- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్య రామాలయంపై కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు.. పేదరికాన్ని నిర్మూలిస్తుందా? అంటూ ప్రశ్న.. ఇంకా ఏమన్నారంటే..
దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్య రామ మందిరంపై కర్ణాటక కార్మికశాఖ మంత్రి సంతోష్ లాడ్ సోమవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామాలయ నిర్మాణం పేదరికాన్ని నిర్మూలించగలదా? అంటూ ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే ఆలయాన్ని నిర్మించారని ఆరోపించారు. ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘‘అయోధ్య రామాలయం దేశంలోని పేదరికాన్ని నిర్మూలించదు. రాజకీయ లబ్ధి పొందేందుకే బీజేపీ ఈ మందిరాన్ని నిర్మించింది. అయినప్పటికీ, ఆలయ నిర్మాణాన్ని మేం వ్యతిరేకించడం లేదు. కానీ, ఆలయాన్ని సరైన ప్రదేశంలో నిర్మించలేదు. సుప్రీంకోర్టు చెప్పిన చోట కాకుండా మరో స్థలంలో నిర్మించారు’’ అని వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, అసలు రామ మందిరం నిర్మించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమైనా ఉందా? అంటూ ప్రశ్నించారు. ‘‘ఆ ఆలయం వల్ల ఏమైనా నీకేమైనా(ప్రజలను ఉద్దేశించి) లాభం జరిగిందా? మన అక్కాచెల్లెళ్లకు ఏమైనా లబ్ధిచేకూరిందా? కనీసం రైతులైనా ప్రయోజనం పొందారా? ఆలయ నిర్మాణంతో వాళ్లకేమైనా లాభం జరిగితే.. ఇప్పుడు నిరసనలు ఎందుకు చేస్తున్నారు? అన్నదాతలపై బుల్డోజర్లు, టియర్ గ్యాస్‌ను ప్రయోగిస్తున్నారు?’’ అంటూ సంతోష్ ప్రశ్నించారు.
బీజేపీ నేతల ఆగ్రహం
సంతోష్ లాడ్ వ్యాఖ్యలపై కర్ణాటకలోని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ, ‘‘500 ఏళ్ల క్రితం రామ్‌లల్లా ఉన్న చోటనే ఇప్పుడు ఆలయం నిర్మించారు. దాన్ని నిర్ధారించడానికి సంతోష్ 500 ఏళ్ల క్రితం పుట్టలేదు. కాబట్టి, ఆ అంశాన్ని వదిలేసి, రాష్ట్రంపై దృష్టిపెడితే బాగుంటుంది’’ అంటూ హితవు పలికారు. మరోవైపు, సంతోష్ వ్యాఖ్యలను మాజీ డిప్యూటీ సీఎం అశ్వథ్‌నారాయణ్ ఖండించారు. ‘‘సంతోష్ లాడ్‌కు రామమందిర చరిత్ర తెలియాలి. గుడి కట్టినందుకు ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఆయన రాజకీయాలు కాకుండా వాస్తవాలు మాట్లాడాలి. సంతోష్ ప్రకటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని వెల్లడించారు.
తప్పేముంది: రిజ్వాన్
మరోవైపు, సంతోష్ లాడ్‌కు కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ మద్దతుగా నిలిచారు. ‘‘నిజాలు మాట్లాడితే తప్పేముంది? రామాలయంతోపాటు ప్రజలను భావోద్వేగాలకు గురిచేసే ఎన్నో అంశాలను బీజేపీ రాజకీయ లబ్ధికి వాడుకుంటోంది. చెప్పుకోవడానికి వారు చేసిన అభివృద్ధి పనులు ఏం ఉండవు. అందుకే, అన్ని రకాల ఎన్నికల్లోనూ వారు భావోద్వేగ సమస్యలను మాత్రమే ఉపయోగించుకుంటారన్నది జగమెరిగిన సత్యం’’ అని ఆరోపించారు.