కచ్చతీవును తిరిగివ్వాలని శ్రీలంకను ఎందుకు అడగలేదు: మోడీని ప్రశ్నించిన స్టాలిన్

by samatah |
కచ్చతీవును తిరిగివ్వాలని శ్రీలంకను ఎందుకు అడగలేదు: మోడీని ప్రశ్నించిన స్టాలిన్
X

దిశ, నేషనల్ బ్యూరో: కచ్చతీవు అంశంపై తమిళనాడు సీఎం స్టాలిన్ మరోసారి ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కచ్చతీవు అంశాన్ని లేవనెత్తిన బీజేపీ.. పదేళ్లుగా ఆ ద్వీపాన్ని భారత్‌కు ఇవ్వాలని శ్రీలంకను ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. మోడీ శ్రీలంకకు వెళ్లి అక్కడి అధ్యక్షుడిని కలిసినప్పుడు కచ్చతీవు గుర్తుకు రాలేదా అని తెలిపారు. ‘ప్రధాని మోడీ రెండేళ్ల క్రితం చెన్నయ్‌కి వచ్చినప్పుడు ఓ మొమోరాండం అందజేశాను. జీఎస్టీ నిధుల విడుదల, నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు వంటి అంశాలపై అభ్యర్థించారు. అందులో మొట్టమొదటిది భారత మత్స్యకారుల హక్కు అయిన కచ్చతీవు ద్వీపాన్ని తిరిగి పొందాలని పేర్కొన్నాను. ఆ విషయం మోడీకి గుర్తుందా? కనీసం ఆ మొమోరాండాన్ని చదివారా?’ అని ప్రశ్నించారు. 2015లో అప్పటి విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ కచ్చతీవు భారత్‌లో భాగం కాదని చెప్పారని, కానీ ప్రస్తుతం ఎన్నికలు ఉన్నందున వారి ప్రకటనను మార్చుకున్నారని ఆరోపించారు.

‘కచ్చతీవు ద్వీపంపై ఎన్నో ఏళ్లుగా పార్లమెంట్‌లో ప్రశ్నలు సంధించినా సరైన సమాధానం రాలేదు. సుప్రీంకోర్టు కూడా సమాచారం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది’ అని వ్యాఖ్యానించారు. ‘కచ్చతీవుపై ప్రధాని మోడీ హఠాత్తుగా మొసలి కన్నీరు కారుస్తున్నారు. గత పదేళ్లలో తమిళ జాలర్లను శ్రీలంక నేవీ పట్టుకుని కాల్చి చంపడం గురించి మోడీ ఎప్పుడూ మాట్లాడలేదు. శ్రీలంక చర్యలను ఏనాడూ ఖండించలేదు’ అని విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని 30ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు పెట్టడంపై స్పందిస్తూ..దీనిపై మోడీ ఎందుకు మాట్లాడటం లేదని, చైనాని ఎదిరించే ధైర్యం లేదా? అని ప్రశ్నించారు. కాగా, భారత్‌కు చెందిన కచ్చతీవు ద్వీపాన్ని కాంగ్రెస్ శ్రీలంకకు అప్పగించిందని ఆరోపిస్తూ మోడీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed