1.30 లక్షల మార్క్ దాటిన కొత్త కేసులు

by Anukaran |   ( Updated:2021-04-08 23:18:27.0  )
1.30 లక్షల మార్క్ దాటిన కొత్త కేసులు
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్నది. వరుసగా లక్ష కేసులకుపైగా నమోదవుతూ కలకలం రేపుతున్నది. తొలిసారిగా లక్ష మార్క్ దాటిన ఈ నెలలో అంతకంతకూ పెరుగుతూ తాజాగా 1.31లక్షలను తాకింది. గడిచిన 24 గంటల్లో మనదేశంలో కొత్తగా 1,31,968 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,30,60,542కు పెరిగింది. క్రితం రోజు కొత్త కేసులు 1.26లక్షలు నమోదైన సంగతి తెలిసిందే. మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలోనే 780 మంది కరోనా బారిన పడి మరణించారని కేంద్రం తెలిపింది. ఇప్పటికి మొత్తం కరోనా మరణాలు 1,67,642కు చేరాయి.

పది లక్షల దిశగా యాక్టివ్‌లు

యాక్టివ్ కేసులూ భారీగా పెరుగుతున్నాయి. తాజాగా దేశంలో 9,79,608 యాక్టివ్ కేసులున్నాయి. ఈ కేసులూ ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరువవుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ 18న యాక్టివ్ కేసులు గరిష్టంగా 10.17 లక్షల కేసులుగా నమోదైన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్‌లో అత్యంత స్వల్ప సమయంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా నిబంధనలు పాటించడంలో అలసత్వం ఒకవైపు కొత్త వేరియంట్ల మరోవైపు జతకావడంతో కేసులు అదుపులేకుండా పెరుగుతూనే వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యాక్టివ్ కేసులు మరిన్ని కొత్త కేసులకు వేగంగా దారినివ్వవచ్చనే ఆందోళనలు ఏర్పడుతున్నాయి.

Advertisement

Next Story