National Security Fab : అమెరికా-భారత్ జట్టు.. కోల్‌కతాలో సెమీకండక్టర్ ప్లాంటు.. విశేషాలివీ

by Hajipasha |
National Security Fab : అమెరికా-భారత్ జట్టు.. కోల్‌కతాలో సెమీకండక్టర్ ప్లాంటు.. విశేషాలివీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఉక్రెయిన్ యుద్ధాన్నిఆపేందుకు, మానవతా సాయం చేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను ఆయన కొనియాడారు. అమెరికాలోని డెలావర్ రాష్ట్రం విల్మింగ్టన్ పట్టణంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈవివరాలను బైడెన్ వెల్లడించారు. 2025 చివరికల్లా భారతీయులను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు పంపించే మిషన్‌పై ఇస్రో, నాసాలు సంయుక్తంగా పనిచేయనున్నాయి. ఈ ప్రాజెక్టు భారత్-అమెరికా బంధం బలపడుతున్న తీరుకు నిదర్శనమని అమెరికా ప్రెసిడెంట్ చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో అధునాతన సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటును ఇరుదేశాలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయని తెలిపారు. ఆ ప్లాంటుకు అవసరమైన అధునాతన టెక్నాలజీని అమెరికా సైన్యం, రక్షణశాఖలు సమకూరుస్తాయని ప్రకటించారు.

సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటు గురించి..

మోడీ పర్యటన సందర్భంగా కోల్‌కతాలో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటు ఏర్పాటుపై అమెరికా - భారత్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ ప్లాంటులో అధునాతన టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థలు, గ్రీన్ ఎనర్జీ యాప్స్, పవర్ ఎలక్ట్రానిక్స్‌, అడ్వాన్స్‌డ్ సెన్సింగ్ ఇన్‌ఫ్రారెడ్ చిప్స్‌, ఏఐ పరికరాలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సామగ్రిని అభివృద్ధి చేయనున్నారు. భారత్‌కు చెందిన సెమీకండక్టర్ మిషన్ నుంచి ఈ ప్లాంటుకు సహాయ సహకారాలు లభించనున్నాయి. భారత్ సెమీ, 3ఆర్‌డీఐ టెక్, యూఎస్ స్పేస్ ఫోర్స్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్లాంటును నడపనున్నారు. ఈవివరాలను అమెరికా వైట్ హౌస్ వెల్లడించింది. కోల్‌కతాలోని సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటులో తయారయ్యే సెన్సింగ్ చిప్స్‌ను నైట్ విజన్, మిస్సైల్ గైడెన్స్, స్పేస్ సెన్సర్లు, డ్రోన్లు, శాటిలైట్లు, యుద్ధ విమానాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, డాటా సెంటర్లు, రైల్వే ఇంజిన్లు, రాడార్లు, 5జీ/6జీ టెలికాం వ్యవస్థలలో వాడనున్నారు. తొలివిడతలో ఈ ప్లాంటులో దాదాపు 50వేల యూనిట్లను ఉత్పత్తి చేయనున్నారు. దీని ద్వారా దాదాపు 700 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

‘సరస్వతి’.. ‘దుర్గ’..

కోల్‌కతాలోని సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటులో ‘సరస్వతి’ పేరుతో ఒక నాలెడ్జ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఏటా 100 మందికి అధునాతన టెక్నాలజీలపై ట్రైనింగ్ ఇస్తారు. ఈ ప్లాంటులో ‘దుర్గ’ పేరుతో ప్రత్యేక డిజైన్ సెంటరును ఏర్పాటు చేస్తారు. దీనిలోనూ ఏటా 250 మందికి శిక్షణ ఇస్తారు.

Next Story