నాలుగేళ్లుగా పెండింగ్.. బొందల గడ్డలకు పైసల్లేవ్!

by Shyam |
cemeteries, ghmc
X

దిశ, సిటీ బ్యూరో: మహానగరవాసులకు పుట్టగానే బర్త్‌ సర్టిఫికేట్‌, బతికున్నంత కాలం అవసరమైన, అత్యవసరమైన సేవలందించాల్సిన బల్దియా.. కాలంచేసిన తర్వాత ఖననం చేసేందుకు ఆరడుగుల స్థలాన్ని సమకూర్చలేని పరిస్థితికి దిగజారింది. నగరంలోని 6 జోన్లలో కొత్తగా ఏర్పాటు చేయాలని మొదలు పెట్టిన 7 కొత్త బొందలగడ్డలను(మోడల్ గ్రేవియార్డ్‌లు) పూర్తి చేయకపోవడమే కాక, కనీస వసతులు కూడా కల్పించడంలేదు. ఆధునిక అభివృద్ధి పేరిట అక్రమంగా నిధులు మళ్లించడం, అవకతవకలకు పాల్పడటమే తప్పా, ప్రజలకు కనీస వసతులను కల్పించే ముందుచూపు జీహెచ్ఎంసీ అధికారుల్లో లేదన్న విషయం తేలిపోయింది. ఏడు సర్కిళ్ల నుంచి 30 సర్కిళ్లకు, 72 కిలోమీటర్ల విస్తీర్ణం నుంచి 625 చదరపు అడుగుల విస్తీర్థానికి గ్రేటర్‌గా విస్తరించిన నగరంలో వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణీకరణకు తగినట్టుగా శ్మశానవాటికలు పెరగకపోవడం, పైగా ఉన్నవి కూడా అన్యాక్రాంతమవుతున్నట్లు స్వరాష్ట్రం సిద్ధించకముందే సమైఖ్య పాలకులు గుర్తించారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి YS రాజశేఖర్‌రెడ్డి హయాంలో గ్రేటర్‌లో అదనంగా మరో 20 శ్మశానవాటికలను ఏర్పాటు చేయాలని, ఇందుకు స్థలాలను గుర్తించాలని ఆదేశించారు. స్థలాలు అందుబాటులో లేవంటూ అధికారులు పదేపదే తప్పించుకునే ప్రయత్నంచేయగా, ఈ విషయాన్ని వైఎస్ సీరియస్‌గా తీసుకుని గట్టిగా మందలించే సరికి ఎట్టకేలకు ఏడు కొత్త బొందలగడ్డలను ఏర్పాటు చేసేందుకు స్థలాను గుర్తించి, వదిలేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి, గుర్తించిన ఏడు స్థలాల్లో కొత్తగా శ్మశానవాటికలను ఏర్పాటు చేయాలని ఆదేశించడంతో రూ.18.63 లక్షల వ్యయంతో పనులను ప్రారంభించగా, వీటిలో ఇప్పటి వరకు కేవలం రూ.కోటి 75లక్షల 80 వేల విలువైన పనులను మాత్రమే పూర్తి చేయగా, మరో రూ. 15.12 కోట్ల విలువైన పనులు వివిధ దశల్లో కొనసాగుతుండగా, రూ.కోటి 75లక్షల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. వీటిని పూర్తి చేసేందుకు నిధులు లేవని అధికారులు చేతులెత్తేస్తున్నారు.

పరిరక్షణ దేవుడెరుగు.. అడ్డంగా మింగేస్తున్నారు

మహానగరంలో జనాభాకు తగిన సంఖ్యలో బొందలగడ్డలు లేవన్న విషయాన్ని దశాబ్దాల క్రితమే ప్రభుత్వం గుర్తించి కొత్తగా శ్మశానవాటికలను ఏర్పాటు చేయాలని పలు‌సార్లు ఆదేశాలు జారీ చేయగా, వాటి అమలు మాట దేవుడెరుగు ఉన్న శ్మశానలను సైతం అన్యాక్రాంతమ్యేందుకు కారకులవుతున్నారు. ఆసీఫ్‌నగర్ మండలం పరిధిలోని హుమాయున్‌నగర్‌లోని దేవుడి కుంట శ్మశానవాటికలో ఓ నాయకుడు మూడు ఎకరాలను కబ్జా చేసిన విషయం బయటపడటంతో స్థానిక ఎమ్మార్వోను సస్పెన్షన్ చేశారే తప్పా, తిరిగి స్థలాన్ని స్వాధీనం చేసుకోకపోవడం అధికారుల ప్రమేయం ఉందనే వాదనకు బలాన్ని చేకూర్చుతుంది. ప్రస్తుతం స్టీల్ బ్రిడ్జి ఏర్పాటు పేరిట పంజాగుట్ట స్మశానవాటిక‌లో సమాధులను ధ్వంసం చేసి, ఆ స్థలాన్ని బల్దియా అక్రమంగా కబ్జా చేస్తున్నా, కనీసం ప్రశ్నించే నాథుడే కరవయ్యాడు. ఓ బడా వ్యాపారి ఈ కూడలిలో నిర్మించిన షాపింగ్‌మాల్‌కు మరింత ఆకర్షణీయమైన లుక్ తెచ్చేందుకు ప్రజల సెంటిమెంట్‌కు నిదర్శనమైన సమాధులను నేలమట్టం చేసి, వాటిపై స్టీల్ బ్రిడ్జికి పునాధులు వేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed