Waqf boards: వక్ఫ్ బోర్డులలో ఇద్దరు మహిళలు ఉండేలా సవరణ బిల్లును ప్రతిపాదించిన కేంద్రం

by S Gopi |
Waqf boards: వక్ఫ్ బోర్డులలో ఇద్దరు మహిళలు ఉండేలా సవరణ బిల్లును ప్రతిపాదించిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: వక్ఫ్ బోర్డుల సంస్కరణకు సంబంధించి ప్రతిపాదించిన సవరణ బిల్లు ద్వారా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. బోర్డులో మహిళా సభ్యులను చేర్చాలని సిఫార్సు చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ బిల్లు ప్రకారం, అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్ర మండలిలో ఇద్దరు మహిళలను నియమించనున్నారు. ప్రస్తుతం మసీదులు, ఇస్లామిక్ మతపరమైన సహాయం, రక్షణ కల్పించే వక్ఫ్ బోర్డులు లేదా కౌన్సిల్‌లలో మహిళా సభ్యులు లేరు. వక్ఫ్ బోర్డు అధికారాలను పరిమితం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. ఈ చట్టానికి సంబంధించి మొత్తం 40 సవరణలను శుక్రవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 'ముస్లిం మహిళలు, పిల్లలు ఈ చట్టం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎవరైనా మహిళ విడాకులు తీసుకుంటే ఆమె, ఆమె పిల్లలకు ఎలాంటి హక్కులు లేవు. అందుకని ప్రతి స్టేట్ బోర్డులో ఇద్దరు మహిళలు, సెంట్రల్ కౌన్సిల్‌లో ఇద్దరు మహిళలు ఉండేలా సవరణకు ప్రతిపాదించినట్టు ప్రభుత్వ వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. ఈ సవరణలు పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా ఉన్నాయి. ప్రస్తుత చట్టం ప్రకారం, వక్ఫ్ ఆస్తిని ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేయలేం. సౌదీ అరేబియా, ఒమన్ లాంటి ముస్లిం దేశాల్లో కూడా అలాంటి చట్టం లేదు. ఒకసారి ఏదైనా స్థలం వక్ఫ్‌కు వెళితే దానిపై పోరాడేందుకు వీలవదు. శక్తివంతమైన ముస్లింలు వక్ఫ్ బోర్డును స్వాధీనం చేసుకోవడం వల్ల ఇది పెద్ద అడ్డంకిగా మారుతోంది. వక్ఫ్ బోర్డులను నియంత్రించే వారే సవరణ బిల్లును వ్యతిరేఇస్తున్నారని ప్రభుత్వ వర్గాలు వివరించాయి.

Advertisement

Next Story

Most Viewed