ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం

by Shyam |
mission kakathiya
X

దిశ, జవహర్ నగర్: వర్షాలు సమృద్ధిగా కురవాలంటే పర్యావరణ పరిరక్షణ, కురిసిన వర్షపు నీటిని నిలువ చేసుకోవడానికి చెరువుల సంరక్షణ ఒక్కటే పరిష్కారమని గుర్తించిన ప్రభుత్వం హరితహారం, మిషన్ కాకతీయ చేపట్టింది. దీని కోసం కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు. అయితే నాటిన మొక్కలను పర్యవేక్షణ చేయకపోవడం, చెరువులను సంరక్షించడంలో అధికారుల, పాలకుల నిర్లక్ష్యాని బట్టబయలు చేస్తోంది. అంతేకాకుండా చెరువు పరిసర ప్రాంతాల్లో పాదచారులు, ద్విచక్ర వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. అధికారులు గట్టి చర్యలు తీసుకుని హరితహారం, మిషన్ కాకతీయ సక్రమంగా అమలు జరిగేలా చూడాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

మిషన్…! కాకతీయ..?

కార్పొరేషన్ కార్యాలయానికి కూతవేటు దూరంలో చెన్నాపురం చెరువు ఉంది. 2016 మే నెలలో మిషన్ కాకతీయ రెండో విడతలో భాగంగా చెరువు పునరుద్ధరణ, పూడికతీత పనులను గత మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి హయాంలో చేపట్టారు. మిషన్ కాకతీయలో భాగంగా చెన్నాపురం చెరువును మినీ ట్యాంక్ బండ్‌‌‌‌‌‌‌‌గా సుందరీకరణ చేస్తూ, చెరువు శిఖం భూములను కాపాడేందుకు గాను సుమారు రూ.2 కోట్ల ప్రతిపాదనలు చేసినా కార్యరూపం దాల్చలేదు.పైగా ఇప్పటికీ పాలకులు మాయమాటలతో కాలం గడుపుతున్న విషయం తెలిసిందే. చెరువు అలుగు పారిన నీరు ప్రవహించేందుకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది. వేగంగా ప్రవహించే నీళ్లతో సబ్ స్టేషన్ ప్రహరీ పునాదులను కదిపే ప్రమాదం పొంచి ఉంది. ఇలాగే కొనసాగితే ప్రహరీ గోడలు కుప్పకూలి సబ్ స్టేషన్ విద్యుత్ ట్రాన్స్మిట్ నేలకొరిగి పెను ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది.

ఈత మొక్కల పరిరక్షణ ఏది..?

2016 హరితహారంలో భాగంగా కట్ట పొడవునా ఈత చెట్లను భారీగా నాటారు. కానీ 2016 నుండి ఇప్పటి వరకు అధికారులు పాలకులు కన్నెత్తి చూడలేదు. చెరువు కట్టపై కనీస పరిరక్షణ లేకపోవడంతో ఈత మొక్కలు ఏపుగా పెరిగేందుకు ఆస్కారం ఉన్నా పిచ్చి మొక్కలతో పొదలుగా మారాయి. ఈత మొక్కల చుట్టూ అలుముకున్న పిచ్చిమొక్కలు తొలగించి మొక్కలను పరిరక్షించే బాధ్యత పై అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

భద్రత – రక్షణ చర్యలు కరువు..?

బాలాజీ నగర్ నుండి చెన్నాపురం చెరువు కట్ట మీదుగా వికలాంగుల రోడ్డు వైపు నిత్యం పాదచారులు, ద్విచక్ర వాహనదారులు వెళ్తుంటారు. కట్టమీద బీటలు పారిన మట్టి పొరలు, చెట్ల పొదలు అలుముకోవడంతో వాటి నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు, పాదచారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కనీస మరమ్మతులకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

చెరువు శిఖం భూములు హద్దులు ఏర్పాటు చేసి, చెరువులో చెత్తాచెదారం లేకుండా చూడాల్సిన కనీస బాధ్యతను అధికారులు గుర్తించాలని, శిఖం భూముల హద్దుల్లో కంచె ఏర్పాటు చేయకపోవడంతో ఎంతో మంది క్షణికావేశంతో ప్రాణాలు విడిచారని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెరువులో వ్యర్థ పదార్థాలు వేయడంతో కంపుతో పాటు చెరువు నీరు కలుషితం అవ్తుందని దుయ్యబట్టారు. చెరువు శిఖం భూములు సైతం అన్యాక్రాంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

మిషన్ కాకతీయ, హరితహారం కార్యక్రమాలు విషయంలో… ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన.. అధికారులు, ప్రజాప్రతినిధులు వాటి సంరక్షణపై శీతకన్ను వేయడం సరికాదని తప్పుబడుతున్నారు. వెంటనే తగు చర్యలు తీసుకుని చెరువును, మొక్కలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story