మహిళలకు సమాన భాగస్వామ్యమిస్తే ప్రపంచమంతా సంతోషమే : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

by Vinod kumar |
మహిళలకు సమాన భాగస్వామ్యమిస్తే ప్రపంచమంతా సంతోషమే : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
X

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళ ప్రాధాన్యతను తెలియజేస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ మహిళలు అలుపెరగని స్ఫూర్తి పై ఒక కథనాన్ని ఆమె పంచుకున్నారు. మానవాళి పురోగతిలో మహిళలను సమాన భాగస్వాములను చేస్తే మన ప్రపంచం సంతోషకరమైన ప్రదేశం గా ఉంటుందన్నారు. ‘ప్రతి మహిళ కథే తన కథ’ పేరుతో సమాజంలో మహిళ స్థానాన్ని గురించి చర్చించారు. 21వ శతాబ్దంలో మనం అన్ని రంగాల్లో అనూహ్యమైన పురోగతిని సాధించినప్పటికీ.. ఇప్పటి వరకు అనేక దేశాల్లో మహిళా దేశాధినేత లేదా ప్రభుత్వాధినేత కాలేకపోయిందని అన్నారు.

‘ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధ్యక్షురాలిగా నా ఎన్నిక మహిళా సాధికారత కథలో ఒక భాగం’ అని ఆమె తెలిపారు. వారు ఎంచుకున్న రంగాల్లో లెక్కలేని సంఖ్యలో మహిళలు దేశాన్ని నిర్మించడంలో భాగస్వామ్యులు అవుతున్నారని చెప్పారు. ‘క్షేత్ర స్థాయిలో వ్యవస్థల్లో నిర్ణయాత్మక వ్యవస్థలో మహిళల ప్రాధాన్యత మెరుగ్గానే ఉంది. అయితే స్థాయి పెరుగుతున్న కొద్ది మహిళల సంఖ్య తగ్గుతుంది’ అని గుర్తు చేశారు. సామాజంలో ఈ తరహా ధోరణి మారుతుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. శాంతియుతమైన, సంపన్నమైన సమాజాన్ని నిర్మించాలంటే.. లింగ అసమానత ఆధారంగా పాతుకుపోయిన పక్షపాతాలకు విముక్తి పొందడం అవసరమన్నారు.

Advertisement

Next Story