‘నర్సు’ డ్యాన్స్ చేస్తే తప్పా..? మంత్రి కేటీఆర్‌ని టార్గెట్ చేసిన నెటిజన్స్

by Anukaran |   ( Updated:2021-08-22 10:58:50.0  )
bamma
X

దిశ, వెబ్‌డెస్క్ : స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆస్పత్రి కారిడార్‌లో ‘బుల్లెట్టు బండి’ సాంగ్ కు డ్యాన్స్ చేసిన ‘నర్సు’కు జిల్లా వైద్యాధికారి మెమో జారీచేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఒక మినీ యుద్ధమే జరుగుతోంది. లక్షలాది మంది నెటిజన్స్ బాధిత నర్సుకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఆగస్టు 15వ తేదీ హాలిడే. ఆ రోజున ఉదయం జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం సిరిసిల్లా జిల్లా తంగెళ్ల పల్లి పీహెచ్సీ సెంటర్‌లో నర్సు రజనీ బుల్లెట్ బండి సాంగ్‌కు డ్యాన్స్ చేయగా అందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని స్థానిక బీజేపీ నాయకులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. వారు చర్యలకు ఆదేశించడమే కాకుండా ఆ నర్సుకు మెమో జారీ అయ్యింది. అయితే, ప్రస్తుతం అధికారులు జారీచేసిన మెమోను వెనక్కి తీసుకోవాలని చాలా మంది సోషల్ మీడియా వేదికగా జిల్లా వైద్యాధికారులను కోరుతున్నారు. విశ్రాంతి సమయంలో డ్యాన్స్ చేసినందుకు చర్యలెందుకంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. మెమోలు వెనక్కి తీసుకోవాలని ఓ వైపు ఏబీవీపీ నేతలు డిమాండ్ చేస్తుండగా.. నర్సు రజనీపై చర్యలు తీసుకోవద్దంటూ స్థానికులు సైతం ఆమెకు మద్దతిస్తున్నారు. కొందరు నెటిజన్స్ మాత్రం ఏకంగా మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో విజ్ఞప్తులు చేస్తున్నారు. నర్సు రజనీకి అనుహ్యంగా మద్దతు లభిస్తుండటంతో ఏం చేయాలో తెలియక జిల్లా యంత్రాంగం పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. డ్యాన్స్ వేసిన రోజు సెలవు దినం కావడంతో ఆమె సేఫ్ జోన్‌లో ఉన్నట్టు కొందరు అధికారులు భావిస్తున్నారు. దీంతో బుల్లెట్ బండి సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులు వేసి ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్న నర్సు రజనీపై చర్యలు తీసుకునేందుకు జిల్లా వైద్యాధికారులు వెనక్కి తగ్గినట్టు సమాచారం.

https://youtu.be/IDQgocNl2Z8

బామ్మ ఫైర్..

ఇండిపెండెన్స్ రోజున విశ్రాంతి సమయంలో డ్యాన్స్ చేస్తే తప్పా..? ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది. కోట్ల స్కామ్ చేసిన వాళ్లనే వదిలేశారు. అలాంటిది డ్యాన్స్ చేస్తే మెమోలు ఇస్తారా..? డ్యూటీలో మందుతాగి తిరిగే వాళ్లను ఏం చేయలేదు. ప్రజారోగ్య డైరెక్టర్ తప్పు చేసినట్టు తన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నా.. సీఎం, మంత్రులు, కలెక్టర్లు ఎవరూ ఏం చేయలేదు. అతన్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారు. అలాంటిది డ్యాన్స్ చేస్తే మెమో ఇస్తారా.. రిలాక్సేషన్ కోసమే ఆ అమ్మాయి డ్యాన్స్ చేసిందని.. ఆమెపై చర్యలు తీసుకోవడం నిలిపివేయాలని అని వీడియోలో బామ్మ ఫైర్ అయ్యారు.

Advertisement

Next Story