50 శాతం పరిమితిని తొలగిస్తాం.. ఎంత అవసరమైతే అంత రిజర్వేషన్ ఇస్తాం : రాహుల్ గాంధీ

by Dishanational6 |
50 శాతం పరిమితిని తొలగిస్తాం.. ఎంత అవసరమైతే అంత రిజర్వేషన్ ఇస్తాం : రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: రిజర్వేషన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కుల అధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తుందని హామీ ఇచ్చారు. అవసరమైన మేరకు రిజర్వేషన్లు కల్పిస్తామని అన్నారు. దళితులు, వెనకబడిన వర్గాలు, గిరిజనులకు రిజర్వేషన్ వల్ల ప్రయోజనం చేకూరుతుందన్నారు. మధ్యప్రదేశ్ రత్లామ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ముగించాలని, మార్చాలని కోరుకుంటున్నాయని.. కాంగ్రెస్, ఇండియా కూటమి రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. రాజ్యాంగం ప్రజలకు జల్ (నీరు), జంగల్ (అడవి), జమీన్ (భూమి)పై హక్కులు కల్పించిందని తెలిపారు. అయితే, ప్రధాని మోడీ రాజ్యాంగాన్ని తొలగించేందుకు పూర్తి అధికారం కావాలని కోరుతున్నారని చెప్పారు. తాము గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీ నేతలు ప్రకటించారని అన్నారు. అందుకే వారు 400 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. 400 మర్చిపోండీ, 150 సీట్లు కూడా రావని బీజేపీని ఉద్దేశించి అన్నారు.

ఆదివాసీలపై అఘాయిత్యాలకు సంబంధించిన వార్తలను మీడియా చూపించదని అన్నారు. మీ పిల్లలపై అత్యాచారం, మీ భూమి లాక్కున్నారు.. కానీ మీడియాలో అవేవీ చూపించరని అన్నారు. దానికి కారణం.. మీడియా సంస్థల్లో ఆదివాసీలు లేరని తెలిపారు. 90 మంది బ్యూరోక్రాట్లు దేశాన్ని నడుపుతున్నారని అన్నారు. అందులో ఒకరు మాత్రమే ఆదివాసీ, ముగ్గురు వెనకబడిన తరగతులకు చెందిన వారు, ముగ్గురు దళిత వర్గాలనికి చెందిన వారని చెప్పారు. మీ వర్గం ప్రజలు మీడియాలో, కార్పొరేట్‌లో లేరని.. దీన్ని మార్చాలని అనుకుంటున్నామని అన్నారు. అందుకే కులగణన, ఆర్థిక సర్వే చేపట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రైతులకు ఎంఎస్పీ ఇవ్వడంతో పాటు రుణమాఫీ రూపంలో రైతులకు ఉపశమనం కల్పిస్తామని చెప్పారు.

Next Story

Most Viewed