- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ యోగా గురువు భారత్- ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచ యోగా గురువుగా భారత్ ఉద్భవించిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. భారత్ చేసిన కృషి వల్లే 2015 నుంచి యోగాకు అంతర్జాతీయ ప్రాశస్త్యం లభించిందని తెలిపారు. యోగా అనేది ఇప్పుడొక దైనందిన కార్యక్రమంగా మారిందని పేర్కొన్నారు. విదేశాల్లోనూ యోగా చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించిన పదో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మోడీ పాల్గొన్నారు. శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున దాదాపు 7వేల మంది సామూహికంగా యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ.. భారీ వర్షం వల్ల వేదికను షేర్-ఏ-కశ్మీర్ సమావేశ కేంద్రానికి మార్చారు. ఈకార్యక్రమం సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. ఫ్రాన్స్‌కు చెందిన 101 ఏళ్ల మహిళా యోగా గురును ఈ ఏడాది పద్మశ్రీతో సత్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆమె ఎప్పుడూ భారత్‌కు రాకపోయినప్పటికీ.. యోగాపై ఫ్రాన్స్‌లో ప్రజలకు అవగాహన కల్పించేందుకు విశేష కృషి చేశారన్నారు. ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల్లో యోగాపై అధ్యయనాలు జరుగుతున్నాయని.. ఇప్పటికే అనేక రీసెర్చ్ పేపర్లు పబ్లిష్ అయ్యాయని ఆయన తెలిపారు. అనేక దేశాల ప్రభుత్వాధినేతలు యోగా ప్రాముఖ్యత గురించి తనను అడిగి తెలుసుకున్నారని చెప్పారు.
కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు..
రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇతర అధికారులతో కలిసి యోగా చేశారు. న్యూఢిల్లీలోని యమునా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన యోగా వేడుకల్లో కేంద్ర మంత్రి జేపీ నడ్డా, కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా, బీజేపీ ఢిల్లీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా పాల్గొన్నారు. లక్నోలో యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం ఆదిత్యనాథ్ యోగా చేశారు. కేంద్ర మంత్రులు జైశంకర్, అశ్వినీ వైష్ణవ్, బీఎల్ వర్మ, కిషన్ రెడ్డి, ప్రహ్లాద్ జోషి, హెచ్‌డీ కుమారస్వామి, కిరణ్ రిజిజు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన యోగా దినోత్సవాల్లో పాల్గొన్నారు.
భారత్ సరిహద్దుల్లోని సైనికుల దగ్గరి నుంచి ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య యుద్ధనౌకలోని సైనికుల వరకు అందరూ యోగా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దు సమీపంలోని బనస్కాంత జిల్లాలో ఉన్న నాడబెట్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ యోగా వేడుకల్లో పాల్గొన్నారు. మంచు కొండలపై భారత సైనికులు యోగా చేశారు. సిక్కింలోని ముగుతాంగ్ సబ్ సెక్టార్‌లో ఐటీబీపీ జవాన్లు 15,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో యోగాసనాలు వేశారు.
విదేశాల్లోనూ ఘనంగా వేడుకలు
అమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న టైమ్స్ స్క్వేర్ వద్ద కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన కార్యక్రమంలో దాదాపు 10వేలమంది యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం ఆ దేశ సాంస్కృతిక, క్రీడల మంత్రిత్వ శాఖతో కలిసి రాజధాని టెల్ అవీవ్‌లో యోగా కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనిలో దాదాపు 300 మందికిపైగా పాల్గొన్నారు. గతేడాది అక్టోబర్ 7 నుంచి పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ వద్ద బందీలుగా ఉన్న వారికి న్యాయం చేయాలని వారు కోరారు. ఈమేరకు సందేశంతో తమ యోగా మ్యాట్‌లకు బందీల ఫొటోలను అతికించుకున్నారు. ఐర్లాండ్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి యోగా వేడుకలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో షాంఘైలోని లింగ్షాన్ బుద్ధుడి ప్రతిమ వద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్న క్రికెట్ గ్రౌండ్‌లో యోగా వేడుకలను నిర్వహించారు.