సింహాల పేర్లను మార్చాలని బెంగాల్ ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు ఆదేశాలు

by S Gopi |
సింహాల పేర్లను మార్చాలని బెంగాల్ ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు ఆదేశాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి సఫారీ పార్క్‌లో అక్బర్‌, సీత పేర్లున్న మగ, ఆడ సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచిన వివాదానికి సంబంధించి కలకత్తా హైకోర్టు గురువారం వాటి పేరు మార్చాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ వ్యవహారంలో త్రిపుర నుంచి ఇటీవల బెంగాల్‌కు తీసుకొచ్చిన ఆడ సింహానికి పేరు మార్చాలని విశ్వ హిందూ పరిషత్ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం కోర్టు విచారించింది. జస్టిస్ సౌగత భట్టాచార్యతో కూడిన సింగిల్ జడ్జి బెంచ్, వివాదాలకు దూరంగా ఉండాలని, జంతువుల పేర్లను మార్చే అంశాన్ని పరిగణించాలని రాష్ట్రాన్ని కోరింది. 'మీరు సింహానికి హిందూ దేవత, ముస్లిం ప్రవక్త లేదా క్రైస్తవ దేవుడు లేదా స్వాతంత్ర్య సమరయోధులు లేదా నోబెల్ బహుమతి గ్రహీత వంటి వారి పేర్లు పెడతారా? దేశ ప్రజలు గౌరవించే వారి పేర్లను పెడతారా?' అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రభుత్వం తరపున వాదిస్తున్న అదనపు అడ్వకేట్ జనరల్.. త్రిపురలో సింహాలకు పేర్లు పెట్టారని, బెంగాల్ రాష్ట్రం ఇప్పటికే సింహాల పేర్లను మార్చే పనిలో ఉందని బదులిచ్చారు. ఒక జంతువుకు దేవుడు, పౌరాణిక, స్వాతంత్ర్య సమరయోధులు, నోబెల్ బహుమతి గ్రహీతల పేర్లు పెట్టడం వెనుక ఉన్న కారణాలను కోర్టు ప్రశ్నించింది. త్రిపుర రాష్ట్రం ఇచ్చిన పేర్లు బెంగాల్ ప్రభుత్వం ఎందుకు సవాలు చేయలేదని అడిగింది. 'మీది సంక్షేమ, సెక్యులర్ ప్రభుత్వమైనప్పుడు సింహాల సీత, అక్బర్ పేర్లతో ఎందుకు వివాదాలు తీసుకొస్తున్నారు. దీన్ని మానుకోవాలి. సీత పేరు ఒక్కటే కాదు అక్బర్ పేరును కూడా తాము సమర్థించమన్నారు. అక్బర్ సమర్థవంతమైన మొఖల్ చక్రవర్తి. ఇప్పటికే ఆ సింహానికి ఆ పేరు ఉంటే దాన్ని పక్కనపెట్టాలని కోర్టు సూచించింది.

Advertisement

Next Story