ వరకు రాకుండా భారత్ సహా అనేక దేశాలు బ్రిటన్ నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తున్నాయి.

దక్షిణాఫ్రికాలోనూ ఇదే?

యూకేలో వెలుగుచూసిన కొత్త వైరస్ వేరియంట్‌ను పోలి ఉన్న స్ట్రెయిన్ దక్షిణాఫ్రికాలోనూ కనిపించిందని సైంటిస్టులు తెలిపారు. రూపాంతరం చెందిన వైరస్ వేగంగా వ్యాప్తి చెందడం దేశంలో సెకండ్ వేవ్‌కు కారణమైందని తెలిపారు. ప్రతిపది కేసులలో తొమ్మిది కొత్త స్ట్రెయిన్‌ కేసులే ఉంటున్నాయని దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి వేలీ కీజ్ తెలిపారు.

మ్యూటేషన్ సర్వసాధారణం

యూకేలో కొత్త స్ట్రెయిన్‌పై కలవరం మొదలైన తరుణంలో శాస్త్రజ్ఞులు మ్యూటేషన్‌పై భయాందోళనలు తొలగించే పనిలో పడ్డారు. వైరస్ అన్నాక కచ్చితంగా రూపాంతరం చెందుతుందని, మ్యూటేషన్ చెందడం దాని లక్షణమని వివరించారు. ఫ్లూ కూడా అనేకసార్లు మ్యుటేషన్ చెందిందని పేర్కొన్నారు. కరోనా వైరస్ కూడా చాలాసార్లు మ్యూటేషన్ చెందిందని, ఇకపైనా చెందుతుందని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన వైరాలజిస్ట్ డాక్టర్ రవిగుప్తా వివరించారు. వుహాన్‌లో వ్యాప్తి చెందిన వైరస్‌ను ఇప్పటి వైరస్‌తో పోలిస్తే అది 25 సార్లు రూపాంతరం చెందినట్టు మరో శాస్త్రజ్ఞుడు బీబీసీకి తెలిపారు. అంటే నెలకు రెండుసార్లు రూపాంతరం చెందినట్టు తెలుస్తుందని పేర్కొన్నారు. దాని రూపాంతరాలు చాలాసార్లు కనీసం వెలుగులోకి కూడా రాలేదని అన్నారు.

వ్యాప్తికి అనుగుణంగా మార్పు

తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్‌లోని రెండు స్ట్రెయిన్‌లపై శాస్త్రజ్ఞులు ప్రధానంగా మాట్లాడుతున్నారు. హెచ్69/వీ70 రహిత, డీ614జీ రహిత స్పైక్ ప్రోటీన్ (వైరస్ కణాలు వేగంగా వ్యాపించడానికి దోహదపడే భాగం) వైరస్‌లు చర్చనీయాంశమయ్యాయి. వైరస్‌లోని స్పైక్ ప్రోటీన్‌లు మానవ కణాలపై దాడి చేస్తాయి. తద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది. వైరస్ దాడులను మనిషిలోని ఇమ్యూన్ సిస్టమ్ తిప్పికొడతాయి. హ్యూమన్ ఇమ్యూన్ సిస్టమ్‌పై సరికొత్త రూపంలో దాడి చేయడానికి, లేదా సులువుగా దాడి చేయడానికి అనుగుణంగా వైరస్ తనను తాను మార్చుకుంటుంది. ఇందులో భాగంగానే కరోనా వైరస్‌‌లోని స్పైక్ ప్రోటీన్ మార్పు చెందుతూ వస్తున్నది.

తూర్పు చైనాలో జనవరిలో కరోనా వైరస్ డీ614జీని కోల్పోయి రూపాంతరం చెందింది. అదే స్ట్రెయిన్ న్యూయార్క్, యూరప్‌లకు విస్తరించింది. అనంతరం కొన్ని నెలల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా ఇదే స్ట్రెయిన్ కనిపించింది. వుహాన్‌లో వ్యాప్తి చెందిన వైరస్‌ స్థానంలో ఈ కొత్త స్ట్రెయిన్ వచ్చి చేరింది. హెచ్69/వీ70 రహిత వైరస్ మనిషి నుంచి జంతువుకు, జంతువు నుంచి మనిషికి మారేలా మార్చుకుంది. వైరస్ రూపాంతరం చెందినంత మాత్రాన దాని తీవ్రత పెరగాలని లేదు. వాస్తవానికి కేసులు పెరిగినా మరణాలు తగ్గుతుండటం గమనార్హం. యూకేలోని కొత్త స్ట్రెయిన్‌తో కేసులు పెరుగుతున్నాయి. కానీ, మరణాలు స్వల్పంగానే ఉన్నాయి. డీ614జీ రహిత వైరస్‌తోనూ ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కానీ, దాని తీవ్రత పెరగలేదు.

టీకాల ప్రభావం తగ్గదు

రూపాంతరం చెందిన వైరస్‌లు టీకా ప్రభావం నుంచి తప్పించుకున్న దాఖలాలు దాదాపు శూన్యం. ఇన్‌ఫ్లూయేంజా వైరస్‌లతో పోలిస్తే కరోనా వైరస్ చాలా నెమ్మదిగా మ్యూటేషన్ చెందుతుందని, కాబట్టి కరోనా టీకా ప్రభావంపై అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. రూపాంతరం చెందిన కరోనా వైరస్‌నూ టీకాలు నిలువరించగలవని యూఎస్‌కు చెందిన చీఫ్ సైన్స్ అడ్వైజర్ డాక్టర్ మాన్సెఫ్ స్లోయ్ తెలిపారు. ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన టీకాలు రూపాంతరం చెందిన వైరస్‌ను నిలువరించవని భావించడం సరికాదని అమెరికా మాజీ సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి వివరించారు.

Advertisement

Next Story

Most Viewed