ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఎంఆర్ఐ స్కానర్ తీసిన ఫోటోల విడుదల

by S Gopi |
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఎంఆర్ఐ స్కానర్ తీసిన ఫోటోల విడుదల
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎంఆర్ఐ స్కానర్ మానవ మెదడుకు సంబంధించిన మొదటి ఫోటోలను అందించింది. ఇది మానవుడి మెదడులోని రహస్యాలను, పలు అనారోగ్యాలను మరింత ఖచ్చితత్వంతో కనుగొనేందుకు ఉపయోగపడుతుంది. ఫ్రాన్స్‌కు చెందిన అటామిక్ ఎనర్జీ కమిషన్(సీఈఏ) పరిశోధకులు మొదటిసారిగా 2021లో గుమ్మడికాయను స్కాన్ చేయడానికి ఈ యంత్రాన్ని ఉపయోగించారు. ఇటీవలే అధికారులు మానవుల మెదడును స్కాన్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత కొన్ని నెలలుగా దాదాపు 20 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లు మొదటిసారి మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) మెషిన్ ద్వారా స్కాన్ చేయించుకున్నారు. సీఈఏలో ఇంతకుముందెన్నడూ లేని ఖచ్చితత్వంతో ఈ ఎంఆర్ఐ స్కాన్ పనిచేయడం చూశామని ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న భౌతిక శాస్త్రవేత్త అలెగ్జాండర్ విగ్నాడ్ అన్నారు.

ఈ స్కానర్ 11.7 టెస్లాస్ మాగ్నటిక్ ఫీల్డ్‌ను సృష్టించింది. ఇది ఆసుపత్రులలో సాధారణంగా ఉపయోగించే ఎంఆర్ఐ స్కానర్ల కంటే 10 రెట్లు ఎక్కువ ఖచ్చితమైన ఫోటోలను స్కాన్ చేసింది. సాధారణ ఎంఆర్ఐ స్కానర్ మూడు టెస్లాలకు మించి ఉండదు. ఈ యంత్రం ద్వారా సెరిబ్రల్ కార్టెక్స్‌కు ఆహారం అందించే చిన్న నాళాలు, ఇప్పటి వరకు దాదాపు కనిపించని సెరెబెల్లమ్ వివరాలను మనం చూడవచ్చని అలెగ్జాండర్ తెలిపారు. ఫ్రెంచ్, జర్మన్ ఇంజనీర్ల భాగస్వామ్యంతో రెండు దశాబ్దాల పరిశోధన ఫలితంగా ఈ డిజైన్ యంత్రం రూపొందించబడింది. యూఎస్, దక్షిణ కొరియా ఇలాంటి శక్తివంతమైన ఎంఆర్ఐ స్కానర్లపై పనిచేస్తున్నాయి. కానీ ఇంకా మనుషుల చిత్రాలను స్కాన్ చేయడం ప్రారంభించలేదు.

పార్కిన్సన్స్ లేదా అల్జీమర్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధుల వెనుక ఉన్న అంతుచిక్కని రహస్యాల గురించి కూడా స్కానర్ మెరుగైన ఫలితాలను ఇస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఉదాహరణకు, మెదడులోని నిర్దిష్ట ప్రాంతం హిప్పోకాంపస్.. అల్జీమర్స్ వ్యాధి బారిన పడిందని తెలుసు, కాబట్టి సెరిబ్రల్ కార్టెక్స్‌లోని ఈ భాగంలో కణాలు ఎలా పనిచేస్తాయో కనుగొనగలమని మేము ఆశిస్తున్నామని సీఈఏ పరిశోధకుడు అన్నె-ఇసాబెల్ ఎటిన్‌వ్రే పేర్కొన్నారు. లిథియం వంటి బైపోలార్ డిజార్డర్‌కు చికిత్స చేయడానికి ఉపయోగించే కొన్ని మందులు మెదడు ద్వారా ఎలా సరఫరా చేయబడతాయో కూడా శాస్త్రవేత్తలు తెలుసుకోవాలని భావిస్తున్నారు. ఈ ఎంఆర్ఐ స్కానర్ సృష్టించే బలమైన మాగ్నటిక్ ఫీల్డ్‌ మెదడులోని ఏ భాగాలను లిథియం లక్ష్యంగా చేసుకుంటుందో స్పష్టమైన ఫోటోలను ఇస్తుంది. ఏ రోగులు ఔషధానికి మెరుగ్గా లేదా అధ్వాన్నంగా స్పందిస్తారో గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. అనేక హానికరమైన వ్యాధులను మన అర్థం చేసుకోగలిగితే వాటిని ముందుగా గుర్తించి, మెరుగైన చికిత్స అందించవచ్చని అన్నె ఇసాబెల్ వెల్లడించారు.

Advertisement

Next Story