Yamuna: ప్రభుత్వ మార్పుతో యమునా నది శుభ్రం ఖాయం.. సుప్రీంకోర్టు ఆశాభావం

by vinod kumar |
Yamuna: ప్రభుత్వ మార్పుతో యమునా నది శుభ్రం ఖాయం.. సుప్రీంకోర్టు ఆశాభావం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీలోని యమునా నదిపై సుప్రీంకోర్టు (Supreme court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీలో ప్రభుత్వం మారింది కాబట్టి యమునా నది (Yamuna River) చుట్టూ ఉన్న వివాదాలన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. నదిలోని కాలుష్య కారకాలను తొలగించడం, పొరుగున ఉన్న హర్యానాకు నీటి సదుపాయం కల్పించడం వంటివి ఉండొచ్చని వ్యాఖ్యానించింది. ఢిల్లీలో యమునా నీరు విషపూరిత స్థాయికి చేరుకోవడంతో 2021 జనవరి 13న ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు అప్పటి నుంచి విచారిస్తూనే ఉంది. సమయానుగుణంగా పలుమార్లు ఉత్వర్వులు సైతం జారీ చేసింది. తాజాగా యమునా నదితో సహా ఇతర నదుల కాలుష్యానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ప్రభుత్వం మారడంతో అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని ఆశిస్తున్నట్టు జస్టిస్ బీఆర్ గవాయ్ (Br gaway) తెలిపారు. యమునా నది మాత్రమే గాక ఇతర నదుల పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. పరిశుభ్రమైన నీరు ప్రజల ప్రాథమిక హక్కులలో భాగమని పేర్కొన్నారు. కాగా, యమునా నది వాటా, కాలుష్యం విషయంలో ఢిల్లీ, హర్యానాల మధ్య వివాదం నెలకొంది. దీంతో ఈ విషయంపై రాజకీయంగా ఉద్రిక్తత నెలకొంది. నది నీరు విషయంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ప్రస్తుతం నది ప్రవహించే ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. దీంతో ఈ సమస్య పరిష్కారంపై సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది.

Next Story