Freebies : ఉచిత పథకాలను నిలిపివేస్తాం.. మహారాష్ట్ర సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

by Hajipasha |
Freebies : ఉచిత పథకాలను నిలిపివేస్తాం.. మహారాష్ట్ర సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఉచిత పథకాల పేరుతో వృథా చేసేందుకు డబ్బులున్నాయి కానీ, అక్రమంగా భూమిని కోల్పోయిన వ్యక్తికి పరిహారాన్ని ఇచ్చేందుకు డబ్బుల్లేవు అంటూ మండిపడింది. మహారాష్ట్రలో ఆరు దశాబ్దాల క్రితం ఆక్రమణకు గురైన ఓ భూవివాదంపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పూర్వీకుల భూమిని లాక్కోవడం వల్ల తనకు జరిగిన అన్యాయానికి రూ.317 కోట్ల పరిహారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని పిటిషన్‌దారు వాదించాడు. అయితే రూ.37 కోట్లే ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై స్పందించే క్రమంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

‘‘రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఉచిత పథకాల కోసం వృథా చేయడానికి వేల కోట్లు వస్తాయి. అక్రమంగా లాక్కున్న భూమికి పరిహారం ఇచ్చేందుకు మాత్రం డబ్బులు ఉండవు’’ అని దేశ సర్వోన్నత న్యాయస్థానం బెంచ్ కామెంట్ చేసింది. ‘‘మహారాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరిగ్గాలేదు. బాధితులకు పరిహారం చెల్లించేంత వరకూ రాష్ట్రంలో ఉచిత పథకాలన్నీ నిలిపేస్తాం’’ అని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి 24 గంటల టైం సరిపోతుందని, అయినా తాము మూడు వారాల గడువు ఇస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఆగస్టు 28కి వాయిదా వేసింది. అప్పటిలోగా ప్రభుత్వం సరైన ప్రతిపాదనతో రాకుంటే తగిన ఆదేశాలు జారీ చేస్తామని కోర్టు పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed