మోడీకి మెజారిటీ తగ్గడంపై సంబరాలు చేసుకుంటున్న చైనా

by S Gopi |
మోడీకి మెజారిటీ తగ్గడంపై సంబరాలు చేసుకుంటున్న చైనా
X

దిశ, నేషనల్ బ్యూరో: పొరుగువారు మంచివారైతే ఎవరైనా ఇష్టపడతారు, కానీ వారి కన్నా ఎదుగుతుంటే మాత్రం ఓర్వలేరు. ప్రపంచంలో భారత్ విషయంలో చైనా కంటే మరే దేశానికి పెద్దగా పట్టింపు ఉండదు. ఆసియాలో భారత్ తన బలాన్ని చైనాకు సమానంగా కలిగి ఉండటమే ఇందుకు కారణం. మరీ ముఖ్యంగా తయారీలో భారత్ సాధిస్తున్న వేగవంతమైన వృద్ధి, వేగవంతమైన ఆర్థికవ్యవస్థ సాగుతున్న తీరు చైనాకు ముప్పుగా మారుతోంది. అందుకే కాబోలు 2024 భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలను చైనా ఎంతో ఆసక్తికరంగా గమనించింది. జూన్ 4న వెలువడిన ఫలితాల్లో ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం ఖరారు అయినప్పటికీ ఆయన పార్టీ బీజేపీకి సొంత మెజారిటీ రాలేదు. ప్రధాని మోడీ బలం తగ్గిందనే సంతోషం చైనాలో కనిపించిందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. సంకీర్ణ రాజకీయాలు భారీ సంస్కరణలు, నిర్ణయాత్మక చర్యలను అడ్డుకుంటాయని అందరికీ తెలుసు. చైనా మీడియా, నిపుణులు సరిగ్గా ఈ విషయాన్ని ముందుకు తెస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ టైమ్స్ వార్తా సంస్థ భారత లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తన నివేదికలో.. మోడీ నేతృత్వంలోని కూటమి కేవలం స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది. కాబట్టి ఆయన మూడో టర్మ్‌లో ఆర్థిక సంస్కరణలు కష్టమే అని పేర్కొంది. అలాగే, చైనా తయారీతో పోటీ పడాలని, భారత తయారీ రంగాన్ని మెరుగుపరచాలనే మోడీ ఆశయం నెరవేరడం కష్టమేనని వారి నిపుణులు చెప్పారు. దీన్ని బట్టి భారత ఆర్థికవ్యవస్థ, ఆర్థిక సంస్కరణలపై ప్రధాని మోడీ దృష్టి సారిస్తే భారత్ తయారీ కేంద్రంగా మారడం, అది చైనా ఆర్థిక అవకాశాలను దెబ్బతీయడం గురించి డ్రాగ కంట్రీ ఎంతలా ఆందోళన చెందుతోందో స్పష్టం చేస్తుంది.

ఈ నేపథ్యంలో ఇప్పుడు నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చింది. 2022లో బ్రిటన్‌ను అధిగమించి భారత్ ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించింది. దాంతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థికవ్యవస్థగానే కాకుండా 2023-24లో 8 శాతం జీడీపీ వృద్ధి అంచనాను సాధించింది. క్లిష్ట దశలో ఉన్నందున భారత్ రాబోయే పాతికేళ్లలో తనకున్న యువ జనాభా నుంచి మెరుగైన వృద్ధిని సాధించగలదు. తద్వారా మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాన్ని కలిగి ఉందని నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి భారత్‌కు సాహసోపేతమైన పెట్టుబడి నిర్ణయాలకు ఇది సరైన సమయం. తయారీని ప్రోత్సహించడమే కాకుండా సేవా రంగాన్ని మరింత బలోపేతం చేయాలని వారు సూచిస్తున్నారు. మెరుగైన పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థలు, అధిక-నాణ్యత, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు అవసరం. సవాళ్లు ఎదురైన వెనుకంజ వేయని దృక్పథంతో భారత ప్రభుత్వం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.

గ్లోబల్ తయారీ కంపెనీలు చైనాలో ఉన్న నియంతృత్వ ఏక-పార్టీ వ్యవస్థకు వ్యతిరేకంగా శక్తివంతమైన ప్రజాస్వామ్య విధానాలను ఆశిస్తున్నాయి. అందుకు వారు బలమైన మూలాధారాలు కలిగిన దేశాన్ని ప్రేమిస్తారు. దానికి వారు చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌ను చూస్తున్నారు. కాబట్టి ఎన్నికలు వస్తాయి, పోతుంటాయి. అయితే భారత్ తన వృద్ధి వేగాన్ని కొనసాగించే విధానాన్ని కొనసాగించేలా చూసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed